Earthquake in Japan(Latest international news today): జపాన్ దేశాన్ని భూకంపం వణికిస్తున్నది. గురువారం రెండుసార్లు ఆ దేశంలో భూకంపం సంభవించింది. మొదటగా దక్షిణి తీర ప్రాంతంలో క్యుషు ద్వీపం వద్ద సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదయినట్లు అక్కడి వాతావరణ సంస్థ వెల్లడించింది. 30 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు కూడా పేర్కొన్నది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంప కేంద్రం సమీపంలోని విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయంటూ స్థానిక మీడియా వార్తా కథనాలు ప్రచురించింది.
అయితే, నిచినాన్, మియాజాకి సమీపంలోని పలు ప్రాంతాలపై భూకంపం ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. 1.6 అడుగుల ఎత్తులో అలలు కనిపించినట్లు జపాన్ వాతావరణ శాఖ పేర్కొన్నది. అధికారులు నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్లు చీఫ్ కేబినెట్ సెక్రటరీ తెలియజేశారు. ప్రభావిత ప్రాంత ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
Also Read: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్, వేటాడి ఊచకోత
అదేవిధంగా క్యుషు, షికోకు ప్రాంతంలోని న్యూక్లియర్ రియాక్టర్లు సురక్షితంగానే ఉన్నాయంటూ న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ స్పష్టం చేసింది. 2011లో సంభవించిన భూకంపం, సునామీతో పుకుషిమా అణుకేంద్రం దెబ్బతిన్నది. అప్పట్నుంచి ప్రకృతి ప్రకోపించినప్పుడల్లా ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇదిలా ఉంటే.. జపాన్ లో ప్రతి ఏటా సగటున 5 వేల చిన్నా పెద్దా భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే, అక్కడి ప్రజలు వీటిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.