ఇటీవల విమానంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ని అతని భార్య చెంపదెబ్బ కొట్టిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాంటి ఘటనే మరొకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడ భార్య, భర్తను కొట్టలేదు. కొడుకు తండ్రిని చితక్కొట్టాడు. ఆ కొడుకు చేతిలో దెబ్బలు తిన్న తండ్రి ఎలన్ మస్క్. మస్క్ ని కొట్టిన ఆ కొడుకు పేరు మిస్టర్ ఎక్స్.
వాస్తవానికి ఈ వ్యవహారం అంత తేలిగ్గా బయటపడేది కాదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మస్క్ బయటపెట్టాల్సి వచ్చింది. ఇటీవల ఎలన్ మస్క్ డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE) అనే అమెరికా ప్రభుత్వ విభాగానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మస్క్ కి వీడ్కోలు తెలిపేందుకు ట్రంప్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైట్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి మస్క్ కాస్త హడావిడిగా వచ్చారు. అంతే కాదు, ఆయన మొహంపై దెబ్బ అందరికీ స్పష్టంగా కనపడింది. కన్ను ఎర్రగా కందిపోయింది, ఎవరో గట్టిగా కంటిపై కొట్టినట్టు తెలుస్తోంది. మీటింగ్ అయిపోయాక విలేకరులు మస్క్ ని ఆ దెబ్బేంటి అని అడిగారు..? మస్క్ మామ మామూలోడు కాదు కదా మస్త్ సెటైరిక్ గా సమాధానం చెప్పాడు. నేనేమీ ఫ్రాన్స్ లో లేను అని జవాబిచ్చాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడిని అతడి భార్య చెంపదెబ్బ కొట్టిందని, తనకు మాత్రం అలాంటి సంఘటన ఎదురు కాలేదన్నారు.
దెబ్బ అంత బాగా కనపడుతుంటే జర్నలిస్ట్ లు వదిలిపెడతారా..? అసలు కారణం ఏంటో చెెప్పాలని పట్టుబట్టారు. దీంతో మస్క్ తన కొడుకే తనని తన్నాడని ఒప్పుకున్నాడు. ఐదేళ్ల వయసున్న తన పుత్రరత్నం మిస్టర్ ఎక్స్ గుర్రపు స్వారీ చేస్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్నప్పుడు తమాషాగా తనని కొట్టు అని తానే చెప్పానన్నారు మస్క్. అయితే తన కొడుకు అంత గట్టిగా కొడతాడనుకోలేదని చెప్పారు. మస్క్ కి మొత్తం 14మంది సంతానం. అందులో మిస్టర్ X అందరికంటే చిన్నవాడు. మస్క్ – గ్రీమ్స్ సంతానం ఎక్స్. అప్పట్లో ఇతని పేరు వివాదాస్పదమైంది. ఆ తర్వాత దాన్నికొంత మార్చారు మస్క్. ఆ చిన్న పిల్లవాడే ఇప్పుడు మస్క్ మొహం వాచిపోయేలా కొట్టాడు.
మస్క్ దెబ్బపై ట్రంప్ కూడా అదిరిపోయే సెటైర్ పేల్చారు. “X ఆ పని చేశాడా..? అవును, X ఆ పని చేయగలడు. మీకు X గురించి తెలియదు..” అని అన్నాడు ట్రంప్. మొత్తమ్మీద ఓవల్ ఆఫీస్ లో జరిగిన మస్క్ వీడ్కోలు సభ ఇలా సరదా సరదాగా సాగింది. మస్క్ మొహంపై దెబ్బ ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా మారింది. మస్క్ కి తగిలిన దెబ్బ అతడిని బాధపెట్టి ఉంటుందో లేదో కానీ.. ఓవల్ ఆఫీస్ లోని సభను మాత్రం అతను తప్పించుకోలేకపోయాడు. దీంతో అందరికీ ఆ దెబ్బ గురించి తెలిసింది. కొడుకు చేతిలో తన్నులు తిన్న మస్క్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. మస్క్ సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్, కొడుకు పేరుపై పెట్టిన X లో కూడా ఇదే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్.