Ghost Train: సమయం అర్దరాత్రి అయింది. ఒక బోగీ నెమ్మదిగా దానికై అదే స్టేషన్ కు వచ్చింది. రైలు ఇంజన్ లేదు.. నెంబర్ లేదు.. ఏమి లేదు.. కానీ ఆ బోగీ స్టేషన్ కు మాత్రం వచ్చింది. అందులోనూ రాత్రి వేళ రావడంతో అందరూ హడల్. కొందరు మాత్రం అమ్మో దెయ్యం.. భూతం అంటూ కేకలు వేస్తే, మరికొందరు మాత్రం అంతలేదని కొట్టిపారేశారు. ఏదిఏమైనా ఆ బోగీకి మాత్రం ఓ వెరైటీ పేరు మాత్రం పెట్టేశారు స్థానికులు. అసలు ఈ ఘటన ఎక్కడ? ఎప్పుడు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుంటే, షాక్ కు గురి కావాల్సిందే.
అసలు విషయంలోకి వెళితే..
ఒక రైలు స్టేషన్‌కు అర్థరాత్రి ఎలాంటి నెంబర్ లేని, ఖాళీగా ఉన్న బోగీ ఒక్కసారిగా ప్రవేశిస్తే? ప్రయాణికులకే కాదు, సిబ్బందికి కూడా షాక్ తగలదా? అచ్చం ఇలాంటి ఘటన 2017లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. అప్పటి నుంచి ఆ బోగీని భూత బోగీగా పిలవడం మొదలైంది. నిజంగా దానిలో దెయ్యమున్నదా? మరోవిధంగా చూడాల్సిన వాస్తవం ఉందా అనే విషయాలను తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ కథనం పూర్తిగా చదవండి.
ఒక అర్ధరాత్రి సమయంలో భోపాల్ రైల్వే స్టేషన్‌లోకి ఒక్కసారిగా ఓ బోగీ ప్రవేశించింది. దానిపై ఎలాంటి ట్రైన్ నెంబర్ లేదు. లోపల ఎవరూ లేరు. దాన్ని లాగిన ఇంజిన్ కూడా లేదు. ఈ నేపథ్యంలో స్టేషన్ వద్ద ఉన్న సిబ్బందిలో ఆందోళన మొదలైంది. కొందరు ప్రయాణికులు అక్కడి నుంచి పారిపోవడం మొదలుపెట్టారు. స్థానికంగా ఈ బోగీని భూత బోగీ, గోస్ట్ ట్రైన్ అంటూ పుకార్లు ఊపందుకున్నాయి.
అయితే ఈ పరిస్థితిని అతి త్వరగా రైల్వే అధికారులు సమీక్షించారు. విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఇది అసలు భోపాల్ సమీపంలోని కోచింగ్ డిపో నుంచి తప్పిపోయిన ఓ ఖాళీ కోచ్ అని తేలింది. రైల్వే మెకానికల్ విభాగంలో నిర్వహణ పనుల నిమిత్తం నిలిపిన ఆ బోగీని తాత్కాలికంగా ఒక వైపు ఉంచారు. కానీ అప్పట్లో అది సరైన రీతిలో బ్రేక్ లాక్ చేయకపోవడం వల్ల కొద్దిగా కదిలి, ఎత్తు తగ్గుతూ ఉండే రైలు మార్గంలో ప్రవేశించి చివరకు భోపాల్ స్టేషన్ వరకు వచ్చి ఆగింది. అది భారీ వేగంతో రాలేదు. ఎవరినీ గాయపరచలేదు. కానీ అర్థరాత్రి సమయంలో బోగీ వచ్చి ఆగడం, అంతా ఖాళీగా ఉండడం వల్ల ప్రజల్లో భయం నెలకొంది. ఎవ్వరూ ముందుగా అసలు కథను తెలుసుకోకముందే దానిని దెయ్యంతో కూడిన బోగీగా ముద్ర వేయడం జరిగింది.
ఘటనకు కారణం ఇదే..
ఇక్కడ కీలకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది పూర్తిగా టెక్నికల్ లోపం వల్ల జరిగిన ఘటన. రైల్వే శాఖ ప్రకారం, కొన్నిసార్లు నిర్వహణలో ఉండే కోచ్‌లు అవసరమైతే కొంత దూరం వరకు తరలించబడతాయి. కానీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో దెయ్యాలది ఏమీ కాదు. భయాలకి కారణం మాత్రం సమాచార లోపం, ఊహాగానాలే.
ఈ సంఘటన మీడియా ద్వారా బయటికి రాగానే చాలా యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా పేజీలు దీన్ని గోస్ట్ స్టోరీలా మార్చేశాయి. Haunted Bhopal Train, Ghost Coach Mystery వంటి టైటిల్స్‌తో వీడియోలు వచ్చాయి. అయితే చాలా వరకు అవి వైరల్ కావాలనే ఉద్దేశంతో మరికాస్త తాలింపు వేసి మరీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ తమ మెదడుకు పని చెప్పారు. నిజానికి అక్కడ ఎలాంటి భూత ప్రభావం లేదని అధికారికంగా రైల్వే శాఖ స్పష్టంగా తెలిపింది.
Also Read: Jet Speed Train in India: జెట్ స్పీడ్ ట్రైన్ వస్తోంది.. ఇక ఆగేదే లేదు!
ఇలాంటి సంఘటనలు మన దేశంలో అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ఒకప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లోనూ రాత్రి పూట స్టేషన్‌కు ప్రవేశించిన ఖాళీ ట్రైన్ గురించి ఇదే విధమైన భయానక కథనాలు వైరల్ అయ్యాయి. కానీ తరువాత వాటికి కూడా సాధారణ సాంకేతిక లోపమే కారణమని తేలింది. భయాన్ని కలిగించే పాత రైలు కోచ్‌లు, శబ్దాలు లేదా శూన్యంగా ఉండే భవనాలే కాదు, వాటి చుట్టూ ఉన్న మూఢనమ్మకాలు, అపోహలే ప్రజల్లో ఎక్కువ భయం కలిగిస్తుంటాయి. నిజానికి ఇది మన మానసిక అభిప్రాయాల ఫలితమే. కొంతమంది యువత ఈ తరహా సంఘటనలను థ్రిల్ కోసమో, సోషల్ మీడియా ఫేమ్ కోసం వీడియోల రూపంలో ప్రచారం చేస్తూ మరింత భయం కలిగిస్తున్నారు.
భోపాల్ భూత బోగీ ఘటనలో మంచి విషయం ఏమిటంటే.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అది తృటిలో తప్పిన ప్రమాదం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఇది రైల్వే శాఖకు హెచ్చరికగా నిలిచింది. ఆ తర్వాత ఈ తరహా కోచ్‌లను మరింత భద్రతతో నిలిపేందుకు కఠిన మార్గదర్శకాలు అమలు చేశారు. మొత్తం మీద ఈ ఘటన ఒక విజ్ఞప్తిలా నిలిచింది. ఊహలకన్నా ముందుగా వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి గజిబిజీకి, గడుగుడు శబ్దానికి దెయ్యం అనిపెట్టుకోవడం మానేయాలి. నిజాలు తెలుసుకునే బాధ్యత మనదే. భయాన్ని కాకుండా సత్యాన్ని ముందుకు తీసుకెళ్లడమే సమాజానికి మంచిదని ఈ కథనం మనకు గుర్తుచేస్తోంది.