BigTV English

Fire Ants : వరదొచ్చినా.. ఆ చీమలు సేఫ్!

Fire Ants : వరదొచ్చినా.. ఆ చీమలు సేఫ్!

Fire Ants : ఆస్ట్రేలియాను ఇటీవల తుఫాను ముంచెత్తింది. ప్రధానంగా క్వీన్స్‌లాండ్, న్యూసౌత్‌వేల్స్‌లో వరదలు పోటెత్తాయి. వాటి వల్ల పెద్దగా వాటిల్లిన నష్టమేమీ లేదు. కానీ వరద గుప్పిట చిక్కుకున్న ప్రాంతాలకు కొత్త ముప్పు వచ్చి పడింది. ఆ వరద నీటిలో కొట్టుకొచ్చిన కొరివి చీమల(Fire ants) తెప్పలు ఆస్ట్రేలియన్లను బెంబేలెత్తిస్తున్నాయి.


ఈ చీమలతో పర్యావరణ వ్యవస్థలో అనూహ్య మార్పులు సంభవిస్తాయి. వ్యవసాయ నష్టం చెప్పలేనంతగా ఉంటుంది. వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా 500 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అంచనా. పేరుకు తగ్గట్టుగానే కొరివి చీమ కుడితే.. భరించలేనంత మంట పుట్టించే విషం మన శరీరంలోకి చేరుతుంది. ఒక్కో సారి మరణమూ సంభవిస్తుంది.

ఏటా ప్రతి ముగ్గురు ఆస్ట్రేలియన్లలో ఒకరు ఈ చీమ బారిన పడుతున్నారు. చీమ కాటుతో దాదాపు 83,100 మంది బాధితులకు వైద్యం అవసరమవుతోందని తెలుస్తోంది. సమూహంగా ఓ తెప్పలా ఏర్పడి నీటిపై తేలియాడుతూ వెళ్లగలగడం ఈ చీమల ప్రత్యేకత. ఒక దాని కాళ్లను మరొకటి పెనవేసుకుని లాక్ చేసుకుంటాయి.


అలా ఓ పెద్ద, దృఢమైన తెప్పలా ఏర్పడతాయి. చీమలన్నీ సమూహంగా ఉంటూ.. వరద నీటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతాయి. వరద నీటిలో ఈ చీమల తెప్పలు కనిపించడం ఇప్పుడు ఆస్ట్రేలియన్లను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ ప్రాంతంలో వీటి ఉనికి గణనీయంగా పెరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

నీటిలో తేలియాడుతున్న చీమల తెప్పలను ఓ రైతు వీడియో తీశాడు. ఇప్పటికే దక్షిణ బ్రిస్సేన్‌లో 7 లక్షల హెక్టార్లలో ఫైర్ యాంట్స్ విస్తరించాయి. దక్షిణ అమెరికాకు చెందిన ఈ చీమలు.. అక్కడ నుంచి అన్ని దేశాలకు విస్తరించాయి. వీటి శాస్త్రీయ నామం సోలినాప్సిస్ ఇన్విక్టా (Solenopsis invicta). తొలిసారిగా క్వీన్స్‌లాండ్‌లో 2001లో ఈ చీమలను గుర్తించారు. అప్పటి నుంచి వాటి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది.

అమెరికా నుంచి ఇవి ఇక్కడకు ఎలా చేరాయన్న దానిపై స్పష్టత లేకున్నా.. షిప్పింగ్ కంటెయినర్ల ద్వారా ఆస్ట్రేలియాలోకి ప్రవేశించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెక్కలున్న కొరివి చీమ అయితే దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు ఎగరగలదు. గాలివాటుకు ఇంకా ఎక్కువ దూరమే వెళ్లొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కో రాణి చీమ రోజుకు 5 వేల గుడ్లు పెడుతుందట. అంటే ఇవి శరవేగంగా వృద్ధి అవుతాయన్నమాట. మూడేళ్ల వయసున్న కాలనీలో లక్ష చీమల వరకు ఉంటాయని అంచనా.

ఇప్పుడివి క్వీన్స్‌లాండ్ నుంచి తొలిసారిగా న్యూసౌత్‌వేల్స్‌కు పాకాయని చెబుతున్నారు. గత కొన్నేళ్లలోనే అమెరికా, చైనా, తైవాన్, జపాన్, ఫిలిప్పీన్స్ దేశాల్లో అంతటా కొరివి చీమలు వ్యాప్తి చెందాయి. న్యూసౌత్‌వేల్స్‌లో కనిపించిన కొరివి చీమలు.. ముర్రే-డార్లింగ్ బేసిన్ ద్వారా ఇతర ప్రాంతాలకూ అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

దక్షిణ ఆస్ట్రేలియా, విక్టోరియా, ఆస్ట్రేలియా రాజధాని ప్రాంతం, న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌లాండ్‌ల గుండా ఈ నది పారుతోంది. దీంతో ముర్రే-డార్లింగ్ బేసిన్ ద్వారా కొత్త ప్రాంతాలకు కొరివి చీమలు చేరితే ఎలా? అన్న ఆలోచనే ఆస్ట్రేలియన్లను వణికిస్తోంది.

Tags

Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×