Language : భావ వ్యక్తీకరణలో భాషదే కీలక పాత్ర. ప్రపంచవ్యాప్తంగా 7,168 భాషలను ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వీటిలో 43% భాషలు అంతర్థానమయ్యే దశకు చేరుకున్నాయి. వాస్తవానికి ప్రతి 40 రోజులకు ఓ ప్రాంతీయ భాష కనుమరుగవుతోందని అంచనా. ఇలా అంతరిస్తున్న వాటిలో ఎక్కువగా దేశీయ భాషలే ఉండటం గమనార్హం. భాషకు ముప్పు వచ్చిందంటే.. ఆయా తెగల, వర్గాల సంస్కృతి, ఆచార వ్యవహారాలకు చెల్లుచీటీ ఇస్తున్నట్టే. ఈ లెక్కన ప్రపంచ భాషల్లో 90% వచ్చే వందేళ్లలోనే పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
అంతర్థాన దశకు చేరిన భాషలను ప్రస్తుతం 8.8 కోట్ల మంది మాత్రమే సంభాషిస్తున్నారు. ఇలా కనుమరుగయ్యే భాషలు ఓషియేనియా రీజియన్‌లో అత్యధికంగా ఉన్నాయి. దాదాపు 733 భాషలకు ముప్పు ముంగిట్లో ఉన్నాయి. 88 లక్షల జనాభా కలిగిన పపువా న్యూగినియా.. అత్యధిక భాషలకు నెలవైంది. ఇక ఆఫ్రికాలో 428 భాషలు అంతర్థానం కానున్నాయి. వలసలు, కరువు, సంఘర్షణల కారణంగా భాషల మనుగడకే ఎసరు వస్తోంది.
నార్త్, సెంట్రల్ అమెరికాలో 222 భాషలకు ముప్పు ఎదురుకానుంది. నిజానికి అమెరికాలో 98% దేశీయ భాషలు ప్రమాదంలో పడ్డాయి. మరోవైపు 490 వ్యవస్థీకృత భాషల్లో(7.44%) సంభాషించేవారు 6.1 బిలియన్ల మంది ఉన్నారు. భాషా పరిరక్షణ అనేది ఓ ఉద్యమంగా మారిన ప్రస్తుత దశలో భాషల మనుగడపై కొత్త ఆశలు మోసులెత్తుతున్నాయి.
ఉదాహరణకు న్యూజిలాండ్ ప్రాంతీయ భాష మౌరినే తీసుకుంటే.. 1970లలో మౌరి స్కూల్ పిల్లల్లో కేవలం 5 శాతమే ఆ భాషలో మాట్లాడేవారు. ఇప్పుడు 25% మంది సంభాషించగలుగుతున్నారు. మౌరి భాషలో మాట్లడటాన్ని అక్కడి ప్రభుత్వం చట్టబద్ధం చేసిన తర్వాత ఈ గణనీయమైన మార్పు చోటుచేసుకుంది.
అలాగే హవాయి నేటివ్ లాంగ్వేజిని 2 వేల మంది మాత్రమే ఉపయోగించేవారు. స్కూళ్లలో ఆ భాషను తప్పనిసరి చేయడంతో 2023లో ఆ భాషలో మాట్లాడుతున్నవారి సంఖ్య 18,700కి చేరింది. కృత్రిమ మేధ(ఏఐ) సాంకేతికత అందుబాటు లోకి వచ్చిన తర్వాత భాషల పరిరక్షణ సులువైంది.
ఏ భాషనైనా.. మరో భాషలోకి అతి వేగంగా తర్జుమా చేయగల లాంగ్వేజ్ టూల్స్‌ను గూగుల్, మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తెచ్చాయి. భాషలు కనుమరుగు కాకుండా.. వాటిని సజీవంగా ఉంచడంతో పాటు ప్రాంతీయంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.