Nobel Prize: నోబెల్ బహుమతి.. ప్రపంచంలోనే అత్యున్నతమైన పురస్కారం.. ఈ ప్రైజ్ ను అత్యున్నతమైన అంతర్జాతీయ గౌరవంగా పరగణిస్తారు. మానవాళి శ్రేయస్సు కోసం చేసిన కృషికి గానూ ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
స్వీడన్‌కు చెందిన ఫేమస్ సైంటిస్ట్, డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ బహుమతులను అందజేస్తున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895లో పారిస్ లో రాసిన వీలునామా ప్రకారం.. తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని ఒక ట్రస్టు కోసం రిజర్వ్ చేశారు. మానవాళికి గొప్ప ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులను గుర్తించి, గౌరవించాలని ఆయన కోరారు. ఆయన రాసిన వీలునామా ప్రకారం, నోబెల్ తన మొత్తం ఆస్తిలో సుమారు 94% (31,225,000 స్వీడిష్ క్రోనర్‌లు) ఐదు నోబెల్ బహుమతుల స్థాపనకు కేటాయించారు. ఈ ఉద్దేశంతోనే 1901 నుంచి ఈ బహుమతులను ప్రదానం చేయడం ప్రారంభించారు.
ఆరు రంగాలివే..
ఈ బహుమతిని ప్రధానంగా ఆరు రంగాలలో అందజేస్తున్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి, అర్ధశాస్త్రం రంగాల్లో నోబెల్ ప్రైజ్ ను ప్రకటిస్తున్నారు.
ఫిజిక్స్
కెమిస్ట్రీ
వైద్య శాస్త్రం
సాహిత్యం
శాంతి
ఎకానమీ
నోబెల్ విజేతల పేర్లను అక్టోబర్‌లో ప్రకటిస్తారు. ప్రదానోత్సవం ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10న స్వీడన్‌లో జరుగుతుంది. శాంతి బహుమతిని మాత్రం నార్వేలోని ఓస్లోలో అందజేస్తారు.
1969 నుంచి ఎకానమీలో నోబెల్ ప్రైజ్..
1901లో ఐదు రంగాల్లో మాత్రమే నోబెల్ బహుమతిని ప్రకటించేవారు. 1968లో ఎకానమీలో కూడా నోబెల్ ప్రైజ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. స్వీడిష్ నేషనల్ బ్యాంక్ తన 300వ వార్షికోత్సవ సందర్భంగా 1968లో ఈ బహుమతిని స్థాపించింది. దీనిని అధికారికంగా “ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రంలో స్వేరిజెస్ రిక్స్‌బ్యాంక్ బహుమతి” అని పిలుస్తారు. 1969 నుంచి ఎకానమీలో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు.
ప్రైజ్ మనీ ఎంత ఉంటుందంటే..?
నోబెల్ ప్రైజ్ విన్నర్స్ కు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లను అందజేస్తారు. దీని విలువ ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.10.5 కోట్లన్న మాట. ఒక రంగంలో ఒకరి కంటే ఎక్కువ మంది విజేతల పేర్లను ప్రకటిస్తే.. అంతే మొత్తాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తారు. నోబెల్ విజేతలకు గోల్డ్ తో తయారు చేసిన 18 క్యారెట్ల పతకాన్ని అందజేస్తారు. పతకంపై ఆల్ఫ్రెడ్ నోబెల్ ముఖ చిత్రం ఉంటుంది. ప్రతి విభాగానికి ప్రత్యేక డిజైన్ తో తయారు చేసి పతకాన్ని అందజేస్తారు. అదనంగా, విజేతలకు వారి పేరు, విజయాలు వివరించిన డిప్లొమా సర్టిఫికేట్ ను కూడా అందజేస్తారు.
విజేతలకు ఉండే ప్రయోజనాలు..
అంతర్జాతీయ గౌరవం: నోబెల్ ప్రైజ్ అనేది ఆ రంగంలో అత్యున్నత స్థాయి విజయాన్ని, నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇది వారికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.
గోల్డ్ మెడల్: ప్రతి విజేతకు 18 క్యారెట్ల బంగారు పతకాన్ని అందిస్తారు. ఈ పతకంపై ఆల్ఫ్రెడ్ నోబెల్ చిత్రం, బహుమతి అందుకున్న వ్యక్తి పేరు చెక్కబడి ఉంటుంది.
డిప్లొమా సర్టిఫికెట్: విజేతలకు ఒక ప్రత్యేకమైన డిప్లొమా సర్టిఫికెట్ ను అందజేస్తారు. ఇందులో ప్రైజ్ కమిటీ వారి కృషిని అభినందిస్తూ రాసిన వ్యాఖ్యలు కూడా ఉంటాయి.
ప్రతిష్టాత్మక వేడుక: ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజు స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ లో బహుమతిని అందజేస్తారు. స్వీడన్ రాజు చేతుల మీదుగా బహుమతిని అందుకునే గౌరవం లభిస్తుంది. శాంతి బహుమతి మాత్రం నార్వే రాజధాని ఓస్లో నగరంలో అందజేస్తారు.
నోబెల్ గ్రహీతలు తమ జీవితాంతం ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉంటుంది. ఇది వారికి కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు.. వారికి లభించే గొప్ప గుర్తింపుగా భావిస్తారు.