Nobel Prize Chemistry: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల పేర్లు నోబెల్ బృందం ప్రకటిస్తుంది. మొన్న వైద్య రంగంలో ముగ్గురు పేర్లను ప్రకటించిగా.. నిన్న భౌతిక శాస్త్రంలో మరో ముగ్గురు అమెరికన్ సైంటిస్టులకు నోబెల్ బహుమతి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 2025 ఏడాదికి గానూ రసాయన శాస్త్రంలో మరో ముగ్గురికి నోబెల్ బహుమతి వరించింది. సుసుము కితగావ, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాగిలకు నోబెల్ పురస్కారం దక్కినట్టు స్వీడన్ లోని స్టాక్ హోంలో నోబెల్ బృందం ప్రకటించింది. వారి విప్లవాత్మక ఆవిష్కరణ ‘మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అభివృద్ధి.. (For the development of metal- organic frame works)’ అనే అంశానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్టు నోబెల్ బృందం వివరించింది.
విజేతల పేర్ల ప్రకటన ప్రక్రియ అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది. ఇప్పటికే వైద్య రంగం, భౌతిక శాస్త్రం విభాగాల్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ల పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, శాంతి తదితర విభాగాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారి పేర్లను ప్రకటించనున్నారు. ఈ నెల 13 వరకు అన్ని రంగాలల్లో నోబెల్ బహుమతి వరించిన వారి పేర్లను ప్రకటించనున్నారు.