Russia president Putin support to ‘endorses’ Kamala Harris: అమెరికాలో నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన విమర్శల ధాటిని పెంచారు. కమలా హ్యారిస్ ను ఎలాగైనా ఓడించాలని అస్త్రశస్త్రాలు సంధిస్తున్నారు. డెమోక్రాటిక్ తరపున అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న కమలా హ్యారిస్ కూడా తగ్గేది లేదంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భారతీయ అమెరికన్ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనేలా..కమలా హ్యారిస్ కు మద్దతు ఇచ్చేలా పలు స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దించారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మద్దతు కమలా హ్యారిస్ కు ఉంటుందని భరోసా ఇచ్చారు. అసలే రష్యా పై ఎప్పుడూ కారాలు మిరియాలు నూరే ట్రంప్ కు ఈ వ్యాఖ్యలు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.
పుతిన్ కు ట్రంప్ వార్నింగ్
రష్యా అధ్యక్షుడు పొరుగు దేశం విషయంలో జోక్యం చేసుకోవడం మానుకోవాలి..ఇది తమ దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం అని..ఇతర దేశస్థుల ప్రమేయం అవసరం లేదని కటువుగానే సమాధానం ఇచ్చారు ట్రంప్. అమెరికా తదుపరి అధ్యక్షుడిని ఎంపిక చేసే అధికారం ఇక్కడ స్థానిక ఓటర్లకు మాత్రమే ఉందని..ఏ ఒక్కరూ వారిని ప్రభావితం చేయలేరని అన్నారు. ఒక దేశ అంతర్గత వ్యవహారాలలో తలదూర్చడం దేశాధ్యక్ష స్థానంలో ఉన్న పుతిన్ కి ఇది భావ్యం కాదు. ఇకనైనా మా పనులు మిమ్మల్ని చేసుకోనివ్వండి..అంతకన్నా ఎక్కువగా జోక్యం చేసుకోకండి అంటూ తెలిపారు. వ్లాదివోస్తోక్ లో జరుగుతున్న ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో రష్యా అధ్యక్షుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా పనిగట్టుకుని అమెరికా అధ్యక్ష ఎన్నికలపై స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుతూ తన అభిప్రాయాన్ని తెలిపారు.
హ్యారిస్ కే మద్దతు
అమెరికా అధ్యక్ష స్థానానికి ఎంపికయ్యే అన్ని అర్హతలూ కమలా హ్యారిస్ కు ఉన్నాయని..ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా ఆమె నిరూపించుకున్నారని..అమెరికా,రష్యా సంబంధాలు కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలైతే మరింత మెరుగవుతాయని పుతిన్ అన్నారు. అంతేకాదు హ్యారిస్ ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపిస్తారని..ఎదుటి వ్యక్తులతో కలుపుగోలుగా ఉంటారని..ఆమె తో పనిచేయించుకోవడం కూడా చాలా సులువని అన్నారు. తాను బైడెన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని అన్నారు. అమెరికా రాజకీయ వ్యవస్థ కుళ్లిపోయిందని..ప్రజాస్వామ్యం పట్ల అక్కడి నేతలకు గౌరవం లేదని..నియంతల్లా వ్యవహరిస్తారని పరోక్షంగా ట్రంప్ పై విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్యం ఎక్కడ?
ప్రజాస్వామ్యం గురించి అమెరికా వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితిలో తాము లేవని అన్నారు. కొంతకాలంగా రష్యా, అమెరికా మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రస్తుతం మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోందిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ వ్యవహారంలో కొందరు స్పందిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎవరైనా ఇతర దేశాల జోక్యం సహించరని..ఈ విషయం పుతిన్ గ్రహిస్తే మంచిదని అంటున్నారు.