ఊహించని రీతిలో వచ్చిన జల విలయానికి ఏపీ అల్లాడిపోయింది. మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు విలవిల్లాడిపోయారు. కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద ముంచెత్తింది. చెరువేదో.. ఇళ్లేవో.. కాలువేదో.. రోడ్డేదో.. ఏదేంటో తెలియని పరిస్థితి. అలాంటి సిచ్యూవేషన్ నుంచి బెజవాడ తేరుకుంటోంది. పునరావాస కేంద్రాల నుంచి ఇంటి బాట పట్టారు జనం. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకా ఉండగా.. చాలా ప్రాంతాల్లో మాత్రం వరద తగ్గింది. విజయవాడలో క్లీనింగ్ ప్రక్రియ ప్రారంభించింది ఏపీ సర్కారు.
ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరద నీరు తిష్ట వేయగా.. చాలా ప్రాంతాల్లో వరద తగ్గింది.. అయితే.. వరదతో బురదమయమైన విజయవాడలో క్లీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది ప్రభుత్వం. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజిన్ల ద్వారా శుభ్రం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పురపాలక శాఖ పారిశుధ్య పనులను వేగవంతం చేసింది. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది ఉన్నారు. ఇతర మున్సిపాలిటీల నుంచి 5889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. వీరితో పాటు 48 ఫైర్ ఇంజన్ల ద్వారా వీధుల్లో, ఇళ్లలోకి చేరిన మురుగును తొలగిస్తున్నారు. విజయవాడలో వరద సహాయక చర్యల కోసం.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్.. అధికారులు, ఉద్యోగులు.. 1400 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు తరలివచ్చారు. అలానే రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి విజయవాడకు పారిశుద్ధ్య కార్మికులు చేరుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
Also Read: క్లౌడ్ బరస్ట్‌తో ఆకస్మిక వరదలు.. విపత్తులను ఆపే దారేది?
ఓ వైపు కాలనీ వాసులు ఇళ్లను శుభ్రం చేసుకుంటుండగా.. పారిశుద్ధ్య కార్మికులు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ అనూహ్య పరిస్థితుల్లో సైతం బెజవాడ లోని వరదల వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య బురద పంచాయతీ నడుస్తోండడం హాట్ టాపిక్ గా మారుతోంది. మీ వల్లే అంటే మీ వల్లే అంటూ టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తప్పుడు ప్రచారం చేస్తారా? ఇలాంటి దుర్మార్గులకు రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ తప్పులకు అమాయకులు వేదనకు గురయ్యారని మండిపడ్డారు. తప్పులు చేసికూడా కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు.
మరోవైపు జగన్ మాత్రం ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా నది కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటిని ముంపు నుంచి కాపాడేందుకే.. కృష్ణాలోని నీటిని బుడమేరులోకి గేట్లు ఎత్తి వదిలారని జగన్ మరోసారి చెప్పారు. దాని వల్లనే బుడమేరు నుంచి వరద విజయవాడను ముంచెత్తిందని అన్నారు. గురువారమే వరద రాబోతోందని తెలిసినప్పుడు.. డ్యామ్ మేనేజ్‌మెంట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
బడమేరులో తొంబై శాతం అక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ముంపు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్నారు. సినిమా హీరోల కంటే జగన్ ఎంతో సంపన్నుడన్నారు. ప్రజలు తేరుకోలేని కష్టాల్లో ఉన్నప్పుడు.. ఈ మాటల యుద్ధంతో వరద విలయం కాస్తా విమర్శల విలయం లాగా మారిందని ప్రజలు భావిస్తున్నారు.