BigTV English

Cloaking technology : ఆ ముసుగేస్తే మాయం!

Cloaking technology  : ఆ ముసుగేస్తే మాయం!
Cloaking technology

Cloaking technology : ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో రణతంత్రమే మారిపోయింది. అత్యంతాధునిక సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అని కొత్త పుంతలు తొక్కింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డ్రోన్ టెక్నాలజీ. గాల్లోనే కాదు.. నీళ్లలోనూ దూసుకుపోయేలా డ్రోన్లను తయారు చేయగల స్థాయికి ఈ సాంకేతికత చేరింది.


యుద్ధం ఆరంభమైన తొలినాళ్లలో రష్యాపై ఉక్రెయిన్ పైచేయి సాధించగలిగిందంటే దానికి కారణం డ్రోన్లే. శత్రువుల కదలికలను పసిగట్టి గురి చూసి కొట్టగల క్వాడ్‌కాప్టర్లను ఉక్రెయిన్ బలగాలు ఉపయోగించాయి. అనంతర కాలంలో రష్యా కూడా డ్రోన్లను రంగంలోకి దింపి.. ఉక్రెయిన్ సైన్యాన్ని చావుదెబ్బ తీస్తూ వస్తోంది. అయితే శత్రుసేనల కంటికి కనపడకుండా ఉండేలా కొత్త సాంకేతికతను ఉక్రెయిన్ తాజాగా అభివృద్ధి చేసింది.

ఉక్రెయిన్ పరిశోధకులు సృష్టించిన ‘మాయా ముసుగు’తో సత్ఫలితాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. ఆ ముసుగు వేసుకుంటే ప్రత్యర్థుల డ్రోన్లకు చిక్కడమనేది కుదరదు. దీనిని ఫాంటమ్ స్కిన్(Phantom Skin) అని వ్యవహరిస్తున్నారు. కీవ్ ఒబ్లాస్ట్ ప్రావిన్స్‌లోని బుచ్చా(Bucha)కు చెందిన వ్యక్తి ఒకరు ఈ ఇన్విజిబులిటీ క్లోక్(Invisibility Cloak)ను రూపొందించారు.


క్లోకింగ్ టెక్నాలజీ ఆధారంగా బోలెడన్ని సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ రచనలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకమైన ఆ దుస్తులను వేసుకుంటే మనుషులు మాయమైపోతారు. కంటికి కనిపించరు. ఇప్పుడు ఉక్రెయిన్ అలాంటి ముసుగునే తయారు చేసింది. ప్రతి వస్తువు నుంచీ ఇన్‌ఫ్రారెడ్ ఎనర్జీ విడుదల అవుతుంటుంది. దానిని హీట్ సిగ్నేచర్‌గా వ్యవహరిస్తుంటారు. ఇన్‌ఫ్రారెడ్/థర్మల్ కెమెరా ఆ హీట్ సిగ్నేచర్‌ను గ్రహిస్తుంది. అనంతరం ఆ ఇన్‌ఫ్రారెడ్ డేటాను ఎలక్ట్రానిక్ ఇమేజ్ రూపంలోకి మారుస్తుంది. ఎయిర్‌పోర్టులు, కీలక ప్రదేశాల్లో ఏర్పాటుచేసే థర్మల్ ఆధారిత ఇమేజింగ్ పరికరాలు చేసే పని కూడా ఇదే.

అలాంటి ఏర్పాటే డ్రోన్లకూ ఉంటుంది. వాటికి అమర్చిన థర్మల్ సెన్సర్ల ద్వారా శత్రువుల కదలికలు తెలిసిపోతుంటాయి. ఆ సెన్సర్లకు చిక్కకుండా ఫాంటమ్ స్కిన్ చేయగలదు. అంటే సైనికులు, వారి పరికరాల నుంచి వెలువడే హీట్ సిగ్నేచర్‌ను గ్రహించకుండా అడ్డుకుంటుందన్నమాట. నల్లటి ప్లాస్టిక్ మెటీరియల్‌తో ఫాంటమ్ స్కిన్‌ను తయారు చేశారు. హీట్ సిగ్నల్స్‌ను నిరోధించే సామర్థ్యం దీనికి ఉండటంతో.. ఇన్‌ఫ్రారెడ్/థర్మల్ సెన్సర్లకు చిక్కే పరిస్థితి ఉండదు.

ఫాంటమ్ స్కిన్ తయారీలో ఉపయోగించే పదార్థాల వివరాల వెల్లడిలో కొంత గోప్యతను పాటించారు ఉక్రెయినియన్లు. అయితే గ్రాఫీన్ సహా నానోటెక్నాలజీ మిశ్రమ పదార్థాలను అందులో వినియోగించి ఉండొచ్చని తెలుస్తోంది. హీట్ సిగ్నేచర్‌ను సంగ్రహించే సామర్థ్యం ఆ పదార్థాలకు ఉంటుంది.

ఉక్రెయిన్ మిలటరీ టెక్ కంపెనీ స్పెట్స్ టెక్నో ఎక్స్‌పర్ట్(STE) సహకారంతో తాజా ఆవిష్కరణ జరిగినట్టు సమాచారం. గత నెలలో జరిగిన లండన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్ ఇంటర్నేషనల్(DSEI) ఈవెంట్‌లో దీనిని ప్రదర్శించారు. ఫాంటమ్ స్కిన్‌‌తో పాటు క్లోకింగ్ టెక్నాలజీపై ఇప్పటికే పలు దేశాల మిలటరీ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×