అసలు టెస్లా కంపెనీకి యజమానే మస్క్ అయినప్పుడు, మళ్లీ మస్క్ కి టెస్లా జీతం ఇవ్వడమేంటి అనుకుంటున్నారా..? వాస్తవానికి టెస్లా కంపెనీ అధినేతే అయినా అది లిస్టెడ్ కంపెనీ కాబట్టి అందులో ఆయనకు మేజర్ షేర్ ఉంది. దాంతోపాటు కంపెనీ CEO గా మస్క్ ప్రతి నెలా జీతం తీసుకుంటాడు. అయితే గతంలోనే ఈ జీతం విషయంలో పెద్ద పేచీ నెలకొంది. 44.9 బిలియన్ డాలర్ల ప్యాకేజీని మస్క్ కి కంపెనీ ఆఫర్ చేయగా దాన్ని కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ట్రంప్ కి కంపెనీ భారీ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా 1 ట్రిలియన్ డారల్ జీతం ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. మన ఇండియన్ కరెన్సీలో దాని విలువ రూ. 83 లక్షల కోట్లు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ కంపెనీ CEO కూడా ఈ స్థాయిలో జీతం తీసుకోలేదు. ఆ జీతం కోసం కంపెనీ కొన్ని కండిషన్లు పెట్టింది. ఆ కండిషన్లకు మస్క్ ఓకే చెబితే, రాబోయే బోర్డ్ మీటింగ్ లో జీతం ఫైనల్ అవుతుంది.
కండిషన్లు ఏంటి..?
ప్రస్తుతం టెస్లా కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మార్కెట్ విలువకు సమానమైన జీతాన్ని ఆఫర్ చేస్తున్నారంటే, ఆ కంపెనీని ఏ స్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యతలు అప్పగిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.
1. టెస్లా మార్కెట్ విలువను 2 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలి – 20మిలియన్ల వాహనాల అమ్మకాలు జరగాలి.
2. మార్కెట్ విలువ 2.5 ట్రిలియన్లకు చేరాలి – 10మిలియన్ల ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ సబ్ స్క్రిప్షన్స్ రావాలి.
3. మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లకు చేరాలి – 1 మిలియన్ రోబోట్స్ డెలివరీ చేయాలి
4. మార్కెట్ విలువ 3.5 ట్రిలియన్ డాలర్లకు చేరాలి – 1 మిలియన్ రోబో ట్యాక్సీలు రోడ్లపైకి రావాలి.
ఇలా మార్కెట్ విలవ పెంచుకుంటూ పోవడంతోపాటు, ఆపరేషనల్ టార్గెట్లు కూడా రీచ్ అయితేనే మస్క్ కి ఆ జీతం కొనసాగుతుంది. దీంతోపాటు కనీసం ఏడున్నర సంవత్సరాలు ఆయన టెస్లా సీఈఓగా కొనసాగాలనే ఒప్పందం చేయాలి. అంతే కాదు తన తర్వాత సీఈఓ ఎవరనేదానిపై ఇప్పట్నుంచే ప్రణాళిక తయారు చేయాలి.
మస్క్ మానస పుత్రిక..
టెస్లా కంపెనీని ఎలన్ మస్క్ పూర్తిగా తన తెలివితేటలతో పైకి తెచ్చారు. ఒక ప్రత్యేకమైన EV స్టార్టప్ నుండి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా మార్చాడు, ఉత్పత్తిని పెంచాడు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. కార్ల కంపెనీని ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు తీసుకెళ్లారు. అదే సమయంలో స్పేస్ ఎక్స్, xAI వంటి అనేక ఇతర కంపెనీలను కూడా స్థాపించాడు. ఆమధ్య ట్విట్టర్ వంటి సోషల్ మీడియా దిగ్గజాన్ని కొనుగోలు చేసి ఎక్స్ అనే పేరు పెట్టాడు. అయితే ఇటీవల టెస్లాకి మార్కెట్లో రోజులు అంత బాగా లేవు. చైనా నుంచి చౌకైన ఈవీ కార్లనుంచి టెస్లా గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఉన్న విభేదాలు టెస్లా మార్కెట్ పై కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కంపెనీ బోర్డ్ మస్క్ పై అంత పెద్ద నమ్మకం పెట్టుకోవడం నిజంగా విశేషం.
మరి రాజకీయాలు..?
టెస్లా సీఈఓగా మస్క్ అత్యధిక జీతం అందుకోవాలంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాల్సి రావొచ్చు. రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ఆమధ్య ట్రంప్ పై సవాల్ విసిరారు మస్క్. అమెరికా పార్టీని ప్రారంభిస్తానన్నాడు. అయితే ఇలాంటి చర్యలు టెస్లా సహా మస్క్ కి చెందిన కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మస్క్ కి 1 ట్రిలియన్ డాలర్ల జీతం పెంచి, ఆయన తన టార్గెట్లను రీచ్ అయితే.. కాలక్రమంలో ఆ కంపెనీలో ఆయన వాటా ఎక్కువ అవుతుంది, అప్పుడు బోర్డ్ తీసుకునే నిర్ణయాలపై ఆయన ప్రభావం మరింత పెరుగుతుంది. అదే సమయంలో ఆయన రాజకీయ అరంగేట్రాన్ని ఎవరూ ఆపలేరని అంటున్నారు.