AP Heavy Rains: ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో రేపు(అక్టోబర్ 24) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35-55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ కలెక్టర్లకు వివరించారు. మరో4-5 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉందన్నారు. వర్షాలతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కలెక్టర్లకు అందిచాలని ఆదేశం అధికారులను ఆదేశించారు. మండల కంట్రోల్ రూమ్స్ లో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, విద్యుత్ శాఖ అధికారులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు.
ఉత్తర తమిళనాడు, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ అంతర కర్ణాటక ప్రాంతాల్లో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం దక్షిణ కర్ణాటక అంతటా పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తూర్పు-మధ్య, పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని ప్రకటించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Also Read: AP Heavy Rains: బలహీనపడుతున్న అల్పపీడనం.. ఏపీలో కుండపోత వర్షాలు
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు కలెక్టర్ నాగరాణి సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.