Bison Movie Review : చియన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన సినిమా బైసన్ కాలమాదన్. దీన్ని తమళ్‌లో గత వారం 17నే రిలీజ్ చేశారు. తాజాగా ఇప్పుడు తెలుగులో బైసన్‌గా రిలీజ్ చేశారు. తమిళంలో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తెలుగులో ఎంత మేరకు వర్కౌట్ అయింది అనేది ఈ రివ్యూలో చూద్దాం…
1994లో ఆసియా గేమ్స్ జపాన్‌లో జరిగాయి. అందులో కబడ్డి ప్లేయర్‌గా తమిళనాడు నుంచి కిట్టన్ (ధృవ్ విక్రమ్) ఎంపిక అవుతాడు. తమిళనాడులో ఎక్కడో ఓ చిన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కిట్టన్ కథనే ఈ బైసన్ మూవీ. తన ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఉన్న పగలు, ప్రతికారాలు, అతని సామాజిక అంశం.. కిట్టన్ లక్ష్యంపై ఎంత వరకు ప్రతికూలత చూపించాయి ? వాటిని ఎదుర్కొని కిట్టన్ ఇండియన్ కబడ్డి టీంలో ఎలా స్థానం సంపాదించాడు ? చివరికి 12 ఆసియా గేమ్స్‌లో ఎలాంటి పాత్ర పోషించాడు అనేది ఈ సినిమాలో చూపించారు.
సామాజిక కోణంలో సినిమాలు తీయడంలో తమిళ డైరెక్టర్లకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది చాలా సినిమాల్లో ప్రూవ్ అయింది. న్యాచురాలిటీకి చాలా దగ్గరగా సినిమాలు తీస్తారు. అందుకే.. ఆ సినిమాలు తమిళ్‌లో మాత్రమే కాదు.. తెలుగులోనూ బాగా ఆడుతాయి. అందులో మారి సెల్వరాజ్ కూడా తక్కువేం కాదు.
ఆయన దర్శకత్వలో వచ్చిన బైసన్ మూవీ కూడా ఇప్పుడు అదే కోణంలోనిది. గతంలో ఆయన నుంచి వచ్చిన నాలుగు సినిమాల్లానే ఈ బైసన్ మూవీ కూడా సామాజిక కోణంతో చూపించిందే. అయితే ఈ బైసన్ మూవీ.. ఓ రియల్ స్టోరీ. అర్జున అవార్డు అందుకున్న కబడ్డి ప్లేయర్ మనతి గణేషన్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
రియల్ స్టోరీ అయినా… తాను అనుకున్న స్టైల్‌లో, తాను చెప్పాలనుకున్న దాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ క్రమంలో ఆడియన్ సినిమాకు అత్తుకుపోయేలా చేశాడు. ఎక్కడ కూడా సినిమా నుంచి ఆడియన్ డిస్కనెక్ట్ అవ్వడు. గ్రామీణ ప్రాంతాలు.. అక్కడ ఉండే కట్టుబాట్లు, ఆ టైంలో ఉన్న పగలు ప్రతికారాలను చూపించడంలో వందకు వంద శాతం సక్సెస్ అయ్యాడు. అలాగే 1990స్ లో ఉన్న గ్రామీణ విధానాలను కూడా స్పష్టంగా చూపించాడు.
హీరో పాత్రకు పట్టుమని పది డైలాగ్స్ కూడా ఉండవు. కానీ, ఆ పాత్ర గురించి పది మందికి మించి చెప్పుకునేలా డిజైన్ చేశాడు. ఆ హీరో పాత్ర ఒక్కటే కాదు… సినిమాలో ప్రతి పాత్రను అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు. ప్రతి పాత్ర సినిమాకు ప్రాణం పోశాయి. సినిమాలో రెండు వర్గాలకు నాయకులుగా ఉన్న పాండి రాజ్ (అమీర్), కంద స్వామి (లాల్) నుంచి మొదలు పెడితే ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా ఉంది.
ఫస్టాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది. సెకండాఫ్ వచ్చే సరికి కొంతమేర ల్యాగ్ కనిపిస్తుంది. దర్శకుడు సినిమాపై ఇంటెన్స్ క్రియేట్ చేయడానికి కథను కాస్త లాగాడు. అలా లాగినా… సినిమాపై పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్‌కు, ఆ పాత్రలకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. చివరికి సినిమా చూసి ప్రేక్షకుడు తనకు తెలియకుండానే చప్పట్లు కొడుతాడు. ఇక క్లైమాక్స్‌లో అయితే.. థియేటర్స్ లో చాలా మంది లేచి నిలబడి చప్పట్లు కొట్టడం చూస్తాం. కానీ, సినిమాలో తమిళ నెటివిటీ ఎక్కువ ఉండటం మనం చూస్తాం.
నటీనటుల విషయానికి వస్తే హీరో ధృవ్ విక్రమ్ సినిమా అంతా కనిపిస్తాడు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ ది బెస్ట్ ఇచ్చినా… అక్కడ చియన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ మార్క్ కనిపిస్తుంది. పెద్దగా డైలాగ్స్ ఏం ఉండవు. అయినా.. ఆ పాత్ర గురించి, నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు. అలాగే హీరో తండ్రి పాత్ర చేసిన పశుపతి… గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈయన గతంలో సర్పట్ట పరంపర మూవీ చేశాడు. ఆ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. దానికంటే గుర్తుండిపోయే పాత్ర ఈ బైసన్ మూవీలో చూశాడు. దీనికంటే గొప్పగా ఏం చెప్పలేం. ఇక.. పైన చెప్పినట్టు లాల్, అమీర్, హీరో చెల్లి పాత్రలో చేసిన రాజిషా విజయన్ అందరూ కూడా చాలా గొప్పగా నటించారు. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అయితే… డీ గ్లామర్ పాత్ర అయినా… చాలా బాగా చేసింది.
అలాగే.. కెమెరా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1990స్ లో గ్రామీణ ప్రాంతాన్ని చూపించాలంటే.. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ తోపాటు కెమెరా మెన్ కూడా బాగా పని చేయాలి. ఇందుకు వందకు వంద మార్కులు పడుతాయి కెమెరా డిపార్ట్‌మెంట్‌కు. అలాగే ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కూడా బానే వర్క్ చేసింది. నిర్మాణ విలువలు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. 1990స్ ను క్రియేట్ చేయడానికి వాళ్లు ఎక్కడా కూడా తగ్గలేదు. మ్యూజిక్ కూడా అద్భుతాన్నిక్రియేట్ చేసింది.
హీరోగా ధృవ్ విక్రమ్ నటన
సినిమాలో ప్రతి పాత్ర ఫర్ఫామెన్స్
కథ, కథనం
ఫస్టాఫ్
తెలుగుతనం లోపించింది.
ఇంటెన్స్ క్రియేట్ చేసే క్రమంలో కొన్ని ల్యాగ్ సీన్స్.
కొన్ని ఎక్స్‌పెక్టెడ్ సీన్స్
మొత్తంగా.. బైసన్.. ఇది చాలా బలమైన కథ.. చాలా బలమైన సినిమా