BigTV English

US President : అమెరికా ప్రెసిడెంట్‌కు ఉన్న అధికారాలేమిటీ? ఇండియాకు, యూఎస్‌ఏకు ఉన్న తేడాలివే!

US President : అమెరికా ప్రెసిడెంట్‌కు ఉన్న అధికారాలేమిటీ? ఇండియాకు, యూఎస్‌ఏకు ఉన్న తేడాలివే!

US President : అమెరికా అధ్యక్షుడు అంటే ఆ హోదా, ఆ పదవికున్న పవర్ మామూలుది కాదు. ఆయన శాసనం చేస్తే అంతర్జాతీయంగా చాలా పనులు తారుమారవుతాయి. ఏకంగా దేశాల తలరాతల్నే మార్చేయగల ఆర్డర్లు ఇవ్వగల శక్తి ఆ పదవికి ఉంటుంది. ఏదైనా దేశంపై ఆంక్షలు విధించి.. వాటి ఆర్థిక స్థితిగతుల్ని మార్చేయవచ్చు. ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత బలవంతమైన సైన్యాన్ని యుద్ధాన్ని పంపవచ్చు. అంతటి శక్తివంతమైన అమెరికా అధ్యక్ష పదవిలో ఇప్పుడు కూర్చుంది కావాల్సినంత తెంపరితనం ఉన్న ట్రంప్. తన ఆలోచనల్లో ఉన్న ఏ పనైనా కచ్చితంగా జరిగిపోవాలనే మెండితనం పుష్కలంగా ఉన్న నేత. తనకు కావాల్సింది అయితే అడిగుదాం లేదంటే సాధిస్తాం అనే తన సహజ వ్యాపార ధోరణిని.. అమెరికా అధ్యక్ష పదవిలోనూ ప్రదర్శిస్తున్నారు. అయితే.. రాజరికంలో జరిగినట్లు అన్నీ శాసనాలు సజావుగా సాగవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమెరికా అయినా కొన్ని నిబంధనలు, పరిమితుల్లోనే పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అవేంటి.. అమెరికా అధ్యక్షుడికి ఉండే ప్రత్యేకాధికారాలేంటి.? పరిపాలనా విధానాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు, అమెరికాకు ఉన్న వ్యత్యాసాలేంటి.?


రాజకీయ వ్యవస్థలో అమెరికా అధ్యక్షుడు జారీ చేసే ఆదేశాలు అన్ని సమయాల్లో ఒకేలా అమలు కావు. ఏ అదేశమైన చివరికి అక్కడి రాజ్యాంగానికి, అధ్యక్ష పదవికున్న ప్రత్యేక అధికారల పరిధిలోనే ఉండాల్సి ఉంటుంది. అందుకే.. అధ్యక్షులు జారీ చేసే నిర్ణయాలు కొన్ని ఆగమేఘాల మీద అమల్లోకి వస్తే, మరికొన్ని కాస్త ఆలస్యంగా, మరికొన్ని పూర్తిగా రద్దవుతూ ఉంటాయి. మరి.. అలాంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయి అంటే..

అధ్యక్షుడు జారీ చేసే ఆర్డర్లు


కార్యనిర్వాహక ఆదేశాలు : అమెరికా అధ్యక్షులు కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంటుంది. ఇందులో ప్రభుత్వాన్ని నడిపించే వివిధ ఫెడరల్ ఏజెన్సీలు, వివిధ విభాగాల్లోని అధికారులకు నిర్ధిష్ట విషయాలపై సూచనలు చేస్తుంటారు. చట్టాలను ఎలా అమలు చేయాలి, అధ్యక్షుడు ప్రత్యేకంగా తలపెట్టిన ఏవైనా ప్రత్యేక ఆపరేషన్లను ఎలా నిర్వహించాలి, ఎప్పటి వరకు పూర్తి చేయాలనే విషయాల్నితెలుపుతుంటాయి. అయితే, కార్యనిర్వాహక ఆదేశాలు రాజ్యాంగం, అప్పటికే అమల్లో ఉన్న చట్టాలకు లోపడి ఉండాలి. అమల్లో ఉన్న చట్టాలను దాటుకుని పనిచేయాలంటే మాత్రం.. ముందుగా చట్ట సవరణలు లేదా రద్దుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే.. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ఎవరైన లేదా ఏదైనా స్టేట్ కోర్టులకు వెళ్లవచ్చు. వాటిని పూర్తిగా పరిశీలించి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుంది.

శాసన పర్యవేక్షణ : అమెరికాలో శాసన పర్యవేక్షణ వ్యవస్థను కాంగ్రెస్ అంటుంటారు. ఇది అక్కడి పరిపాలనా వ్యవస్థలో చాలా కీ రోల్ పోషిస్తుంది. అమెరికా అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను పర్యవేక్షించే అధికారం ఈ వ్యవస్థకు ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో ప్రెసిడెంట్ ఆర్డర్లను, ప్రభుత్వం చేసిన నిర్ణయాలను తిరస్కరించడమే, మార్పు చేర్పులు చేస్తూ చట్టాలను పాస్ చేయగల సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంటుంది. దీనికున్న విశేష అధికారాల గురించి తెలియాలంటే… ఇది అమెరికా ఫెడరల్ ప్రభుత్వ బడ్జెట్, నిధుల వినియోగాన్ని కూడా నియంత్రించగల శక్తివంతమైనది.

న్యాయ పర్యవేక్షణ : అమెరికాలోని న్యాయస్థానాలు స్వాతంత్రంగా పనిచేయగల సామర్థ్యం ఉంది. రాజకీయ నాయకులు, వారికున్న ప్రజా మద్ధతులతో సంబంధం లేకుండా వ్యవహరించగలదు. అంటే.. బయటి నుంచి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడులకు తలొగ్గే బలహీన వ్యవస్థ కాదు. అందుకే.. చాలా సందర్భాల్లో అధ్యక్షులకు, వారి నిర్ణయాలకు అమెరికా న్యాయస్థానాలు ఎదురు తిరిగిన సందర్భాలు కనిపిస్తుంటాయి. దేశంలోని కోర్టులు ముఖ్యంగా సుప్రీం కోర్టుకు కార్యనిర్వాహక ఆదేశాలను సమీక్షించే అధికారం అక్కడుంది. కాబట్టి.. ఏవైనా ఎగ్జిక్టూటీవ్ ఆర్డర్లు.. రాజ్యాంగ పరిమితుల్ని మించిపోయినట్లు గుర్తిస్తే న్యాయస్థానాలు ఎలాంటి వెనుకంజా లేకుండా వాటిని రద్దు చేయగలవు.

సలహా, కౌన్సెలింగ్ వ్యవస్థ : అమెరికా ప్రయోజనాలు లేదా సైనిక, విదేశీ వ్యవహారాలు, కొన్ని మౌలిక విధాన నిర్ణయాలకు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్, సీనియర్ మంత్రివర్గ సభ్యులతో పాటు సలహా మండల్ని సంప్రదించవచ్చు. అయితే.. ఇది కచ్చితంగా అనుసరించాల్సిన పని లేదు. అధ్యక్షుడు కావాలి అనుకుంటే మాత్రమే ఈ వ్యవస్థను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఇందులో.. సీనియర్, ఆయా అంశాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటుంటారు.

ఇలా.. అనేక వ్యవస్థలు అధ్యక్షుడితో పాటు పని చేస్తుంటాయి. కాకపోతే వాటి పని నిగూఢంగా సాగిపోతుంటాయి. అధ్యక్షుడికున్న ప్రత్యేకతలు, అన్ని విషయాలపై నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కారణంగా.. అతను హైలెట్ అవుతుంటే, ఈ వ్యవస్థలు కొన్ని ప్రత్యేక సమయాలు, పరిస్థితుల్లోనే హైలెట్ అవుతుంటాయి. కానీ.. తెర వెనుక వేటి పనులు అవి చేస్తూనే ఉంటాయి. విశేష, విస్తృత అధికారాలని ఒకే చోటకు చేర్చితే.. అక్కడ రాజరికం తిరిగి పురుడుపోసుకునే అవకాశం ఉంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. అమెరికాల ఏదో ఒకే శాఖకు అధికారం ఇవ్వకుండా రూపొందించారు.

ఈ అధికారాలు వాటిని ఓ కంట కనిపెడుతూ రాజ్యాంగానికి కాపలాగా ఉండే వ్యవస్థలు అమెరికాలో ఉన్నాయి. మరి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, విభిన్న రాజకీయ, సామాజిక పరిస్థితులున్న భారత్ లో ఎలాంటి పరిస్థితు, వ్యవస్థను రూపొందించారో కూడా తెలుసుకోవాలి. ఈ రెండు దేశాల మధ్య అధికార వ్యవహారాలు… అధ్యక్షు, ప్రధాని పదవులకున్న అధికారాలు, వాటి మధ్య తేడాలను పరిశీలిస్తే..

కార్యనిర్వహక ఆదేశాలు

అమెరికా : అగ్రరాజ్యంలో పరిపాలనా వ్యవస్థలో అధ్యక్ష పదవి అత్యున్నతమైంది. ఈ పదవిలో ఉన్న వాళ్లు దేశానికి సంబంధించిన అనేక విషయాలను ప్రభావితం చేసే కార్యనిర్వాహక ఆదేశాలను జారీ చేసే అధికారం ఉంటుంది. అయితే.. అవి అమల్లోని చట్టాలను ఉల్లంఘించకుండా ఉండాల్సి ఉంటుంది. అలాగే.. ఇవి నిత్యం న్యాయ, శాసన పర్యవేక్షణకు లోబడి ఉంటాయి.

భారత్ : భారత్ లోనూ అధ్యక్ష తరహా పదవి ఉంటుంది. కానీ.. ఎక్కువగా మన దగ్గర ప్రధాని చురుగ్గా కార్యనిర్వహక పనుల్ని చక్కబెడుతుంటాడు. మొత్తం రాజ్యం కార్యకలాపాలు అధ్యక్షుడు పేరు మీదుగానే జరుగుతుంటాయి. కానీ.. అతను స్వతంత్రుడు కాకపోవడమే అమెరికాకు, భారత్ కు ఉన్న ప్రధాన వ్యత్యాసం. ఇక్కడ రాష్ట్రపతిగా పిలిచే అధ్యక్షులు.. కేవలం మంత్రి వర్గం సలహా మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పదవిలోని వాళ్లు కూడా ఆర్డినెన్సులను జారీ చేయగలరు. కానీ.. అవి పూర్తి స్థాయి చట్టంగా రూపొందాలి అంటే కచ్చితంగా ప్రజాప్రతినిధులు ఉండే పార్లమెంట్ తదుపరి సమావేశాల్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది.

న్యాయ వ్యవస్థ పాత్ర

అమెరికా : అంతర్జాతీయంగా ఉన్న న్యాయ వ్యవస్థల్లో స్వతంత్రంగా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పని చేసే సామర్థ్యం అమెరికా న్యాయవ్యవస్థకు ఉందని పేరుంది. ఇక్కడి న్యాయ స్థానాలు, ముఖ్యంగా సుప్రీం కోర్టు రాజ్యాంగం పరమావధిగా పని చేస్తుంటారు. రాజ్యాంగం సూచించిన విషయాలు, వాటి తీవ్రత, వాటి సదుద్దేశాలకు విఘాతం కలిగించేలా ఉంటే.. ఎలాంటి సందర్భాల్లో అయినా ఆ చర్యల్ని నిరోధించే అధికారం అమెరికా సుప్రీం కోర్టుకు ఉంది. ఎలాంటి కార్యనిర్వాహక చర్యలనైనా సమీక్షించి, రద్దు చేసే అధికారం అక్కడి సుప్రీం కోర్టుకు ఉంది.

భారత్ : భారత్ లోనూ శక్తివంతమైన, స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ ఉంది. అవసరమైన సందర్భాల్లో రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తులు, శాసన వ్యవస్థలకు సలహాలు, సూచనలు చేసే అధికారంతో పాటు.. రాజ్యాంగానికి విఘాతం కలిగించే చట్టాలను సైతం రద్దు చేయగలదు. అన్నీ కార్యనిర్వాహక చర్యలను సమీక్షించి అభిప్రాయాలను తెలిపడంతో పాటు సవరణ సూచించగలదు. అయితే.. ఇండియాలో న్యాయస్థానాలు చాలా సందర్భాల్లో కేంద్రీకృత పార్లమెంటరీ వ్యవస్థకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది. భారత్ లో పార్లమెంట్ కు విశేష అధికారాలు కట్టబెట్టిన కారణంగా.. చాలా సందర్భాల్లో పార్లమెంట్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటుంది.

రాజకీయ బాధ్యత

అమెరికా : ఆ దేశంలో ప్రజలు వారి అధ్యక్షుడిని నేరుగా ఎంచుకుంటారు. కాబట్టి.. ప్రెసిడెంట్ నేరుగా అమెరికన్ ప్రజలకు నిబద్ధుడిగా పని చేయాల్సి ఉంటుంది. అక్కడి శాసన నిర్వహక వ్యవస్థ.. ప్రెసిడెంట్ ఎంపికతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి.. ప్రెసిడెంట్ నేరుగా అమెరికన్ కాంగ్రెస్ కు బాధ్యుడిగా పని చేయాల్సిన అవసరం ఉండదు. తాను స్వాతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్లవచ్చు. అయితే.. కాంగ్రెస్ ఆ నిర్ణయాలను పరిమితం చేస్తూ అడ్డుతగల వచ్చు కానీ.. చాలా సందర్భాల్లో అలా జరగదు. ఒకవేళ.. అమెరికా ప్రెసిడెంట్ ను తొలగించాలంటే.. ముందుగా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ లో అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెనేట్ కు వెళ్లి అక్కడా ఆమోదం పొందాలి. ఈ మొత్తం ప్రక్రియలో సభలోని 2/3 వంతు ఓట్లు పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ చాలా కఠినంగా, రాజకీయంగా చాలా క్లిష్టంగా ఉంటుంది.

భారత్ : దేశ ప్రధాని ఇక్కడ నేరుగా ఎంపిక కారు. దేశ ప్రజలు ఎంచుకున్న పార్లమెంట్ సభ్యుల్లోని.. మోజార్టీ సభ్యుల మద్ధతున్న వ్యక్తి. అంటే.. అతను ప్రత్యక్షంగా ప్రజల ద్వారా కంటే పార్లమెంట్ వ్యవస్థ ద్వారా ఎంపిక అవుతుంటాడు. అందుకే.. ప్రధాని సహా మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్‌కు ప్రత్యక్షంగా బాధ్యులుగా ఉంటుంటారు. ఒకవేళ ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మొత్తం మంత్రివర్గం రద్దవుతుంది. కానీ.. ప్రధాని ఒక్క పదవే రద్దు కాదు. అదే విధంగా.. ఏదైనా సందర్భంలో ప్రధాని లోక్ సభ నమ్మకాన్ని కోల్పోతే.. అతని మెజార్టీ సభ్యుల మద్దతు ఉపసంహరణ ద్వారా మార్చవచ్చు. అతని స్థానంలో మరో వ్యక్తిని ఎంచుకునే అధికారం ఉంటుంది. అయితే.. ఇది రాజకీయ పార్టీల విధానాలు, మనుగడకు సంబంధించిన అంశం కావడంతో.. రాజకీయ అస్థిరతకు కారణంగా నిలుస్తుంటుంది.

Also Read : అమెరికాలో హాస్పిటళ్లకు క్యూ కడుతోన్న భారతీయ ‘గర్భిణీలు’ – ఇవేం కష్టాలండి బాబు!

మొత్తంగా.. యునైటెడ్ స్టేట్స్ వ్యవస్థ.. అధికారాలు, బలమైన శక్తుల విభజనపై దృష్టి సారించగా, భారత్ లో వ్యవస్థ శక్తుల కలయిగా ఉంటుంది. బలమైన శక్తులు పరస్పరం ఒకరి పరిధిలోకి మరొకరు రాకుండా చూసుకుంటూ పని చేస్తుంటాయి. ఇక్కడ వ్యవస్థ అంతా పార్లమెంటరీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అమెరికాలో అధ్యక్షుడికి నేరుగా కార్యనిర్వాహక అధికారం ఉంటుండగా.. భారత్ లో ప్రధాని ఎక్కువగా పార్లమెంట్‌ కు దగ్గరగా, పార్లమెంటరీ వ్యవస్థలో అంతర్భాగంగా పని చేయాల్సి ఉంటుంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×