Birthright citizenship : ఆమె నిండు గర్భిణీ ఇంకా కొన్ని వారాలు అయితే పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఏళ్లుగా కంటున్న కలలు సాకారం కానున్న వేళ సమీపిస్తుంది. ఆమె, తన భర్త ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని.. సప్త సముద్రాలు దాటి ఎన్నో తమ కలల తీరం అమెరికా చేరుకున్నారు. చదువు, ఉద్యోగం హడావిడితో పాటు అక్కడే పర్మినెంట్ సిటిజన్ షిప్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. అది అంత తొందరగా కుదిరే పని కాదు.
అయినా.. వారికో సంతోషం. ఇంకొన్ని నెలల్లో ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్న తమ బిడ్డ.. తమలా కష్టాలు పడకుండానే అమెరికాలో పుడుతుండడంతో అక్కడి పౌరసత్వం వచ్చేస్తుందని. కానీ.. ఆశలన్నీ అడియాశలయ్యాయి. వారనుకున్నది ఒకటి.. దేవుడు తలచింది ఒకటి అయ్యింది. ట్రంప్ రూపంలో వచ్చిన ఓ విపత్తు.. వారినే కాదు వారిలాంటి ఆలోచనలు, ఆశలు ఉన్న వేలు, లక్షల మందికి పిడుగుపాటు లాంటి పరిస్థితికి గురి చేసింది. దాంతో.. నెలలు నిండాక పుట్టాల్సిన బిడ్డను.. కొన్ని వారాలు ముందైనా ఫర్వాలేదు ఆపరేషన్ చేసి తీయండంటూ.. ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారు.. ఇప్పుడు అమెరికాలోని కొంత మంది ఇండియన్స్.
గడువు వచ్చేస్తోంది.. పిడుగు పడ్డట్టు ఉంది
వందేళ్లుగా అమెరికా రాజ్యాంగం అందిస్తున్న తమ గడ్డపై పుట్టుకతోనే పౌరసత్వం విధానాన్ని రద్దు చేశారు డోనాల్డ్ ట్రంప్. తన కఠినమైన ఇమ్మిగ్రేషన్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయాన్ని అధ్యక్షుడిగా పదవి చేపట్టిన మొదటి రోజే తీసుకున్నారు. దీంతో.. ఆగమేఘాల మీద రెడీ అయిపోయిన ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లు.. జన్మతో వచ్చే పౌరసత్వానికి బ్రేకులు వేశాయి. ఇకపై… తమ దేశ పౌరులు కాని వారు, విదేశాల నుంచి వలస విధానంలో వచ్చిన వారికి అమెరికాలో పిల్లలు పుట్టినా పౌరసత్వం ఇవ్వకూడదని నిర్ణయించారు. అందుకు.. ఫిబ్రవరి 20 చివరి తేదీగా విధించారు. దాంతో.. ఇప్పుడు అమెరికాలోని విదేశీయుల్లో కొత్త భయాలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా.. ఇప్పటికే ప్రెగ్నెంట్ గా ఉండి.. ఇంకొన్నాళ్లల్లో పిల్లలకు జన్మనివ్వబోతున్న తల్లిదండ్రుల ఆందోళనలు భయంకరంగా ఉన్నాయి.
ఎన్నో కష్టాలు పడి, వీసాలు సంపాదించుకుని అమెరికాలో కాలు పెట్టిన వాళ్లే అంతా. ఇంటి దగ్గర ఆర్థిక స్థోమత సహకరించినా, లేకున్నా.. ఎన్నో బాధలు పడి అమెరికాలో కాలుమోపుతుంటారు. వారంతా.. గ్రీన్ కార్డు ద్వారా పౌరసత్వం సంపాదించడం అంటే ఎంత కష్టమే బాగా తెలుసు. అందుకే.. స్టూడెంట్ వీసాలు, వర్క్ వీసా, విజిటింగ్ వీసాలపై ఆ దేశానికి వెళ్లే వాళ్లంతా కుదిరితే.. అక్కడే పిల్లలకు జన్మనివ్వడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగైతేనే… చాలా సులువుగా వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తుందన్న ఆశ వారిది. అలాంటి వాళ్లందరికీ ట్రంప్ జలక్ ఇవ్వడంతో.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చే ఫిబ్రవరి 20లోపు పిల్లల్ని కనేయాలని తొందరపడుతున్నారు.
సిజేరియన్ చేసేయండి డాక్టర్స్.. ప్లీజ్.. ప్లీజ్..
గడువుకు కాస్త అటుగా ఇటుగా ఉన్న కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. చాలా మంది దంపతులు.. సిజేరియన్ ద్వారా పిల్లలకు జన్మనిచ్చేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే.. చాలా మంది దంపతులు ఆసుపత్రుల్ని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డెలివరీకి ఆలస్యం అయ్యి పిల్లలు ఫిబ్రవరి 20 తర్వాత పుడితే.. పౌరసత్వం రాదన్న భయంతో.. ఆలోపు గానే పిల్లల్ని కనేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా వైద్యుల్ని సంప్రదిస్తున్న వారిలో.. తొమ్మిదో నెలలోకి వచ్చిన వారితో పాటు ఎనిమిదో నెలలో ఉన్న వాళ్లు సైతం ఉన్నారు.
అమెరికా వైద్యశాలల్లో నార్మల్ డెలివరీలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అత్యవసరం, తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్ కు వెళతారు. కానీ.. విదేశీయులు, వర్కింగ్ వీసాపై అమెరికాలో పని స్తున్న అనేక మంది దంపతులు పౌరసత్వం కోసం ఆపరేషన్లు చేయాలని అడుగుతుండడంతో.. వైద్యులు సైతం ఒత్తిడికి గురవుతున్నారు. తాజా పౌరసత్వ మార్పులతో భారతీయులే కాదు అనేక మంది ఇతర దేశాల ప్రజలు సైతం తీవ్ర ఆందోళన, కంగారులో ఉన్నట్లు అక్కడి వైద్య వర్గాలు తెలుపుతున్నాయి. వీరంతా కలిపి లక్షల్లో ఉంటారని అంటున్నారు.
వైద్యులపై ఒత్తిడి చేస్తున్న దంపతులు
ట్రంప్ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ల తర్వాత వైద్యులపై పెరిగిపోయిన ఒత్తిడితో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. తొమ్మిది, ఎనిమిదో నెలలో ఉన్న తల్లలు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చంటున్న వైద్యులు.. కొందరు ఏడో నెలలో ఉండగానే వస్తున్నారని చెబుతున్నారు. పిండం పూర్తి స్థాయిలో ఎదిగే దశలో ఉండగా.. సిజేరియన్ చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు. అలాంటి దంపతులకు వైద్యలు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు.
ఒత్తిడి, కంగారు, ఆందోళనలతో తమ వద్దకు వస్తున్న భార్యాభర్తలకు.. ముందస్తు సిజేరియన్లతో వచ్చే సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు చాలా మంది వైద్యులు. పిల్లల ఎదుగుదల గర్భంలో పూర్తయిన తర్వాత వాళ్లంతట వాళ్లే బయటకు వచ్చే ఏర్పాటు మనిషిలో ఉందని.. సిజేరియన్ చేయడం మంచిది కాదని చెబుతున్నారు.ఇక.. నెలల నిండక ముందే బయటకు తీయడం వల్ల.. పిల్లలో పూర్తి ఎదుగుదల ఉండని హెచ్చరిస్తున్నారు. ముందస్తు జననాలతో సరిగా అభివృద్ధి చెందని ఊపిరితిత్తులు, శారీరక భాగాల ఎదుగుదలతో పాటు తక్కువ బరువు ఉండడం, నరాల సంబంధిత సమస్యలతో పుడతారని అంటున్నారు. తల్లిదండ్రులు పౌరసత్వం గురించిన ఆలోచనల్లో పుట్టుబోయే పిల్లల భవిష్యత్తు, వారి ఆరోగ్యాల్ని ప్రమాదంలో పడేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also Read : ట్రంప్ క్షమాభిక్ష పెట్టినా.. కేసు రికార్డులు దాచే ఉంటాయన్న న్యాయమూర్తులు.. వారి అర్థమేంటి..
సిజేరియన్ల ద్వారా ముందస్తు జననాలను ప్రోత్సహిస్తే.. తల్లి, బిడ్డకు ప్రమాదమని అంటున్నారు. ఉన్నాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చాక.. రెండు రోజుల్లోనే రోజుకు దాదాపు 15 నుంచి 20 జంటలు సిజేరియన్ ద్వారా బిడ్డల్ని కనేందుకు సంప్రదిస్తున్నట్లు కొందరు వైద్యలు వెల్లడిస్తున్నారు.