Trump Tariff:ట్రంప్ 25 శాతం సుంకాల విధింపు కారణంగా భారత్ కి తగలనున్న దెబ్బ ఎలాంటిది? ట్రంప్ టారీఫుల రంపపు కోత.. వచ్చే రోజుల్లో భారత వాణిజ్యం పై ఎలాంటి ప్రభావం పడబోతుంది? ఉన్న సుంకాలు చాలవన్నట్టు.. అదనపు జరిమానాలను సైతం విధించనున్నారా? అయితే అవెంలాంటివి? ఆ వివరాలు ఎలా ఉన్నాయ్?
ట్రంప్ సర్కార్ 25 శాతం సుంకాల విధింపు
ఇవి భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటాకి సంబంధించిన అతి పెద్ద రంగాలు. ఇక డైమండ్, గోల్డ్ ప్రొడక్ట్స్- 40 శాతం, స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్స్- 35. 8శాతం, ఫిష్ అండ్ క్రస్టేసియన్స్- 32. 6 శాతం, ఐరన్ అండ్ స్టీల్ ఆర్టికల్స్- 28. 1శాతం, మిషనరీ, మెకానికల్ – 21. 8 శాతం, ఆర్గానిక్ కెమికల్స్- 17. 3 శాతం, ప్లాస్టిక్స్ అండ్ ఆర్టికల్స్- 16. 8 శాతం, వెహికల్ స్పేర్ పార్ట్స్- 12. 7 శాతం, పెట్రోలియం ప్రొడక్ట్స్- 4. 3 శాతంగా ఉంది. వీటన్నిటిపైనా ప్రస్తుతం ట్రంప్ సర్కార్ 25 శాతం సుంకం విధించనుంది. ఇది భారత్ కి ఇబ్బందికర పరిణామంగా మారనుందని అంటున్నారు నిపుణులు.
ఇందుకు అదనంగా మరికొంత జరిమానా?
ఈ ఇరవై ఐదు శాతానికి అదనంగా మరి కొంత జరిమానా వడ్డింపు సైతం విధించనున్నట్టు తెలుస్తోంది. అంటే వడ్డీకి చక్రవడ్డీ అన్నట్టు మరికొంత బాదుడు ఉందన్నమాట. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం చూస్తే.. ఇరాన్ నుంచి పెట్రోలియం ఉత్పత్తులు కొని మార్కెట్ చేస్తున్న 20 కంపెనీలపై ఆంక్షలు విధించనుంది యూఎస్. ఇందులో మన సంస్థలు ఆరు వరకూ ఉన్నాయి. ఒకప్పుడు బాంబులతో బెదిరించిన అమెరికా.. ప్రస్తుత ట్రంప్ పాలనలో కొత్తగా టారీఫులతో ఠారెత్తించే యత్నం చేస్తోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆపడంలో భాగంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు ట్రంప్. రష్యన్ చమురు, ఆయుధాల కొనుగోలు చేసినందుకు ఆగస్ట్ 1 నుంచి భారత్ పై ఈ జరిమానా విధిస్తున్నట్టు తన ట్రూత్ పోస్టు ద్వారా తెలియ చేశారు ట్రంప్.
భారత్ జీడీపీని దెబ్బ తీసే అవకాశముంది- నిపుణులు
అమెరికా ప్రతిపాదించిన సుంకం దానికి తోడు విధించనున్న జరిమానా.. భారత జీడీపీని దెబ్బ తీసేలా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు నిపుణులు. దీని పరిధి విధించబోయే జరిమానాపై ఆధార పడి ఉందని కూడా అంటున్నారు.. రేటింగ్ ఏజెన్సీ నిపుణులు. సుంకాల పెంపు- ప్రతికూలతను దృష్టిలో పెట్టుకుని గతంలో జీడీపీ అంచనా 6. 5 నుంచి 6. 2 శాతానికి తగ్గించిన పరిస్థితులున్నాయి. అమెరికా సుంకాలు భారత వృద్ధి రేటును తగ్గించడం ఖాయమనీ.. ఈ శాతం 0. 2 శాతం వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి మరి కొన్ని బ్రోకరేజ్ సంస్థలు. ఇక భారత స్టాక్ మార్కెట్లపై కూడా ఈ ప్రభావం పడింది. ఈ వార్త అందిన మరుక్షణం సూచీలు ఎరుపు రంగులోకి మారాయి. ఈ సుంకాలు దీర్ఘకాలికంగా ఉంటాయి కాబట్టి.. వీటి వ్యవహారం.. భారత్ పై ఖచ్చితమైన ప్రభావం చూపించవచ్చనే అంటున్నారంతా.
చమురు రంగంపై పెద్ద ఎత్తున సుంకాల ప్రభావం
భారత్- అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం ఎన్నో సార్లు చర్చలు జరిపింది. అంతే కాదు మోడీ సైతం గత ఫిబ్రవరిలో ట్రంప్ ని కలిశారు. అమెరికాను శాంతింప చేయడం కోసం- బోర్బన్ విస్కీ, మోటర్ సైకిల్ వంటి వస్తువులపై సుంకాల శాతాన్ని తగ్గించింది భారత్. అయినా గానీ అమెరికా- భారత్ మధ్య 45 బిలియన్ల వాణిజ్య లోటు అలాగే కొనసాగిస్తోంది. దీన్ని తగ్గించడానికి అమెరికా ఆసక్తి చూపిస్తోంది. కానీ అదిప్పటికీ అమల్లోకి రాలేదు. చమురు రంగంపై కూడా పెద్ద ఎత్తున సుంకాల ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. ట్రంప్ రష్యాపై మరింత సుంకం విధిస్తామన్న బెదిరింపుల కారణంగా.. రష్యా నుంచి మనం సరఫరా చేస్కుంటున్న చమురు ప్రవాహంపై ప్రభావం పడేలా కనిపిస్తోంది. భారత శుద్ధి కర్మాగారాలు, ముడి చమురు సరఫరా వ్యవస్థలను ఇది దెబ్బ తీసేలా తెలుస్తోంది.
రష్యా నుంచి చమురు కొంటున్నందుకే ఇదంతా?
భారత్ పై ఇంత కాఠిన్యం ప్రదర్శించడానికి ప్రధాన కారణం రష్యా నుంచి చమురు కొంటున్నందుకే అన్న అంచనా వేస్తున్నారు కొందరు నిపుణులు. అప్పటికీ భారత్ ఈ విషయంపై ఒక క్లారిట ఇచ్చింది. తాము రష్యన్ ఆయిల్ కొనకుంటే ఆ లోటు ఇతర దేశాల నుంచి సర్దుబాటు చేయాల్సి వస్తుంది. తద్వారా చమురు బ్యారెళ్ల ధరలు అమాంతం పెరిగే అవకాశమున్నట్టు భారత కేంద్ర మంత్రి ఆ డాటా మొత్తం వివరించి మరీ చెప్పారు. అయినా సరే, యూఎస్ ఇలా చేయడం ఏమీ బాగోలేదని అంటారు ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ డెవలప్ మెంట్ థింక్ ట్యాంక్ సభ్యులు.
జెనీవా, లండన్‌లో చైనాతో యూఎస్ చర్చలు
జెనీవా, లండన్ లో జరిగిన చర్చల తర్వాత చైనా దిగుమతులపై అమెరికా సుంకాలు 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గాయి. దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం చేసుకోడానికి ఆగస్టు 12 వరకూ సమయం తీస్కున్నారు. ఇక ట్రంప్ జూలై తొలినాళ్లలో వియత్నాంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏప్రిల్లో 46 శాతంతో పోలిస్తే ఈ సుంకాల శాతం ప్రస్తుతం 20 శాతానికి తగ్గింది. మరి భారత్ మాత్రం ఏం చేసింది? ఈ సుంకాల శాతం ఒక్కటంటే ఒక్క శాతం మాత్రమే తగ్గడమేంటి? అన్న చర్చ నడుస్తోంది వాణిజ్య వర్గాల్లో. అయితే ఇప్పటికీ చైనాతో పోలిస్తే భారత్ పై మెరుగైన సుంకమే విధించినట్టు భావించాలంటారు మరి కొందరు. చైనా వంటి ఇతర దేశాలతో పోలిక అనవసరం. ఇదే సుంకం కొనసాగితే.. సముద్ర ఉత్పత్తులు, ఔషధాలు, వస్త్రాలు, తోలు, ఆటోమొబైల్ వంటి పలు కీలక రంగాలనిది నేరుగా ప్రభావితం చేసేలా తెలుస్తోంది. ఇది సరికాదు. వచ్చే పదేళ్లలో 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరగాలంటే.. సడలింపు తప్పదని అంటారు భారత వాణిజ్య నిపుణులు.
భారత్ మా మిత్ర దేశమే. కానీ వాణిజ్య వర్తక వ్యవహారాల విషయంలో ఆ దేశంతో మేమింకా ఏమంత సజావుగా లేము. అమెరికాపై భారీ సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని అన్నారు ట్రంప్. కాబట్టి ఆ దేశంతో మేము ఏమంత పెద్ద ఎత్తున వ్యాపారం చేయడం లేదని తేల్చి చెబుతారాయన. మరి మోడీతో ఫ్రెండ్షిప్ ఏమైనట్టు? ట్రంప్ గెలవాలని మోడీ చేసిన ప్రచారం ఎందుకన్నట్టు? అసలేంటీ కన్ ఫ్యూజన్? తెలుగు రాష్ట్రాలపై ఈ సుంకాల ప్రభావం ఎలా ఉండనుంది?
భారత్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతి 32 శాతంపైగా
భారత్ పై 26 శాతం సుంకాల గురించి ఏప్రిల్లో చెప్పినపుడే.. ఏపీలో ఈ ప్రభావం పై చర్చ జరిగింది. కారణం.. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే సముద్ర ఉత్పత్తుల శాతం 32 కి పైగా ఉంది. అందునా తెలుగు ప్రాంతాల నుంచి దీని వాటా చాలా ఎక్కువ. ఏప్రిల్లో అమెరికా సుంకాలు ప్రకటించిన గంట వ్యవధిలోనే 100 కౌంట్ రొయ్యకు 40 రూపాయల ధర తగ్గింది. ఈ సుంకాలను కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నామని ట్రంప్ ప్రకటించడంతో.. కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఏపీ ఆక్వా రైతులు. గతేడాది రూ. 19,548 కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కాగా, ఇందులో 33 శాతం అమెరికాకి ఎగుమతి అయినట్టు తెలుస్తోంది. ఇపుడీ సుంకాల ప్రభావంతో ఈ ఉత్పత్త్తులపై పడేలా తెలుస్తోందని అంటారు నిపుణులు. అప్పుడే.. ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడారు. ఆ మాటకొస్తే చంద్రబాబు కూడా ఈ విషయంపై గతంలో స్పందించారు. మొన్నటికి మొన్న చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు భారీ ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం వెనక కూడా ఈ సుంకాల మోత ఉంది. ఈ భారీ టారీఫుల కారణంగా పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. దీని కారణంగా మామిడి గుజ్జు కొనే పరిశ్రమలు వెనకంజ వేస్తున్నాయి. దీంతో మామిడి రైతు తీవ్రంగా నష్టపోయిన దృశ్యం మనం చూసే ఉంటాం.
వ్యవసాయ, పాడి రైతులు, MSMEలపై ఎఫెక్ట్
ఈ సుంకాల వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఇవి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించే పన్నులు. ఈ అధిక సుంకాల కారణంగా ఎగుమతి చేసేవారు విపరీతంగా ప్రభావితం అవుతారు. ఈ మొత్తం భారం ఆయా వస్తువులపై పడుతుంది. వీటిని కొనే వినియోగదారులు ధర ఎక్కువ కారణంగా వాడ్డానికి నిరాకరిస్తారు. దీంతో వీటి డిమాండ్ తగ్గుతుంది. తద్వారా.. భారీ ఎత్తున ఎక్స్ పోర్టర్స్ ధరలు తగ్గించుకోవల్సి వస్తుంది. ఇది వారి వారి లాభాల మార్జిన్లపై విశేష ప్రభావం చూపుతుంది. అందుకే ఇంత ఆందోళనగా చెబుతారు ఫిక్కీ ప్రతినిథులు. వ్యవసాయ, పాడి రైతులు, ఎంఎస్ఎంఈలకు చెందిన సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వారి సంక్షేమంపై ఈ సుంకాల ప్రభావం పెద్ద ఎత్తున పడనుందన్న అంచనాలు వేస్తున్నారు. అమెరికా చేసిన ఈ ప్రకటన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీపై దాడి చేసింది. ప్రధాని మోడీ ట్రంప్ గెలుపు కోసం ప్రచారం చేశారు. రెండో సారి ట్రంప్ గెలిచాక.. మోడీ ట్రంప్ ని కలిసినపుడు తన తప్పిపోయిన సోదరుడ్ని కలిసినంత సంతోషం వ్యక్తం చేశారు. మరి ట్రంప్ చూస్తే.. భారత్ పై సుంకాల మోత మోగిస్తున్నారు. ఇది భారత విదేశాంగ విధానంలోని దారుణమైన వైఫల్యం అంటూ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.
రష్యాతో ఆయుధ, చమురు, తదితర వాణిజ్య సంబంధాలే కీలకం?
ప్రపంచమంతా ఉక్రెయిన్ మరణాలు ఆగాలని చూస్తోందని అంటారు ట్రంప్. అలాంటి మరణాలకు కారణమైన రష్యాతో భారత్ కొనసాగించే ఆయుధ, చమురు తదితర వాణిజ్య సంబంధాలే.. ఇక్కడ భారత్ పై సుంకాల మోతకు ప్రధాన కారణంగా చెబుతున్నారాయన. దీంతో భారత్ ని తీవ్రంగా ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది ట్రంప్ సర్కార్. ఒక వేళ రష్యాతో భారత్ గానీ సంబంధాలు నెరపకుంటే చమురు ధరలు భారీ ఎత్తున పెరిగే అవకాశముంది. మొన్నటి ఆపరేషన్ సిందూర్ విషయంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S 400లు ఎంతో మేలు చేశాయి. వీటన్నిటినీ ట్రంప్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప మొండిగా భారత్ ను వ్యతిరేకించడం సరికాదంటారు కొందరు నిపుణులు. అయితే మోడీ తనకు ట్రంప్ తో ఉన్న చనువు కొద్దీ.. వివరంగా మాట్లాడితే అంతా సెట్ అవుతుందంటారు వీరు.
25 శాతం సుంకాల మోత తాత్కాలికమే అన్న అశాభావం
చాలా మంది ఆశిస్తున్నదేంటంటే ఈ సుంకాల మోత బాగా తగగాలని. ఈ 25 శాతం తాత్కాలికమేనని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ మొత్తం 15 నుంచి 20 శాతం మధ్యకు కుదించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆగస్టు లోనూ అమెరికాతో భారత్ వాణిజ్య చర్చలు చేసే ఛాన్స్ ఉంది. మరి అప్పుడైనా ఈ సుంకాలు తగ్గే అవకాశముందా? అన్నదిపుడు చర్చనీయాంశంగా ఉంది. కొందరు సూచిస్తున్నదేంటంటే రష్యాతో భారత్ కి గొప్ప సంబంధ బాంధవ్యాలున్నాయి. ఇప్పటికీ రష్యా- భారత్ మధ్య సత్సంబంధాలు ఎంత మాత్రం చెక్కు చెదరడం లేదు. ప్రపంచమంతా ఏకమైనా భారత్ కి కొమ్ము కాయడంలో రష్యా ఎంత మాత్రం వెనకాడదు. రష్యా కూడా భారత్ మాటను కాదనే పరిస్థితి లేదు. ఈ పరిచయాలు గత కాలపు సాంస్కృతిక ఆయుధ సంబంధాలను వాడుకుని భారత్ రష్యాను ఉక్రెయిన్ యుద్ధం నుంచి వెనక్కు మళ్లించే యత్నం చేయాలి. అలా మోడీ ఎందుకు చేయడం లేదు? అన్నది ట్రంప్ తరఫు ప్రతినిథుల కామెంట్ గా తెలుస్తోంది. ప్రత్యేకించి మోడీ ట్రంప్ తో ఏం పెద్ద చర్చలు చేయక్కర్లేదు. ఇలా చేస్తే సరిపోతుందన్న సలహా ఇస్తున్నారు. కానీ ఇదేమంత వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
చైనా, ఆఫ్రికాలతో కలసి భారత్ కొత్త జట్టు?
ఎందుకంటే భారత్ కూడా యూఎస్- చైనాతో సమానంగా ఎదిగే యత్నం చేస్తోంది. సొంతంగా ఆయుధాలను సైతం తయారు చేసుకుంటోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం తనవంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. యూఎస్ ద్వారా వచ్చే నష్టాన్ని ఇతర మార్గాల ద్వారా పూరించేలా తెలుస్తోంది. ఇప్పటికే మోడీ మైండ్లో ఒక ప్రొగ్రాం ఫిక్స్ అయినట్టు భావిస్తున్నారు. ఈ పోరాటంలో చైనా కూడా చేయి కలిపేలా తెలుస్తోంది. ఎందుకంటే చైనా పై కూడా ఇంతే స్థాయిలో సుంకాలున్నాయి. చైనా నుంచి యూఎస్ కి అరుదైన ఖనిజాల దిగుమతి అవసరమైన పరిస్థితి కనిపిస్తున్నా.. ఈ దేశంతోనూ కరాఖండిగానే ఉంటూ వస్తోంది. ఈ విషయం గుర్తించిన భారత్ చైనాను కలుపుకుపోయే ఎత్తుగడ వేస్తోంది. మొన్నటికి మొన్న చైనా టూరిస్టులకు వీసాలకు అనుమతులిచ్చింది. అమెరికా ఇలాగే కఠినంగా వెళ్లే పనైతే.. చైనా, ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ తో కలసి కొత్త జట్టుగా ఏర్పడేందుకు భారత్ చూస్తున్నట్టు అంచనా వేస్తున్నారు పలువురు దౌత్య నిపుణులు.
Story By Adinarayana, Bigtv