HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ {HCA} అధ్యక్షుడు జగన్ మోహన్ రావుని సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. జగన్మోహన్ రావు తో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటే, శ్రీ చక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ లను సిఐడి అధికారులు ప్రశ్నించారు. నిందితులను న్యాయవాదుల సమక్షంలోనే సిఐడి అధికారులు విచారణ చేపట్టారు.
Also Read: MS Dhoni: కొత్త లుక్ లో MS ధోని.. ఆయన స్టైల్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే
అసలు క్రికెట్ తో సంబంధం లేని జగన్మోహన్ రావు హెచ్సీఏ లోకి ఎలా ఎంటర్ అయ్యాడు..? శ్రీ చక్ర క్లబ్ ని ఎలా సృష్టించారు..? ఎవరెవరి సంతకాలను ఫోర్జరీ చేశారు..? ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఎవరున్నారు..? అనే విషయాలపై జగన్ మోహన్ రావు ను ప్రశ్నించారు. అలాగే అతడికి సహకరించిన రాజేందర్, కవిత యాదవ్ లను కూడా విచారణ చేపట్టారు. అయితే హెచ్సీఏ లో అవినీతి, అక్రమాల ఆరోపణల పై జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న జగన్మోహన్ రావు పై తాజాగా వేటు పడింది.
జగన్మోహన్రావుతోపాటు కార్యదర్శి దేవరాజ్, కోశాధికారి సీ.జె. శ్రీనివాస్ లను హెచ్సీఏ ఎపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది. ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ ఆరోపణలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో హెచ్సీఏ ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జూలై 28న జరిగిన అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఓ ప్రకటనలో హెచ్సీఏ ఎపెక్స్ కౌన్సిల్ పేర్కొంది.
ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. ఇక తదుపరి విచారణ పూర్తి అయ్యేవరకు జగన్మోహన్ రావు హెచ్.పీ.ఏ కార్యకలాపాల్లో పాల్గొన రాదని ఆదేశించింది. ప్రస్తుతం హెచ్ఈఏ వ్యవహారాలను తాత్కాలికంగా అపెక్స్ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది. అయితే జగన్మోహన్ రావుతో పాటు మరో నలుగురిపై సుమారు రూ. 2.3 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. క్రికెట్ బంతులు, క్యాటరింగ్ సేవలు, ఎలక్ట్రికల్ మెటీరియల్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే 2023లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేసేందుకు జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసిన క్రికెట్ క్లబ్ సభ్యత్వాన్ని ఉపయోగించారని ఆరోపణలు, గౌలి పుర క్రికెట్ క్లబ్ నకిలీ సభ్యత్వాన్ని సమర్పించారని సిఐడి అధికారులు గుర్తించారు.
Also Read: Ind Vs Eng 5th Test: నేడు కీలక మ్యాచ్.. టీమ్ ఇండియాలో మార్పులివేనా… ఇక ఇంగ్లాండ్ కు చుక్కలే ?
ఇక 2025 ఐపీఎల్ సీజన్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ {ఎస్ఆర్హెచ్} యాజమాన్యాన్ని అదనపు కాంప్లిమెంటరీ టికెట్ల కోసం వేధించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం విషయాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ముగ్గురిపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ {HCA} నియమావళి ప్రకారం చర్యలు తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ ఆరోపణలపై సీఐడీ, ఈ.డి వంటి సంస్థల దర్యాప్తు కొనసాగుతుందని.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విశ్వసనీయత, విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.