నిరుద్యోగులకు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిపుణులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తీపి కబురు అందించింది. రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, సీనియర్ మేనేజర్, ఇంజనీర్, ఆఫీసర్, ఐటీ డెవలపర్ వంటి కీలక పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 418 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ మరియు మేనేజ్మెంట్ విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో B.E/B.Tech, M.Tech లేదా MCA ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యా అర్హతలతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం (Work Experience) తప్పనిసరి అని బ్యాంక్ స్పష్టం చేసింది.
ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు..
ఆఫీసర్: 22 నుంచి 32 ఏళ్లు.
మేనేజర్: 24 నుంచి 34 ఏళ్లు.
సీనియర్ మేనేజర్: 27 నుంచి 37 ఏళ్లు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు మరియు పీడబ్ల్యూడీ (PwD) అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు మినహాయింపు లభిస్తుంది.
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్ చేస్తోంది:
ఆఫీసర్: నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,920 వరకు.
మేనేజర్: నెలకు రూ. 64,820 నుంచి రూ. 93,960 వరకు.
సీనియర్ మేనేజర్: నెలకు రూ. 85,920 నుంచి రూ. 1,05,280 వరకు జీతం లభిస్తుంది.
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. మొదట రాత పరీక్ష (Online Test) నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి సైకోమెట్రిక్ టెస్ట్, ఆపై తుది దశలో పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 2026 జనవరి 30
దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 19
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు కేవలం రూ. 175 మాత్రమే.
మరిన్ని వివరాల కోసం, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం, బ్యాంకింగ్ నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.