TGPSC Group-2,3 Results: 2024 ఏడాది చివరిలో తెలంగాణలో గ్రూప్-1,2,3 పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్స్ పరీక్షలను ఎలాంటి అవకతవకలు లేకుండా రేవంత్ సర్కార్ నిర్వహించింది. ముందు గ్రూప్-1 పరీక్షలను ఆ తర్వాత నవంబర్ నెలలో గ్రూప్-3 పరీక్షలు, డిసంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షల ఫలితాల కోసం అభ్యర్థులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎగ్జామ్స్ బాగా రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం వేచి చూస్తుండగా.. ఎగ్జామ్స్ నార్మల్ గా రాసిన అభ్యర్థులు మరో నోటిఫికేషన్ ఎదురుచూస్తున్నారు.
783 పోస్టులకు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు 45 శాతం మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. గ్రూప్-2 పోస్టులకు మొత్తం 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,51,486 మంది అభ్యర్థులు మాత్రమే అటెండ్ అయ్యారు. ఈ క్రమంలోనే గ్రూప్స్ ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. అయితే, టీజీపీఎస్సీ ముందుగా గ్రూప్-1 ఆ తర్వాత గ్రూప్-2, అనంతరం గ్రూప్-3 పరీక్షల ఫలితాలను విడుదల చేయాలనే యోచనలో ఉంది. ఇలా రిజల్ట్స్ ప్రకటించడం వల్ల గ్రూప్-1 ఉద్యోగం వచ్చిన అభ్యర్థి గ్రూప్-2 ఉద్యోగం వచ్చినా గ్రూప్-1 ఉద్యోగంలోనే చేరుతాడు. దీని వల్ల ఇతర అభ్యర్థులు మేలు జరిగే అవకాశం ఉంటుంది.
ముందుగా గ్రూప్-1 ఫలితాలు..
అందువల్లే, ముందుగా గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికి గ్రూప్-1 మెయిన్స్ కు అడ్డుగా ఉన్న లీగల్ చిక్కులు అన్నీ తొలిగిపోయాయి. జీవో 29 పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీలోగా గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్ననట్లు సమాచారం. అనంతరం గ్రూప్-2, 3 ఫలితాలను ప్రకటించే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్–1,2,3 పరీక్షలకు సంబంధించి 2,734 పోస్టులు భర్తీ కానుండగా.. మొత్తం 5,51,247 మంది అభ్యర్థులు పరీక్షలకు అటెండ్ అయ్యారు. ఏప్రిల్ చివర వారం లోపే అన్ని పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.
కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడంటే..?
పరీక్షల ఫలితాలు అన్నీ విడుదల చేశాక మళ్లీ గ్రూప్స్ నోటిఫికేషన్లు రానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మే నెలలో కొత్త ఉద్యోగ ప్రకటనలకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈ నెల 31వ తేదీ నాటికి అన్ని శాఖల్లో ఖాళీల సంఖ్యను అందజేయాలని రేవంత్ సర్కార్ కు లేఖ రాయనున్నట్లు ఇటీవల TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం మీడియాలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే నెలలో ఈ అంశాలపై చర్చించి.. మే 1 నుంచి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.