TCS Layoffs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఉద్యోగాలపై తీసుకున్న తాజా నిర్ణయాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. జూలై 27న, సంస్థ తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 2 శాతం మందిని తొలగించనున్నట్టు వెల్లడించింది. అంటే కనీసం 12,000 మందికి పైగా ఉద్యోగులు పని కోల్పోతారు అన్న మాట. ఇది తమ ‘ఫ్యూచర్-రెడీ ఆర్గనైజేషన్’ లక్ష్యాల్లో భాగమని చెబుతోంది సంస్థ. కానీ ఈ ప్రకటన వెలువడిన వెంటనే బలవంతపు రాజీనామాలు, నియమ నిబంధనల ఉల్లంఘనలు అనే ఆరోపణలు ముందుకు వచ్చాయి.
ఇది కేవలం సాధారణ పునర్వ్యవస్థీకరణ కాదు అని ఉద్యోగులు అంటున్నారు. అసలు సమస్య టీసీఎస్ కొత్తగా ప్రవేశపెట్టిన ‘Bench Policy’. ఇప్పుడు ఈ పాలసీ ప్రకారం, ఉద్యోగి ఏడాదికి కేవలం 35 గంటల పాటు మాత్రమే ‘Bench’ మీద ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆ సమయంలోనే అతను ప్రాజెక్ట్ దొరకించుకోవాలి. లేదంటే అతనికి సంస్థలో స్థానం ఉండదు అన్న మాట. ఇంత తక్కువ సమయంతో ప్రాజెక్ట్ దొరకడం చాలా కష్టం కావడంతో ఉద్యోగులు దాదాపు బలవంతంగా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం KITU జూలై 29న లేబర్ డిపార్ట్‌మెంట్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. సంస్థ వందలాది ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నదని వారు ఆరోపించారు. టీసీఎస్ బెంగళూరు ఆఫీసులో ఇటీవలే పలు వందల మంది రాజీనామాలు చేయించారని యూనియన్ చెప్పింది. తమ హెల్ప్‌లైన్‌కి 25 మందికి పైగా ఉద్యోగులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు తెలిపారు.
ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, 1947 ప్రకారం, 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలంటే ప్రభుత్వం ముందస్తుగా అనుమతిని తీసుకోవాలి. అలాగే, ఉద్యోగుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలన్న నిబంధన ఉంది. కానీ టీసీఎస్ ఈ నిబంధనలను పాటించలేదని KITU ఆరోపిస్తోంది. దాంతో లేబర్ డిపార్ట్‌మెంట్ సంస్థకు నోటీసు జారీ చేసింది. టీసీఎస్ మాత్రం తమ నిర్ణయాన్ని రీ-స్కిల్లింగ్, బిజినెస్ మార్పుల దృష్టితో తీసుకున్నదిగా చెబుతోంది. మిడిల్, సీనియర్ స్థాయి ఉద్యోగులే ఎక్కువగా ప్రభావితమవుతారని పేర్కొంది. దీన్ని సేవా ప్రమాణాలపై ప్రభావం లేకుండా కచ్చితంగా అమలు చేస్తామని, ఉద్యోగులకు అవసరమైన కౌన్సెలింగ్, అవుట్‌ప్లేస్‌మెంట్ సహాయాన్ని అందిస్తామని వెల్లడించింది. అయితే, ఇది నిజంగా ఉద్యోగులకు మేలు చేయడానికి తీసుకున్న నిర్ణయమా? లేక బలవంతపు తొలగింపుల వెనక వ్యూహమా? అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. కార్మిక హక్కులు, నిబంధనలు అన్నీ ఉల్లంఘిస్తూ కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది ఉద్యోగుల పక్షం. ఈ కేసు ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.