గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో దేశంలోనే అత్యున్నత ఆర్థిక సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD), నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు (ఫిబ్రవరి 3, 2026) చివరి తేదీ కావడంతో అభ్యర్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
విద్యార్హత, పోస్టుల వివరాలు..
మొత్తం 162 పోస్టులలో డెవలప్‌మెంట్ అసిస్టెంట్ కేటగిరీలో 159 పోస్టులు, డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ) విభాగంలో 03 పోస్టులు ఉన్నాయి.
డెవలప్‌మెంట్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
డెవలప్‌మెంట్ అసిస్టెంట్ (హిందీ): హిందీ, ఇంగ్లీష్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు ఇంగ్లీష్ నుండి హిందీకి అనువాదం చేయగల సామర్థ్యం ఉండాలి.
రెండు రకాల పోస్టులకు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
వయస్సు, వేతన వివరాలు ఇవే..
అభ్యర్థుల వయస్సు జనవరి 1, 2026 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు సుమారు రూ. 46,500 వరకు వేతనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ స్థాయి హోదా, ఆకర్షణీయమైన అలవెన్సులు ఈ ఉద్యోగాల ప్రత్యేకత.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ..
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటగా ఆన్‌లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి మెయిన్ పరీక్ష ఉంటుంది. అనంతరం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర అధికారిక భాషపై పట్టు ఉందో లేదో తెలుసుకోవడానికి లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. చివరగా ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలను ఖరారు చేస్తారు.
ముఖ్యమైన తేదీలు.. ఫీజు వివరాలు..
జనవరి 17న ప్రారంభమైన ఈ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3తో ముగియనుంది. ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 21న, మెయిన్ పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: జనవరి 17
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 3
ఫీజు విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 150 (ఇంటిమేషన్ ఛార్జీలు) చెల్లిస్తే సరిపోతుంది. ఇతర అభ్యర్థులు దరఖాస్తు ఫీజు, ఇంటిమేషన్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ. 550 చెల్లించాల్సి ఉంటుంది.
ఆసక్తి గల అభ్యర్థులు నాబార్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. గడువు ముగిసేలోపు దరఖాస్తు పూర్తి చేసి, పరీక్షకు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nabard.org/