Handri – Neeva Canal: రాయలసీమకు కృష్ణా జలాలు తరలించే ఉద్దేశంతో నిర్మించిన హంద్రీ-నీవా కాలువలో నీరు లేవంటూ వైసీపీ చేసిన విమర్శలను.. ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వినూత్నంగా తిప్పికొట్టారు. హంద్రీ-నీవా కాలువలోకి దిగి ఈతకొట్టి మరీ విపక్ష పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కాలువలో నీరు పుష్కలంగా ప్రవహిస్తున్నాయని.. వైపీసీ కావాలనే అసత్యపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆరోపించారు.
సీఎం చంద్రబాబు (CM Chandrababu) సొంత నియోజకవర్గమైన కుప్పంలోని పాపనూరు గ్రామానికి వెళ్తూ.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 6 నెలలుగా నిర్విఘ్నంగా సీమలోకి ప్రవహిస్తున్న కృష్ణమ్మను చూపిస్తూ.. దమ్ముంటే ఇక్కడికి రావాలని వైసీపీ నేతలకు సవాలు విసిరారు. ఇక్కడకు వస్తే కాలువలో పారేది నీరో కాదో చూపిస్తామంటూ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు.
ఈరోజు కుప్పం నియోజకవర్గంలోని పాపానూరు గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో హంద్రీనీవా కాలువలో దిగి ఈతకొడుతు,గత 6 నెలలుగా నిర్విఘ్నంగా సీమలో ప్రవహిస్తున్న క్రిష్ణమ్మను చూపిస్తూ దమ్ముంటే ఇక్కడకు రండి మిమ్మల్ని ముంచి చూపిస్తాం ఇవి నీళ్ళో కాదో అని సవాల్ విసిరిన ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్… pic.twitter.com/tgxgJjnyic
— Yash (@YashTDP_) February 3, 2026
టీడీపీ – జనసేన – బీజేపీ భాగస్వాములుగా గల కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకు నీరు అందిస్తోందని ఎమ్మెల్సీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు పుణ్యమా అని రాయలసీమలో ఇప్పటికే వందల చెరువులు నిండాయని.. మరికొన్ని రోజుల్లో మిగిలినవి కూడా నీళ్లతో కళకళలాడతాయని ప్రభుత్వ విప్ అన్నారు. అలాంటి హంద్రీనీవా నీళ్ల గురించి అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని విపక్ష వైసీపీని ఆయన హెచ్చరించారు.
Also Read: Refrigerators Launch Feb 2026: కొత్త ఫ్రిడ్జ్ కోసం చూస్తున్నారా? ఫిబ్రవరి నెలలోని టాప్ మోడల్స్ ఇవే!
రాయలసీమ ప్రాంతాన్ని సస్యశామలం చేసే లక్ష్యంతో హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో హంద్రీనీవా కోసం రూ. 4,200 కోట్లు ఖర్చు చేశారు. 2026 ఫిబ్రవరి నాటికి ఈ ప్రాజెక్టు కోసం రూ. 13,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, హంద్రీనీవా నీటి ప్రవాహం ఇప్పటివరకూ 490 కిలో మీటర్లు దురాన్ని అధిగమించినట్లు హెచ్ఎన్ఎస్ఎస్ ఈఈ అమరనాథ్ రెడ్డి ఇటీవల తెలిపారు. ప్రస్తుతం రాయలసీమలోని చాలా వరకూ చెరువులు, కుంటలు నీటితో నిండి.. వర్షాకాలాన్ని తలపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Also Read: Arava Sridhar: లైంగిక వేధింపుల ఆరోపణలు.. జనసేన ఎమ్మెల్యేను ఉతికి ఆరేసిన త్రీమెన్ కమిటీ!