నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్.. ఈ రోజుతో ముగియనున్న 22,195 ఉద్యోగాల రైల్వే గ్రూప్- డీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును పెంచుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 9 వరకు పెంచుతూ రైల్వే బోర్డు అధికారికంగా ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-డి (లెవల్-1) పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. రైల్వేలో స్థిరపడాలనుకునే యువతకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ద్వారా పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ వంటి కీలక విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.
సికింద్రాబాద్ జోన్‌లో…
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ప్రధాన కేంద్రమైన సౌత్ సెంట్రల్ రైల్వే (సికింద్రాబాద్) జోన్‌లో మొత్తం 1,012 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి లేదా సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు:
2026 జనవరి 1వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండటం తప్పనిసరి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18,000 ప్రారంభ వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తు రుసుము విషయానికొస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. వీరు పరీక్షకు హాజరైతే రూ.400 తిరిగి రీఫండ్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే జనవరి 31న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 09వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. దరఖాస్తు రుసుము చెల్లించడానికి మార్చి 11 వరకు గడువు ఉంది.
నోట్: దరఖాస్తుకు చివరి తేది: మార్చి 9
ఒకవేళ దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు దొర్లితే వాటిని సవరించుకోవడానికి మార్చి 12 నుండి మార్చి 21 వరకు ఎడిట్ విండో అందుబాటులో ఉంటుంది.
దేశవ్యాప్తంగా ట్రాఫిక్, ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. రైల్వేలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rrbapply.gov.in/
ALSO READ: Central Bank of India: లక్షకు పైగా జీతం.. సీబీఐ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్, మీకు ఈ అర్హత ఉందా..?