యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఒక అద్భుతమైన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ‘కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CMS) 2026’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,358 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖలో పనిచేయాలని అనుకునే అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1358
పోస్టుల వివరాలు: మొత్తం 1,358 ఖాళీలలో అత్యధికంగా సెంట్రల్ హెల్త్ సర్వీస్ పరిధిలోని జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 864 ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో 450 పోస్టులు కేటాయించారు. అలాగే న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో 14 పోస్టులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 30 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
విద్యార్హత: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ (MBBS) పాసై ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువున్న విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులు అవుతారు. ఇంటర్న్‌షిప్ ఇంకా పూర్తి చేయని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నియామక ప్రక్రియ నాటికి తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: సాధారణ అభ్యర్థుల వయస్సు 2026 ఆగస్టు 1 నాటికి 32 ఏళ్లకు మించరాదు. అంటే అభ్యర్థులు ఆగస్టు 2, 1994 తర్వాతే జన్మించి ఉండాలి. సెంట్రల్ హెల్త్ సర్వీస్ గ్రేడ్ పోస్టులకు మాత్రం గరిష్ట వయస్సు 35 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పే మేట్రిక్స్ లెవల్-10 కింద జీతభత్యాలు ఉంటాయి. ప్రారంభ వేతనం నెలకు రూ. 56,100 నుండి రూ. 1,77,500 వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులతో పాటు నాన్-ప్రాక్టీసింగ్ అలవెన్స్ (NPA) కూడా అదనంగా ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో 500 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 250 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన వారికి రెండో దశలో 100 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రెండు దశల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsconline.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి.
ముఖ్య తేదీలు: మార్చి 11న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ మార్చి 31 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. రాత పరీక్షను ఆగస్టు 2, 2026న నిర్వహించనున్నారు.
ALSO READ: AAI Recruitment: డిగ్రీ పాసైన వారికి సువర్ణవకాశం.. ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగ అవకాశాలు, మంచి వేతనం