Pilot job: ఇండియాలో విమానయాన పరిశ్రమ రోజురోజుకీ చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఏడాది దేశంలో చాలా మంది విమానయానం చేస్తున్నారు. అయితే ప్రయాణికుల పెరుగదల అనేది నూతన ఉద్యోగాలను సృష్టిస్తోంది. ఇందులో పైలట్, ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి..? ఉద్యోగానికి సెలెక్ట్ అయితే ఎంత జీతం ఉంటుంది..? వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి..? అనే దాని గురించి మనం తెల్సుకుందాం. అలాగే ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన భారతీయ విమానయాన సంస్థలలో పైలట్లు, ఎయిర్ హోస్టెస్‌ల జీతాలు, వారికి ఉండే సౌకర్యాల గురించి ఇప్పుడు మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
⦿ పైలట్ల జీతాలు, వారి సౌకర్యాలు అనేవి వారు పని చేసే విమానయాన సంస్థపై ఆధారపడి ఉంటుంది. 2025 ఏప్రిల్ వరకు వారి వేతనాలు ఇలా ఉన్నాయి.
⦿ ఎయిర్ ఇండియా: 2022లో టాటా గ్రూప్‌లో చేరిన తర్వాత ఎయిర్ ఇండియా మంచి వేతనాలను అందిస్తుంది. కొత్తగా పైలట్ ఉద్యోగం(జూనియర్ ఫస్ట్ ఆఫీసర్‌గా పిలుస్తారు..)లో చేరిన వారికి ప్రారంభ వేతనమే.. నెలకు దాదాపు రూ.2,35,000 ఉంది. అయితే సీనియర్ కెప్టెన్లకు నెలకు రూ.8,50,000 నుంచి రూ.10,00,000 వరకు జీతం ఉంటుంది. అంటే ఏడాదికి కోటి రూపాయలు వరకు సంపాదిస్తారు.
⦿ ఇండిగో: మార్కెట్ పరంగా చూసుకుంటే దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో. ఇది కొత్తగా ఎంపికైన పైలట్ ఉద్యోగాలకు నెలకు రూ.1,50,000 వేతనం ఉంటుంది. సీనియర్ పైలట్ ఉద్యోగులకు అయితే నెలకు రూ.6లక్షల వరకు జీతం ఉంటుంది. అంటే ఏడాదికి వీరు రూ.72లక్షలు సంపాదిస్తారు. అయితే, ఇటీవల ఇండిగో జూనియర్ పైలట్ల విమాన ప్రయాణ గంటలను 70 నుండి 50 గంటలకుకి తగ్గించింది. ఈ క్రమంలోని వారి జీతాన్ని నెలకు రూ.2,15,000 తగ్గించింది.
⦿ విస్తారా: 2025లో ఎయిర్ ఇండియాతో విలీనం అయిన విస్తారా.. కొత్తగా పైలట్ ఉద్యోగంలో ఎంపికైన వారికి నెలకు రూ.2,50,000 నుంచి రూ.3 లక్షల వరకు అందిస్తుంది. సీనియర్ పైలట్లు, కెప్టెన్లకు నెలకు రూ.5లక్షల నుంచి రూ.7,50,000 వరకు ఉంటుంది. అంటే వీరు ఏడాదికి రూ.60లక్షల నుంచి రూ.90లక్షల వరకు సంపాదిస్తారు.
⦿ స్పైస్‌జెట్: స్పైస్‌జెట్ కొత్త పైలట్‌లకు నెలకు రూ.80వేల రూ.లక్ష వరకు వేతనం అందిస్తుంది. సీనియర్ పైలట్లు నెలకు రూ.4,20,000 నుంచి రూ.5,80,000 వరకు జీతం ఉంటుంది. అంటే వీరు ఏడాదికి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు సంపాదిస్తున్నారు. అయితే విమానయాన సంస్థ ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్ల కారణంగా జీతంలో మార్పులు ఉండొచ్చు.
⦿ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: ఎయిర్ ఇండియాకు చెందిన ఈ తక్కువ ఖర్చు విభాగం కొత్తగా ఎంపికైన పైలట్ ఉద్యోగులకు నెలకు రూ.1,90,000 నుంచి రూ.5,40,000 వరకు వేతనం అందిస్తుంది. సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు నెలకు రూ.2,35,000 నుంచి రూ.3,45,000 వరకు జీతం ఉంటుంది. కెప్టెన్లకు రూ.5,15,000 నుంచి రూ.5,70,000 వరకు జీతం పొందుతారు. విమాన ప్రయాణ గంటలు, లేఓవర్‌లను బట్టి అదనపు జీతభత్యాలు కూడా ఉంటాయి.
⦿ పోలికలు చూసుకుంటే..: ఎయిర్ ఇండియా సంస్థ అత్యధిక సీనియర్ పైలట్‌కు కోటి రూపాయలు ఇచ్చి ఎక్కువ జీతం ఇస్తున్న సంస్థగా నిలిచింది. ఇండిగో, విస్తారా విమానయాన సంస్థలు మధ్య స్థాయి వేతనాన్ని అందిస్తున్నాయి. స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయాన సంస్థలు వాటితో పోలిస్తే కాస్త తక్కువ జీతాన్ని అందిస్తున్నాయి. అయితే, ఈ సంస్థలు ఆదాయాన్ని పెంచడానికి ఇతర భత్యాలను అందిస్తున్నాయి. అయితే, కొంతమంది పైలట్లు కొత్త కాంట్రాక్టులు అలాగే.. తగ్గిన గంటలతో ఒత్తిడికి గురవుతున్నారని భావిస్తున్నారు.
⦿ ఎయిర్ హోస్టెస్: వీరు ప్రయాణీకుల భద్రత, సౌకర్యాన్ని పర్యవేక్షిస్తుంటారు. వారి జీతాలు కూడా ఎయిర్‌లైన్, అనుభవాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
⦿ ఎయిర్ ఇండియా: ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది జీతం నెలకు రూ.53,000 నుంచి రూ.78,000 వరకు ఉంటుంది. కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు శిక్షణ సమయంలో.. రూ.25,000 నుంచి రూ.35,000 వరకు అందజేస్తారు. సీనియర్ సిబ్బందికి అయితే ఏడాదికి రూ.13లక్సల వరకు సంపాదిస్తారు. అంతర్జాతీయ విమానాలకు ఎయిర్‌లైన్ మెరుగైన జీతం అందిస్తుంది.
⦿ ఇండిగో: క్యాబిన్ సిబ్బందికి ప్రారంభ జీతం నెలకు రూ.37,500 నుంచి రూ.50,000 ఉంటుంది. 8 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి నెలకు రూ.లక్ష నుండి రూ.1,25,000 వరకు జీతం ఉంటుంది. అంటే వీరు ఏడాదికి రూ.12 లక్షల నుండి రూ.15లక్షల వరకు సంపాదిస్తారు.
⦿ విస్తారా: విస్తారా కొత్త క్యాబిన్ సిబ్బందికి నెలకు రూ.33,333 నుంచి రూ.50,000 వేతనం ఉంటుంది. సీనియర్ ఉద్యోగాలకు నెలకు రూ.1.25 లక్షల వరకు వేతనం లభిస్తుంది. వీరు ఏడాదికి రూ.15లక్షల వరకు సంపాదిస్తారు.
⦿ స్పైస్‌జెట్: స్పైస్‌జెట్ ప్రారంభ జీతం నెలకు రూ.33,333 నుండి రూ.66,667 జీతం అందిస్తుంది. సీనియర్ సిబ్బంది నెలకు రూ.1 లక్ష (ఏడాదికి రూ.12 లక్షలు) వరకు సంపాదిస్తారు. అయితే ఎయిర్‌లైన్ ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా వేతనంలో మార్పులు ఉండొచ్చు.
Also Read: IOCL Recruitment: ఐవోసీఎల్‌లో 1770 పోస్టులు, స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.. పూర్తి వివరాలివే..
పైలట్ ఉద్యోగం పొందాలంటే..?
⦿ విద్యార్హత: ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. అందులో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు కచ్చితంగా ఉండాలి.
⦿ లైసెన్స్ కావాలంటే: ఫ్లయింగ్ స్కూల్‌లో చేరవచ్చు. DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) పరీక్షలలో ఉత్తీర్ణులై, కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందవచ్చు. దీనికి ఒకటి నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు ఖర్చు అవుతోంది.
⦿ ఎయిర్‌లైన్ అవసరాలను తీర్చడానికి కనీసం 200 నుంచి 250 గంటలు విమాన ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
⦿ ఎయిర్‌లైన్స్‌కు దరఖాస్తు విధానం: ఎయిర్ ఇండియా, ఇండిగో లేదా విస్తారా వంటి ఎయిర్‌లైన్స్‌కు మీ రెజ్యూమ్‌ను పంపాలి. వారు నిర్వహించే ఇంటర్వ్యూలు, ఎగ్జామ్‌లకు అటెండ్ కావాలి.
⦿ శిక్షణ: ఎంపికైతే మూడు నుంచి 6 నెలల మధ్యలో ఎయిర్ లైన్ శిక్షణ పూర్తి చేయవచ్చు.
⦿ ఫిట్ నెస్: ఈ ఉద్యోగాలకు ఫిటెనెస్ చాలా ముఖ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అలాగే క్రమం తప్పకుండా మెడికల్ టెస్టులు చేసుకోండి.
ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం పొందాలంటే..?
⦿ విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ పాసవ్వాలి.
⦿ వయస్సు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. (కొన్ని విమానయాన సంస్థలలో పనిచేసిన సీనియర్లకు 35ఏళ్ల వరకు అర్హత ఉంటుంది)
⦿ ఎత్తు & బరువు: కనీసం 155 సెంటిమీటర్ల ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలి(BMI 18-22).
⦿ విజన్: నార్మల్ కంటి చూపు
⦿ లాంగ్వేజ్: ఇంగ్లిష్, హిందీ వచ్చి ఉండాలి. అదనపు భాషలు వస్తే ఇంకా మంచింది..
⦿ రూపురేఖలు: చక్కటి ఆహార్యం, పచ్చబోట్లు ఉండొద్దు.
⦿ జాతీయత: చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, లేదా పాన్ లేదా ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది.
⦿ ఫిట్‌నెస్: ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. ఆరోగ్యవంతంగా ఉండాలి.
⦿ నైపుణ్యాలు: మంచి కమ్యూనికేషన్, కస్టమర్ సేవ, మంచి వ్యక్తిత్వం ఉండాలి.
ఎంపిక తర్వాత విమానయాన సంస్థలు ట్రైనింగ్ అందజేస్తాయి. వివాహం కాని అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.