పెళ్లి ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఇద్దరి జీవితాలనే కాదు రెండు కుటుంబాలను దగ్గర చేసేదే వివాహం. ఒక్కసారి పెళ్లయిందంటే జీవితమే మారిపోతుంది. పెళ్లి పెటాకులు కాకుండా వందేళ్ళ ప్రయాణంగా మారాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎంతో జాగ్రత్తగా మసులుకోవాలి. ఒకరి మనసు మరొకరు తెలుసుకోవాలి. ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవాలి. కష్టసుఖాల్లో తోడునీడగా సాగాలి. అయితే అలాంటి జీవనయానం అందరికీ దక్కదు. కొంతమంది పెళ్లి తర్వాత గొడవలు పడి విడిపోతూ ఉంటారు. వివాహం తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పెళ్లికి ముందే కొన్ని విషయాలను కాబోయే జీవిత భాగస్వామితో చర్చించాలి. ఆ విషయాల్లో లేదా అంశాల్లో మీ ఇద్దరి ఆలోచనలు కలిస్తేనే పెళ్లికి అంగీకరించాలి. మీకు అతని ఆలోచనలు నచ్చకపోతే ఆ వివాహాన్ని ముందే వద్దని చెప్పడం మంచిది. లేకుంటే ఇద్దరి జీవితాలు పెళ్లయ్యాక ఎంతో ప్రభావితం అవుతాయి. దాని వల్ల కుటుంబాలకు కూడా సమస్యలు వస్తాయి.
పెళ్లి ఇష్టమేనా?
కాబోయే భాగస్వామితో మొదట మీరు అడగాల్సింది మీకు పెళ్లి ఇష్టమేనా? అని. పెద్దల బలవంతంతో చేసుకుంటున్నారా లేక ఇష్టంతోనే వచ్చారా అన్న విషయాన్ని మీరు ముందుగానే తెలుసుకోండి. వారు మాట్లాడే తీరును బట్టి మీరు కొన్ని విషయాలను అర్థం చేసుకోవచ్చు. ఇష్టంతో వచ్చిన వ్యక్తి ఒకలా ప్రవర్తిస్తే… తల్లిదండ్రుల బలవంతంతో వచ్చిన వ్యక్తి మరోలా ప్రవర్తిస్తాడు. అలా పెద్ద వారి బలవంతంతో పెళ్లి చేసుకునే వ్యక్తికి దూరంగా ఉండడమే మంచిది.
ఉద్యోగమా? ఇల్లా?
పెళ్లి తర్వాత జీవిత భాగస్వామి కి ఎంత స్వేచ్ఛ ఇస్తారో కూడా ముందుగానే తెలుసుకోవాలి. ఇంటి పనుల విషయంలో లేదా ఉద్యోగం విషయంలో వారి ఆలోచనలను తెలుసుకోండి. కొంతమంది ఆడవారిని వంటింటికి మాత్రమే పరిమితం చేస్తారు. ఆడవారికి హద్దులు గీస్తారు. అమ్మాయిలు కూడా మగవారి విషయంలో కొన్ని ఆశలు పెట్టుకుంటారు. జీతం విషయంలో రాజీపడరు. ఇవన్నీ పెళ్లి తర్వాత గొడవలు పడే అంశాలుగా మారిపోతాయి. కాబట్టి పెళ్లికి ముందే మీరు ఉద్యోగాన్ని చేయాలనుకుంటున్నారా? లేదా? అనే విషయాన్ని స్వేచ్ఛగా చెప్పాలి. కాబోయే భర్త ఉద్యోగాన్ని ఇష్టపడకపోతే మీరు సర్దుకుపోవాల్సి వస్తుంది. లేదా మీరు ఉద్యోగం చేయడానికి ఒప్పుకునే మరొక వ్యక్తిని వెతుక్కోవాలి. అంతే తప్ప పెళ్లయ్యాక చూసుకుందామని వివాహానికి ఓకే చెబితే ఇరు కుటుంబాల మధ్య సమస్యలు మొదలైపోతాయి.
జీతం విషయంలో నిజాయతీ అవసరం
జీతం విషయం కూడా ఎక్కువమంది భార్యాభర్తల్లో గొడవలకు కారణం అవుతుంది. పెళ్ళికి ముందు అబ్బాయి జీతాన్ని ఎక్కువగా చెబుతారు వారి ఇంటి కుటుంబ సభ్యులు. దీనివల్ల కట్నం అధికంగా వస్తుందని ఆశపడతారు. పెళ్లయ్యాక అసలు జీతం తెలిస్తే అమ్మాయి తరపు బంధువులు కూడా గొడవకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో చాలా నిజాయితీగా ఉండాలి.
పిల్లలను కనడంపై క్లారిటీ ముఖ్యం
పిల్లల గురించి కూడా ఎదుటివారి అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమందికి పిల్లల్ని వెంటనే కనడం ఇష్టం ఉండదు. పెళ్లి అయిన కొన్నేళ్ల వరకు వద్దనుకుంటారు.ఈ విషయంలో కూడా ఒక ఒప్పందానికి లేదా ఏకాభిప్రాయానికి రావాల్సిన అవసరం ఉంది. అదే విషయంపై పెళ్లయ్యాక గొడవలు పడే బదులు ముందుగానే వారి అభిప్రాయాలను తెలుసుకుంటే మంచిది.
ఉమ్మడి కుటుంబమా? వేరే కాపురమా?
ఉమ్మడి కుటుంబాన్ని అందరూ ఇష్టపడకపోవచ్చు. కాబట్టి మీకు కాబోయే వ్యక్తి ఉమ్మడి కుటుంబంలో ఉండాలనుకుంటున్నారా? లేక వేరే కుటుంబం పెట్టాలనుకుంటున్నారా? అనే విషయాన్ని కూడా చర్చించుకోవాలి. మీకు ఉమ్మడి కుటుంబం నచ్చితేనే మరొక ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళండి. లేకుంటే ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి తప్పుకోవడం మంచిది. పెళ్లయ్యాక మీరు ఉమ్మడి కుటుంబంలో ఇరుక్కోలేక విసిగిపోయి జీవితాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలు ముందుగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.
అభిప్రాయాలు కలవాలి.. సర్దుకుపోవాలి
పెళ్లి ఒకసారి జరిగే తంతు. రెండు మూడు సార్లు చేసుకుంటే సమాజంలో గౌరవం కూడా ఉండదు. కాబట్టి కాబోయే జీవిత భాగస్వామిపై మీకున్న అభిప్రాయాలను, ఆలోచనలను, ఆశలను మీరు ముందుగానే వారితో చర్చించండి. అలాగే వారి గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు ఊహించినట్టు మీ జీవిత భాగస్వామి ఉంటేనే ముందడుగు వేయండి. కొన్ని విషయాల్లో ప్రతి ఒక్కరూ సర్దుకుపోవాల్సి రావచ్చు. మీరు కూడా మీ కలల రాకుమారుడు విషయంలో కొంతమేరకు అడ్జస్ట్ అయితే మంచిది. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా కుటుంబాల కోసం కాకుండా తమ కోసం పెళ్లి చేసుకోవడం ఉత్తమం. అమ్మ చెప్పిందని, నాన్న బాధపడతారని పెళ్లి సంబంధాలకు ఓకే చెబితే భవిష్యత్తులో మరొకరి జీవితం కూడా తీవ్రంగా ప్రభావితం అవుతుంది.

Share