Shobhita dhulipala: ఈరోజు రాత్రి 8:13 గంటల సమయంలో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) అన్నపూర్ణ స్టూడియోలో శోభిత (Shobhita )మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. ఈ నేపథ్యంలోనే శోభితకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఆ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న అవమానాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది శోభిత. శోభిత తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పుడు అటు హిందీ ఇటు తెలుగు సినిమాలు చేస్తూ మంచి పేరు దక్కించుకుంది.
తెలుగమ్మాయి కానీ బాలీవుడ్ ద్వారా పరిచయం..
ముఖ్యంగా సినిమాలో కథ ఉండి, పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేయడానికి సిద్ధపడుతున్న ఈమె పాత్ర ఎలాంటిదైనా సరే తనకు గుర్తింపు వస్తుంది అంటే బోల్డ్ గా నటించడానికి కూడా వెనకాడడం లేదు. ఆంధ్ర తెనాలికి చెందిన శోభిత ధూళిపాల తండ్రి నేవీ అధికారి. ఈమె పుట్టింది తెనాలిలో అయినా పెరిగింది మాత్రం వైజాగ్ లో. ముంబైలో ఉన్నత విద్య పూర్తి చేసింది.ఎకనామిస్ట్ అవాలనుంది కానీ అనూహ్యంగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది అటు నుంచి సినిమాల్లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే మోడలింగ్ చేసే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొందట శోభిత.
కుక్క కంటే హీనంగా చూశారు..
ఆ ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ.. “మోడలింగ్ చేసేటప్పుడు నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మోడలింగ్ సమయంలో ఒక యాడ్ కోసం ఆడిషన్ కి వెళ్తే.. నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు. వెనకాల నిల్చొనే బ్యాక్ మోడల్ గా కూడా పనికి రావని అవమానించారు. మరో ఆడిషన్ కి వెళ్తే కెమెరా రిపేర్ అయిందని, నెక్స్ట్ రోజు రమ్మన్నారు. మరుసటి రోజు వెళ్తే నా కాన్ఫిడెన్స్ చూసి వారు షాక్ అయ్యారు. కానీ ఈ బ్రాండ్ కి మీరు సెట్ కారని నా ముఖం మీదే చెప్పేశారు. ఇక ఆ తర్వాత నా స్థానంలో ఒక కుక్కని పెట్టారు. కానీ నాకు మాత్రం పారితోషకం ఇచ్చారు. అయితే నా స్థానంలో కుక్కను పెట్టుకోవడం నాకు ఎంతో అవమానంగా అనిపించింది” అంటూ తాను పడ్డ అవమానాలను ఎమోషనల్ అవుతూ తెలిపింది. గతంలో ఒక ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత ఇవన్నీ చెప్పుకొచ్చింది. అంతేకాదు బ్రాండ్ ఇమేజ్ కుక్కతో సమానమా? అంటూ సెటైర్లు కూడా పేల్చింది శోభిత. ఇక శోభితకు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
నాగచైతన్య తో ప్రేమ, పెళ్లి..
ఇక నాగచైతన్య, శోభిత విషయానికి వస్తే.. నాగచైతన్య సమంత (Samantha)కు విడాకులు ఇచ్చిన మరుసటి ఏడాది అనగా 2022లో ఈమెతో డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పటినుంచి రెండేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థంతో ఒకటి అయ్యారు. ఇక ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా వీరి వివాహం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ పెద్దలు హాజరు కాబోతున్నారట. ఏదేమైనా శోభిత పడ్డ అవమానాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.