
Breast Feeding: కొత్తగా తల్లి అయిన మహిళకు బిడ్డే లోకం. ఉమ్మడి కుటుంబాలు అంతరించటంతో చిన్నారికి స్నానం మొదలు పాలివ్వటం వరకు ప్రతి పనిలోనూ తొలిసారిగా తల్లయిన వారికి ఇబ్బందే. ముఖ్యంగా నవజాత శిశువులు ఏ అర్థరాత్రో మేలుకుని ఏడవటం మొదలుపెడితే.. ఇక తెల్లారేదాకా ఆ తల్లికి నిద్ర లేనట్టే. ఆ సమయంలో బిడ్డకు పాలివ్వటమూ కాస్త కష్టంతో కూడుకున్న పనే. ఈ సమస్యలకు చెక్ పెడుతూ.. వైద్య నిపుణులు సూచిస్తున్న కొత్త పరిష్కారమే.. డ్రీమ్ ఫీడింగ్. అదేంటో తెలుసుకుందాం.
డ్రీం ఫీడింగ్ అంటే.. నిద్రలోనే బిడ్డకు పాలివ్వడం. సాధారణంగా రాత్రి 10 లేదా 11 గంటల వేళ బిడ్డ నిద్రలోకి జారుకోవటానికి ముందు పాలివ్వాలి. దీనివల్ల కనీసం 6 గంటల పాటు బిడ్డకు ఆకలి కాదు. దీంతో చిన్నారి ప్రశాంతంగా నిద్రించటం వీలవుతుంది.
డ్రీమ్ ఫీడింగ్‌కి అలవాటు చేసేందుకు ముందుగా.. బిడ్డను రోజూ ఒకే టైంలో నిద్రపుచ్చటం మొదలుపెట్టాలి. ఓ వారం రోజులకి బిడ్డ ఆ సమయానికి నిద్రపోయేందుకు అలవాటవుతాడు. ఆ సమయంలో తల్లి.. మెల్లగా బిడ్డ పక్కన పడుకుని బిడ్డకు చనుబాలివ్వాలి. ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. అయితే.. ఈ టైంలో గదిలో లైటు వేయటం గానీ, డైపర్ మార్చే ప్రయత్నం గానీ చేయొద్దు.
అయితే ఈ టెక్నిక్ తొలి వారంలోనే సక్సెస్ అవుతుందనే గ్యారెంటీ ఏమీ లేదు. కొందరిలో రెండు వారాలు కూడా పడుతుంది. దీనివల్ల అటు బిడ్డ, తల్లి ఇద్దరూ కంటినిండా నిద్రపోవటం సాధ్యమవుతుంది.