సెప్టెంబర్ 10వతేదీన అమెరికాలోని డల్లాస్ నగరంలోని ఒక మోటల్లో భారత సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య అనే 50 ఏళ్ల వ్యక్తిని అతడి సహోద్యోగి దారుణంగా హత్య చేశాడు. చంద్రమౌళి భార్య, పిల్లవాడి ముందే అతడి తల నరికి హత్య చేశాడు. హంతకుడు 37 ఏళ్ల యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్ క్యూబాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన వెనక అక్రమ వలసల వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. క్యూబాకు చెందిన మార్టినెజ్ అనే వ్యక్తి అక్రమంగా అమెరికా వచ్చి నివశిస్తున్నాడు. అతడిని గతంలో కూడా పలుమార్లు అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పసి పిల్లలపై లైంగిక వేధింపులు, దొంగతనం వంటి నేరాల్లో అరెస్ట్ చేశారు. అప్పట్లోనే అతడిని క్యూబాకు తిరిగి పంపించాల్సింది. కానీ అప్పటి చట్టాలు అంత కఠినంగా లేకపోవడం వల్ల మార్టినెజ్ అమెరికాలో ఉండిపోయాడని, దాని ఫలితంగానే ఈ హత్య జరిగిందని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. గత అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా తప్పుబట్టారు ట్రంప్. అక్రమ వలసదారుల పట్ల కఠినంగా ఉండకపోవడం వల్లే ఈ తప్పులు జరిగాయన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవన్నారు.
అక్రమ వలసలపై ఉక్కుపాదం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని ప్రకటించారు. అక్రమ వలసలతో అమెరికా తీవ్రంగా నష్టపోతోందన్నారు. ఈ వలసల వల్ల కేవలం నేరాలు మాత్రమే పెరగడం లేదని, తమ వనరులు తరిగిపోతున్నాయని, స్థానికులు ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక వలసల విషయంలో ఆయన మరింత కఠినంగా ఉన్నారు. అక్రమంగా వలస వచ్చిన వారిని, సరైన పత్రాలు లేని వారిని బలవంతంగా విమానాలు ఎక్కించి వారి వారి సొంత దేశాలకు తరిమేశారు ట్రంప్. ఆ ఎపిసోడ్ ముగిసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ట్రంప్ ఏం చేసినట్టు?
ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ వలసదారుల ఏరివేత మొదలైంది. అది సరిగా జరిగి ఉంటే హంతకుడు మార్టినెజ్ కూడా క్యూబాకు వెళ్లాల్సింది. కానీ చట్టంలోని లొసుగుల వల్ల అతను అక్కడే ఉండిపోయాడు. భారత సంతతి వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. వాషింగ్ మిషన్ వాడకం వద్ద జరిగిన చిన్నపాటి వాదోపవాదాలే ఈ హత్యకు దారితీయడం గమనార్హం. ఇలాంటి నేరప్రవృత్తి కలిగిన వారిని, ఇతర దేశాలనుంచి అక్రమంగా వలస వచ్చి ఉంటున్నవారిని తాము ఏమాత్రం సహించబోమని అంటున్నారు ట్రంప్. అమెరికన్లు నిశ్చింతగా ఉండాలని భరోసా ఇచ్చారు ట్రంప్. అక్రమ వలస నేరస్థుల పట్ల ఇకపై సాఫ్ట్ గా ఆలోచించలేమని, ఆ సమయం తన పర్యవేక్షణలో ముగిసిందని స్పష్టం చేశారు. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్, అటార్నీ జనరల్ పామ్ బోండి, బోర్డర్ జార్ టామ్ హోమన్, ఇలా అనేక మంది అధికారులు అమెరికాను తిరిగి సురక్షితంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారు ట్రంప్.