BigTV English

Musk Vs Ellison: మస్క్ ని మించిన మొనగాడు.. ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అతడే

Musk Vs Ellison: మస్క్ ని మించిన మొనగాడు.. ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అతడే

ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్లు తారుమారయ్యాయి. ఇన్నాళ్లూ నెంబర్-1 స్థానంలో ఉన్న ఎలన్ మస్క్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆయన స్థానాన్ని ఒరాకిల్ సంస్థ చీఫ్ లారీ ఎల్లిసన్ భర్తీ చేశారు. బ్లూమ్ బర్గ్ అధికారికంగా ఈ ప్రకటన చేయడంతో ఇక ప్రపంచ నెంబర్-1 కుబేరుడు లారీ ఎల్లిసన్ అనే విషయం రూఢీ అయింది.


ఎందుకిలా?
ఎలాన్ మస్క్ కి చాలా వ్యాపారాలే ఉన్నాయి. టెస్లా కార్ల కంపెనీతో ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగాన్నే ఆయన శాసిస్తున్నారు. అదే సమయంలో ఎక్స్ పేరిట అతడికి ఉన్న వ్యాపార సామ్రాజ్యం చాలా పెద్దది. స్పేస్ ఎక్స్ ప్రయోగాల గురించి మనందరికీ తెలుసు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ని కొనుగోలు చేసి, దాన్ని ఎక్స్ గా మార్చి మరిన్ని సంచలనాలు నమోదు చేశారు మస్క్. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మస్క్ మరింత దూకుడుగా వ్యవహరించారు. ఆ తర్వాత వారిమధ్య విభేదాలు రావడంతో కథ అడ్డం తిరిగింది. చైనా ఎలక్ట్రిక్ వాహనాల దూకుడికి టెస్లా అడ్డుకట్ట వేయలేకపోవడంతో ఆ కంపెనీ షేర్లు పతనం అయ్యాయి. స్పేస్ ఎక్స్ ది కూడా అదే కథ. దీంతో మస్క్ సంపాదన తగ్గింది. అదే సమయంలో ఒరాకిల్ అధినేత లారీ ఎల్లిసన్ సంపద గణనీయంగా పెరగడంతో స్థాన చలనం తప్పనిసరిగా మారింది.

ఎల్లిసన్ సంపద ఎలా పెరిగింది?
ఒరాకిల్ కంపెనీలో ఎల్లిసన్ కి 40శాతం వాటా ఉంది. మంగళవారం ఒక్కరోజే అతని సంపద 101 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. ఎల్లిసన్ నికర సంపద విలువ 393 బిలియన్ డాలర్లకు చేరింది. ఇటీవల ఒరాకిల్ కంపెనీ షేర్లు బాగా పుంజుకోవడంతో ఈ తేడా స్పష్టమైంది. ఏఐ ఆధారిత క్లౌడ్ వ్యాపారంలో ఆ సంస్థ దూకుడుతోనే ఈ ఘనత సాధ్యమైంది. ఓపెన్‌ ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్‌ డ్యాన్స్‌తో ఇటీవల ఒరాకిల్ ఒప్పందాలకు సిద్ధమైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 18 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 144 బిలియన్ డాలర్లకు ఆదాయాన్ని సంస్థ అంచనా వేసింది. దీంతో సంస్థలోకి పెట్టుబడులు భారీగా పెరిగాయి. షేర్ల విలువ అమాంతం పెరిగింది. ఒరాకిల్ ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రాలో భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్‌తో ప్రత్యక్షంగా పోటీ ఉంది.


ప్రస్తుతం మస్క్ సంపద 38,500 కోట్ల డాలర్లు (రూ.33.88 లక్షల కోట్లు), లారీ ఎల్లిసన్ సంపద 39,570 కోట్ల డాలర్లు (రూ.34.82 లక్షల కోట్లు). ఇటీవల ఎలన్ మస్క్ కి టెస్లా కంపెనీ 1 ట్రిలియన్ డాలర్ల జీతం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఇండియన్ కరెన్సీలో దాని విలువ రూ. 83 లక్షల కోట్లు కాగా, ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ కంపెనీ CEO కూడా ఈ స్థాయిలో జీతం తీసుకోలేదు. ఆ ఆఫర్ నిజమైతే, వారు పెట్టిన కండిషన్లకు మస్క్ ఒప్పుకుని ఉంటే ఆయనే ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అయి ఉండేవారు. అయితే ఇప్పుడు ఎల్లిసన్ ఆయన్ను దాటి పోయారు. మళ్లీ మస్క్ కి మంచిరోజులు వస్తాయా, టెస్లా దూకుడు పెరుగుతుందా? వేచి చూడాలి.

Related News

Nepal: నేపాల్‌లో ఇంకా కర్ఫ్యూ.. ఖైదీలపై సైన్యం కాల్పులు, మాజీ ప్రధాని ఇంట్లో నగదు, బంగారం సీజ్?

Donald Trump: ఇజ్రాయెల్, ఖతార్ వార్..! బెడిసికొట్టిన ట్రంప్ డబుల్ గేమ్

Charlie Kirk: అమెరికాలో రాజకీయ హింస.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య, నిందితులెవరు?

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Big Stories

×