Donald Trump: ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ ఓ ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో ఓ బిల్డింగ్ దెబ్బతిన్నది. హమాస్ లీడర్ల అంతమే హమాస్ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా ఈ ఎటాక్ చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మా దేశంపై ఇంతకు తెగిస్తారా.. మీ అంతు చూస్తామని ఖతార్ బెదిరించింది. ఇక్కడే అసలు గేమ్ ఉంది. ఈ రెండు దేశాలకు అమెరికా మిత్ర దేశం. దాడి చేస్తున్నామని ట్రంప్ కు ఇజ్రాయెల్ చెప్పింది. కానీ ట్రంప్ మాత్రం దాడి జరిగాక ఖతార్ కు చెప్పారు. ఇదెక్కడి డబుల్ గేమ్? అంతర్జాతీయంగా క్రెడిబులిటీని ట్రంప్ ఎందుకు తగ్గించుకుంటున్నారు?
ఎదురుదాడి ఉంటుందన్న ఖతార్
పక్క దేశంపై ఎటాక్ చేశామని దర్జాగా నెతన్యాహు చెప్పుకుంటే సరిపోతుందా? సో ఖతార్ కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. దీన్ని పిరికిపంద చర్య అని ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఫైర్ అయ్యారు. ఎవరూ ఊహించని ఎదురుదాడి కచ్చితంగా ఉంటుందని ఖతార్ సిగ్నల్స్ పంపుతోంది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. దోహాపై ఎటాక్ కు సంబంధించి ట్రంప్ కు ఇజ్రాయెల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది.
ఎటాక్ తన నిర్ణయం కాదన్న ట్రంప్
దాడి గురించి రియాక్టైన ట్రంప్ అది తన నిర్ణయం కాదని, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీసుకున్న నిర్ణయం అని క్లారిటీ ఇచ్చారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ఈ విషయం పోస్ట్ చేశారు. అమెరికా సైన్యం నుంచి ఈ దాడి గురించి సమాచారం అందిన వెంటనే ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌ను ఖతార్ లకు సమాచారం ఇవ్వమని చెప్పానని, కానీ అప్పటికే ఆలస్యమైపోయిందన్నాడు ట్రంప్. ఒక్క ఫోన్ కాల్.. ఒక్క నిమిషంలో చెప్పే మాట ఆలస్యమైందని ట్రంప్ స్థాయి వ్యక్తి చెప్పడమే ఇక్కడ పెద్ద జోక్. అంతే కాదు ట్రంప్ మరో మాట అన్నాడు. ఖతార్ అమెరికాకు సన్నిహిత మిత్ర దేశమని, ఇలాంటి ఏకపక్ష దాడికి ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయపడదన్నారు. హమాస్‌ను ఎలిమినేట్ చేయడం మంచి లక్ష్యమేనని వాళ్లు గాజాలోని ప్రజల బాధలను ఆసరాగా చేసుకుంటున్నారన్నారు. బందీలను విడుదల చేయడం మన లక్ష్యమని, కానీ ఈ దాడి పద్ధతి సరికాదని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ ఆల్ థానీతో మాట్లాడిన ట్రంప్ ఇలాంటివి ఖతార్ భూమిపై మళ్లీ జరగవని హామీ ఇచ్చారు.
దాడులు మొదలయ్యాక సమాచారమిచ్చారన్న ఖతార్
సో ఇజ్రాయెల్ ఎటాక్ పై ఖతార్ కు సమాచారం ఇచ్చానని ట్రంప్ అంటుంటే.. ఖతార్ మాత్రం ఖండించింది. తమకు ఈ దాడి గురించి ముందే సమాచారం ఇచ్చారన్న వాదనలు నిరాధారమని, దాడి జరిగినప్పుడే అమెరికా నుంచి కాల్ వచ్చిందన్నారు ఖతార్ విదేశాంగ శాఖ సలహాదారు అల్ అన్సారీ. అంటే ఎటాక్ సమాచారం ఇచ్చామని ట్రంప్, దాడి జరిగాక చెప్పడమేంటని ఖతార్ కౌంటర్లు నడుస్తున్నాయ్. సమాచారం ఉండి కూడా ముందస్తుగా ట్రంప్ ఎందుకు చెప్పలేదన్నదే పెద్ద క్వశ్చన్. టైమ్ అయిపోయాక చెప్పడమే ట్రంప్ డబుల్ గేమ్ ను సూచిస్తుంది. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన పోస్ట్ చూస్తే.. ఆ దాడి వెనుక నిర్ణయం తాను తీసుకోలేదు అని చెప్పడానికి చాలా కష్టపడ్డాడు.
ఇటీవలే ట్రంప్ కు ఖతార్ ప్లైట్ గిప్ట్
ఖతార్ లో అమెరికాకు పెద్ద మిలటరీ బేస్ ఉంది. ఇది ఈ రెండు దేశాల ఒప్పందంలో భాగం. పైగా ఆ రెండు మంచి మిత్ర దేశాలు. ఇటీవలే ఖతార్ పాలకులు ట్రంప్ కు తమ స్నేహబంధానికి గుర్తుగా లగ్జరీ ఫ్లైట్ ను గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. ఇటీవలే ట్రంప్ ఖతార్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనకు 400 మిలియన్ డాలర్ల విలువైన ఫ్లయింగ్ ప్యాలెస్ అని పిలిచే విలాసవంతమైన బోయింగ్ 747-8 జెట్‌ను బహుమతిగా ఇచ్చారు. మరి అలాంటి ఖతార్ ను ఇబ్బంది పెట్టే దాడి విషయంలో ఇజ్రాయెల్ కు ట్రంప్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న ప్రశ్నలు పెరుగుతున్నాయి. ఉక్రెయిన్, గాజా సంఘర్షణలను వెంటనే సద్దుమణిగేలా చేయాలి. అర్జంటుగా నోబెల్ శాంతి బహుమతి పొందాలి. ఇదే లక్ష్యంగా ట్రంప్ వేస్తున్న అడుగులు ఒక్కొక్కటిగా రివర్స్ అవుతున్నట్లే కనిపిస్తున్నాయి. ఓ అరబ్ దేశంపై ఇజ్రాయెల్ చేసిన మొదటి దాడి ఇదే కాబట్టి పరిణామాలు ఎటువైపు మళ్లుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
మిత్ర దేశాలపై ట్రంప్ విచిత్ర వైఖరి
ఇటీవల మిత్రదేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు డిఫరెంట్ గా ఉంటోంది. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మిత్ర దేశమంటూనే, గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అంటూనే భారత్‌పై భారీ సుంకాల మోత మోగించారు. తగ్గించట్లేదు. తాజా దాడులతో ఖతార్‌కు కూడా ట్రంప్ నుంచి అలాంటి చేదు అనుభవం ఎదురైనట్లే అనిపిస్తోంది. నిజానికి అమెరికా – ఖతార్‌ల మధ్య బంధం ఇటీవలి కాలంలో చాలా బలపడింది. ఈ ఏడాది చేసిన పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. ఈ టైంలోనే అమెరికా మిత్రదేశం ఖతార్‌పై మరో మిత్ర దేశం ఇజ్రాయెల్ దాడి చేయడం చర్చనీయాంశమైంది.
ఖతార్‌కు ఇరాన్‌కు మంచి సంబంధాలు
నాటోయేతర ప్రధాన మిత్రదేశమైన ఖతార్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వేలాది మంది అమెరికన్ పౌరులను తరలించడంలో సహాయపడింది. ట్రంప్ కుమారుడు ఎరిక్ కూడా ఖతార్‌లో గోల్ఫ్ కోర్సు కోసం డీల్ కుదుర్చుకున్నాడు. మిడిల్ ఈస్ట్ లో ట్రంప్ దౌత్య ప్రయత్నాల్లో ఖతార్ కీలక పాత్ర పోషించింది. ఈ దేశం నెలల తరబడి హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అలాగే శాంతి చర్చలకు మధ్యవర్తిగా ఉంటోంది. ఖతార్ అమెరికాకు ముఖ్యమైంది. ఎందుకంటే దానికి ఇరాన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఖతార్ చెప్పినట్లు ఇరాన్ వినే అవకాశం కూడా ఉంటుంది. అమెరికన్ అధికారులు టెహ్రాన్‌తో సంబంధాన్ని పునరుద్ధరించేందుకు ఒక అవకాశంగా చూస్తారు. కానీ ఇప్పుడవి మరింత డౌట్ ఫుల్ గా మారాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో దూరిన ట్రంప్
ఈ సంఘటన అరబ్ దేశాలు – అమెరికా మధ్య అపనమ్మకాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ దాడిని ముక్తకంఠంతో ఖండించాయి. ఇరాన్, సౌదీ అరేబియా, యుఎఇ, టర్కీ అరుదైన విధంగా ఈ విషయంలో ఐక్యత ప్రదర్శించాయి. ఖతార్ కు ట్రంప్ వెన్నుపోటు పొడిచాడని చాలా మంది ట్వీట్లు చేశారు. సో ట్రంప్ ఒకటి అనుకుని ఇంకో ప్లాన్ ను అమలు చేస్తున్నారు. మొన్నామధ్య ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. మధ్యలో వెళ్లిన ట్రంప్.. ఇరాన్ లోని న్యూక్లియర్ బేస్ లను బీ2 బాంబర్ తో ధ్వంసం చేయించారు. ఇది కూడా తీవ్ర విమర్శలకు కారణమైంది. మధ్యలో ట్రంప్ ఆసక్తి ఏంటో అని చాలా మంది విమర్శించారు కూడా.
నోబెల్ శాంతి బహుమతి కొట్టేయడంపైనే ఫోకస్
ఎలాగైనా నోబెల్ శాంతి బహుమతి కొట్టేయాలి. ఇదీ ట్రంప్ టార్గెట్. అందుకే ఉక్రెయిన్ గాజాలో యుద్ధాలను త్వరగా ముగించాలని స్పీడ్ పెంచుతున్నారు. అయితే ఆ పని ముందుకు సాగట్లేదు. ఇంకా ఉద్రిక్తతలు పెరిగాయి కూడా. పుతిన్, జిన్‌పింగ్, నరేంద్ర మోడీ బహిరంగంగానే ట్రంప్ ను ధిక్కరిస్తున్నారు. ఇది ట్రంప్ కు వ్యక్తిగత అవమానం మాత్రమే కాదు. ఇరాన్ దాడుల నుండి ఇజ్రాయెల్ ను రక్షించడానికి తొందరపడిన తర్వాత కూడా సొంత భద్రతా ప్రాధాన్యాల కంటే నెతన్యాహు లక్ష్యాలే ఎక్కువయ్యాయా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య మధ్యవర్తిగా ఉన్నట్లు కనిపిస్తున్న ట్రంప్ విశ్వసనీయతకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చే పరిస్థితి. ఖతార్ శాంతి చర్చల నుంచి వైదొలిగే అవకాశం ఉండొచ్చు. పైగా ఖతార్ చెబుతున్నదేంటంటే.. ఇజ్రాయెల్ చాలా ఓవర్ చేస్తోందన్నారు. ఖతార్ పై చేసిన దాడిలో ఇజ్రాయెల్.. అమెరికా నిర్మిత F-35 ఫైటర్ జెట్స్ ను రంగంలోకి దింపినప్పుడు తమకు ఏమీ తెలియదని వాదించడానికి వీల్లేకుండా పోయింది. ఈ దాడులకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని లేదంటే సైలెంట్ వ్యూహంతో పని కానిచ్చేశారన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధాన్ని ముగించడానికి హమాస్ నిర్బంధించిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్న ఏకైక దౌత్య మార్గాన్ని నడిపించే వాటిలో ఎమిరేట్ ఒకటి. ఇది US ఇజ్రాయెల్ హమాస్‌తో ప్రత్యక్ష సంబంధాలను కొనసాగిస్తుంది. చాలా సార్లు ఇప్పటికే చర్చలను నిర్వహించింది. కానీ ఖతార్ ఒత్తిడి పెంచడం లేదన్న ఆలోచనతో ఇజ్రాయెల్ ఉంది. అందుకే ఇలా హమాస్ పేరుతో దోహాపై ఎటాక్ చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
Also Read: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్‌లో టెన్షన్?
ఇక ఇజ్రాయెల్ ఖతార్ పై చేసిన దాడితో ప్రపంచదేశాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ ఈ దాడిని ఖండించారు. యూరోపియన్ నాయకులు, ఆసియా దేశాలు కూడా దీన్ని తప్పుబట్టాయి. అరబ్ దేశాలు కూడా ఇలాంటి దాడులు ప్రాంతీయ భద్రతను దెబ్బతీస్తాయని హెచ్చరించాయి. దోహాపై ఇజ్రాయెల్ దాడి శాంతి భద్రతలను పెంపొందించే ప్రయత్నాలను డైరెక్ట్ గా దెబ్బతీస్తుందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ చెప్పారు. సో కథ చాలా దూరమే వెళ్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడితో ఖతార్ సైలెంట్ గా ఎలాంటి వయొలెంట్ సృష్టిస్తుందన్నది కీలకంగా మారింది. చెప్పలేం .. ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే ఒక దేశంలోకి చొచ్చుకొచ్చి ఎటాక్ చేయడం అంటే ఆ దేశ సార్వభౌమాధికారాన్ని క్వశ్చన్ చేయడమే.
Story By Vidya Sagar, Bigtv