Google Search Profiles: ఈ డిజిటల్ ప్రపంచంలో క్రియేటర్స్, పబ్లిషర్స్‌కు తమ కంటెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం పెద్ద సవాలుగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఒక అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే Search Profiles. ఈ కొత్త ఫీచర్ ద్వారా పబ్లిషర్స్, క్రియేటర్స్ గూగుల్ సెర్చ్, డిస్కవర్ ఫీడ్స్‌లో తాము ఎలా కనిపించాలో స్వయంగా నియంత్రించుకోవచ్చు. తమ లేటెస్ట్ కంటెంట్, సోషల్ మీడియా పోస్టులను ఒకే చోట ప్రదర్శించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతానికి ఈ సరికొత్త ఫీచర్ అమెరికాలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా వినియోగదారుల వయసు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో కనీస ఫాలోవర్ల సంఖ్యను కలిగి ఉండాలి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలలో కనీసం ఒక లక్ష మంది ఫాలోవర్లు ఉండాలి. ఒకవేళ టిక్‌టాక్ అయితే కనీసం మూడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నవారు మాత్రమే ఈ ఫీచర్‌ను వాడుకోవడానికి అర్హులు.
Also Read: గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన Honor Magic V6 ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్లు అమోఘం.. మీరూ ఓ లుక్కేయండి!
ఈ Search Profiles మొబైల్ వినియోగదారులకు గూగుల్ నాలెడ్జ్ ప్యానల్స్, డిస్కవర్ ఫీడ్ లేదా డైరెక్ట్ యూఆర్ఎల్ ద్వారా కనిపిస్తాయి. దీనివల్ల ఫాలోవర్లు తమకు నచ్చిన క్రియేటర్లను సులభంగా ఫాలో అవ్వచ్చు. గూగుల్ ఇప్పటికే ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసిన ప్రొఫైల్‌ను యూజర్లు క్లెయిమ్ చేసుకోవచ్చు లేదా తమ సోషల్ మీడియా ఖాతాలను లింక్ చేసి కొత్త ప్రొఫైల్‌ను తయారు చేసుకోవచ్చు. దీనిలో అవతార్, బయో, వెబ్‌సైట్ లింక్స్ వంటి వివరాలతో ప్రొఫైల్‌ను నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.
కొత్త సెర్చ్ ప్రొఫైల్‌ను సెటప్ చేసుకోవడం చాలా సులభం. దీనికోసం ముందుగా గూగుల్ నిర్దేశించిన అఫీషియల్ లింక్‌లోకి వెళ్లి, మీ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన ఫాలోవర్ల సంఖ్య ఉన్న సోషల్ మీడియా ఖాతాను లింక్ చేసి, క్రియేట్ ప్రొఫైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. గూగుల్ ఇప్పటికే ప్రొఫైల్ క్రియేట్ చేసిందో లేదో కూడా సెర్చ్ నాలెడ్జ్ ప్యానల్ పక్కన ఉండే View Search Profile ద్వారా సరిచూసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్లాన్ చేస్తోంది.
Also Read: మీ ఫోన్ కెమెరా నార్మల్ దైనా.. ప్రొఫెషనల్ లాంటి ఫొటోలు తీయొచ్చు.. ఈ 5 ట్రిక్స్ తెలిస్తే చాలు!