CM Revanth Reddy: బీఆర్ఎస్ పాలనలో నీటి ప్రాజెక్టుల ముసుగులో రూ. వేల కోట్ల కమిషన్లను కొల్లగొట్టారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు జిల్లా రెండో రోజు పర్యటనలో సీఎం మాట్లాడారు. తెలంగాణ వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని అంతా భావించారని రేవంత్ అన్నారు. కేసీఆర్ పాలనలో రూ.1.81 లక్షల కోట్లు సాగునీటికి ఖర్చు చేస్తే అందులో రూ. లక్ష కోట్లు ఒక్క కాళేశ్వరానికే కేటాయించారని పేర్కొన్నారు. అత్యంత కీలకమైన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలతో 90 టీఎంసీల నీళ్లు అందించొచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, ఇతర ప్రాజెక్టులు కట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తే… ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉండేదన్నారు. కానీ పదేళ్ల సుదీర్ఘ కాలంలో పాలమూరు ఎత్తిపోతలకే కేసీఆర్ రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. అందులో మెజారిటీ భాగం పంపులు, లిఫ్టుల కోసమే వేల కోట్లు ఖర్చు చేసి కమీషన్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా ఎక్కడిదక్కడే వదిలేసి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 10 సంవత్సరాల కాలంలో ఒక్క పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికే అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది: సీఎం రేవంత్
ఈ 27,000 కోట్ల రూపాయలలో అధిక భాగం కేవలం పంపులు, లిఫ్టుల కొనుగోలుకే కేటాయించారు
పంపులు, లిఫ్టులపై భారీగా ఖర్చు చేయడం ద్వారా వేల కోట్ల రూపాయల… pic.twitter.com/YCTGn7OLPE
— BIG TV Breaking News (@bigtvtelugu) June 5, 2026
సాధారణంగా ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా తొలుత చేయాల్సి భూసేకరణ అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ పాలమూరు జిల్లాలో ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అవసరమైన భూసేకరణ జరగలేదని ఆరోపించారు. భూసేకరణ పూర్తి చేయకుండానే ప్రాజెక్టులు పూర్తవుతాయని కెసీఆర్ ఎలా భావించారు? అని రేవంత్ ప్రశ్నించారు. ఆయన ఆలోచన ఎంతసేపూ.. పంపులు, లిఫ్టులు, వేలకోట్ల కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లించి కమీషన్లు కొట్టేసుడుపైనే ఉందని ఎద్దేవా చేశారు.
పాలమూరు జిల్లాలో పుట్టి పెరిగిన తాను.. పెండింగ్ ప్రాజెక్టులను ఎలాగైనా ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ తామే ఎలాగైనా కొలిక్కి తేస్తామంటూ బీఆర్ఎస్.. రాజకీయ కార్యాచరణతో ముందుకు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తిన్నది అరిగేలా నడిస్తే వాళ్ళు చేసిన పాపాలు కొన్నైనా పోతాయి. కాశీ వరకు నడవండి.. ఇంకా మంచిది. ప్రజలు ఛీదరించుకుంటారన్న సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. కొందరు మా గురించి మాట్లాడి జిల్లాకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు’ అని సీఎం మండిపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పదేళ్లలో కేసీఆర్ కట్టిన అప్పు రూ.84,503 కోట్లు అని రేవంత్ రెడ్డి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక 30 నెలల్లో కట్టిన అప్పు రూ.52,120 కోట్లు అన్నారు. 30 నెలల్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది రూ. 22 వేల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. ఇందులో ఇందులో రూ.8 వేల కోట్లు పాలమూరు ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని తెలియజేశారు. ఇప్పటికీ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా 4 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని సీఎం తెలిపారు. రాబోయే రెండేళ్లల్లో జిల్లాలో పనులు పూర్తి చేయాలని కంకణం కట్టుకుని పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: ‘జల హక్కులు కాపాడటంలో ప్రభుత్వం విఫలం’.. సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినా శాంతి కూడగట్టుకుని పని చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ పచ్చి అబద్ధాలు చెబుతోందని సీఎం అన్నారు. అంచనాల్లో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. ఉన్నదంతా దోచుకుపోయి మమ్మల్ని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు, భూసేకరణకు అందరూ సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్నట్లు భరోసా కల్పించారు.
Also Read: కేటీఆర్‌పై వ్యాఖ్యలా? ఒళ్ళు దగ్గర పెట్టుకో కడియం.. డాక్టర్ రాజయ్య హెచ్చరిక