How Many Times to Eat Every Day : ఆరోగ్యంగా ఉండటానికి పౌష్టికాహారంతో పాటు ఆహారం ఏ సమయంలో తీసుకుంటున్నామో కూడా ముఖ్యమే. మనలో ఎక్కువ మంది మూడుసార్లు భోజనం మాత్రమే చేయాలని నిబంధన పెట్టుకుంటారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మరియు రాత్రి సమయంలో మాత్రమే భోజనం చేస్తారు. అలా చేయడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని నమ్ముతారు. మరికొందరు తక్కువ మొత్తంలో రోజుకు నాలుగైదుసార్లు తినేందుకు మక్కువ చూపిస్తారు. అయితే తక్కువగా రోజుకు 5- 6 సార్లు తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా మానవ శరీరానికి 2 లేదా 3 గంటలకు ఒకసారి కొద్దిగా ఆహారం అవసరం అవుతుంది. అందుకే మధ్యమధ్యలో ఏదోకటి తింటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువగా తినడం కంటే కొంచెంకొంచెంగా తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా ఇది కొవ్వును కూడా వేగంగా కరిగించి, జీవక్రియ మెరుగుపడేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఉపవాసం చేయడం వల్ల కూడా జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఉపవాసం గ్లైసెమిక్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ తగ్గడంతో శరీరంలో తక్కువ కొవ్వు పేరుకుపోతుంది. రాత్రి మొదట్లో తినడం వల్ల ఉపవాసం సమయం పెరిగి శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటున్నారు. అయితే ఒంటిపూట భోజనం చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందంటున్నారు. శరీరానికి పోషకాహారం అందించడానికి ఆహారంలో గుడ్డు, పాలు, పెరుగు చేర్చుకోవాలి. తినే ఆహారంలో విటమిన్ సీ, ఈ, బీటా కెరోటిన్ ఉండేలా చూసుకోవాలి.