Warning to IT employees : గుట్టుచప్పుడు కాకుండా, మూడో కంటికి తెలీకుండా… మూన్ లైటింగ్ జాబ్ చేస్తూ డబుల్ శాలరీతో ఎంజాయ్ చేస్తున్న టెక్కీలకు… ఐటీ శాఖ వార్నింగ్ ఇచ్చింది. రెండో ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాచిపెట్టకుండా… నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలని హెచ్చరించింది. దాంతో… రెండు ఉద్యోగాలు చేసుకుంటున్న టెక్కీలంతా… ఎంత టాక్స్ కట్టాల్సివస్తుందోనని ఇప్పుడు లెక్కలతో కుస్తీ పడుతున్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా ప్రొఫెషనల్ ఉద్యోగులకు… ఏదైనా కంపెనీ ద్వారా వచ్చే ఆదాయం రూ.30 వేలు దాటితే… TDS వర్తిస్తుందని ఐటీ శాఖ అధికారులు చెబుతున్నారు. మూన్‌లైటింగ్ ఉద్యోగులు తమ ఆదాయ పన్ను రిటర్న్‌లలో… సెకండ్ జాబ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రకటించి, దానికి వర్తించే పన్ను కూడా చెల్లించాలని కోరారు. లేదంటే… జరిమానా సహా చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాదు… విచారణ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
ఏదైనా కంపెనీ లేదా వ్యక్తి… కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా సంపాదించే రూ.30 వేల లోపు ఆదాయానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుందని… పరిమితి దాటితే TDS చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194C ప్రకారం… కాంట్రాక్ట్ పని కోసం చేసే చెల్లింపుల నుంచి టీడీఎస్‌ను మినహాయించాలి. ఏదైనా సంస్థ, ట్రస్ట్, కంపెనీ, స్థానిక యంత్రాంగం లాంటివి దీని కిందికి వస్తాయి. చెల్లింపులు నగదు రూపంలో అయినా, చెక్ లేదా డ్రాఫ్ట్ రూపంలో ఉన్నా… ఎలా చెల్లించినా సరే TDS తప్పనిసరి. ఐటీ చట్టంలోని సెక్షన్ 194J ప్రకారం చెల్లింపులు రూ.30 వేలు దాటాక 10 శాతాన్ని TDS కింద మినహాయించాలి. అంతేకాదు, ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన చెల్లింపు లక్ష రూపాయలు దాటినా సరే… TDSను మినహాయించాల్సిందే.