iPhone 14 production to be increased in India : చైనాలో ఆంక్షల కారణంగా భారత్‌లో ఐఫోన్-14 తయారీని పెంచింది… ఆపిల్. ఫాక్స్‌కాన్‌తో పాటు పెగాట్రాన్‌కు కూడా కాంట్రాక్టును అప్పగించింది. ఫాక్స్‌కాన్ కంపెనీ తమ అనుబంధ సంస్థ ఆధ్వర్వంలో ఇప్పటికే చెన్నైలోని ప్లాంట్ లో ఐఫోన్-14ను అసెంబుల్ చేస్తోంది. ఇప్పుడు తైవాన్‌కు చెందిన పెగాట్రాన్‌కు కూడా… యాపిల్ తాజాగా తయారీ కాంట్రాక్టును అప్పగించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రం చైనాలో ఉంది. దీన్ని ఫాక్స్‌కాన్ నిర్వహిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం ప్లాంట్ చుట్టూ కఠిన ఆంక్షలు విధించింది. దాంతో… ఫాక్స్‌కాన్ ఉద్యోగులు కంపెనీ గోడలు దూకేసి ఇళ్లకు పారిపోతున్నారు. ఈ దృశ్యాలు, ఫోటోలు… ఇటీవల వైరల్ గా మారాయి. కార్మికుల కొరత కారణంగా ఐఫోన్ల సరఫరాలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ విక్రయాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్న ఆపిల్… ఫోన్ల తయారీని ఇతర దేశాలకు మళ్లిస్తోంది. అందులో భాగంగానే మన దేశంలోనూ తయారీని పెంచింది.
గతంలో చైనాలో లాక్‌డౌన్ల వల్ల ఐఫోన్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధమూ యాపిల్‌కు చేటు తెచ్చింది. అందుకే ఐఫోన్ల తయారీని విదేశాలకు మళ్లిస్తోంది… ఆపిల్. భారత్‌లో ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్.. యాపిల్ కాంట్రాక్ట్ తయారీ భాగస్వాములుగా ఉన్నాయి. ఇవన్నీ తమ సామర్థ్యాన్ని పెంచుకుంటూ… చైనాలో ఐఫోన్ తయారీ తగ్గినా ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. చైనాలో న్యూ ఇయర్ కు ఆపిల్ సేల్స్ భారీగా జరుగుతాయి. ఇలాంటి సమయంలో ఉత్పత్తి దెబ్బతింటే సేల్స్ పై ప్రభావం పడుతుందని… ఆపిల్ అప్రమత్తమైంది.