Pawan Kalyan : రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీజ్ చేయమన్న ఆదేశించిన స్టెల్లా నౌకపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. నౌకలో రేషన్ బియ్యాన్ని జిల్లా యంత్రాంగం గుర్తించినా.. అందులోని బియ్యాన్ని సీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా ఇంకా నౌకను సీజ్ చేయలేదు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా అందులో అక్రమ బియ్యం ఉన్నా.. ఎందుకు ఆలస్యం అవుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎగుమతుల్ని పర్యవేక్షించే ఎన్సీఈఎల్(NCEL) – నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కి లేఖ రాసింది. ఇందులో.. నౌక సీజ్ కు సంబంధించి స్పష్టతనిచ్చింది.
భారత్ నుంచి ఆఫ్రికా దేశాలకు బియ్యాన్ని సరఫరా చేసేందుకు పోర్టుకు వచ్చిన స్టెల్లా నౌకను వారాలుగా సముద్రంలో నిలిపివేయడం సరికాదని తేల్చిన కేంద్రం.. పరోక్షంగా పవన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. పవన్ సీజ్ ది షిప్ అంటుంటే.. కేంద్రం మాత్రం రిలీజ్ ది షిప్ అన్నట్లు వ్యాఖ్యానించింది. నౌకను అడ్డుకోవడంతో తలెత్తిన అనేక పరిణామాల్ని, సమస్యల్ని లేఖలో ప్రస్తావించిన కేంద్ర ప్రభుత్వం.. త్వరగా రేషన్ బియ్యం సంగతిని తేల్చి.. నౌకను పంపించేయాలని సూచించింది. ఇంతకీ.. ఏమైందంటే..
NCEL లేఖలో ఏముంది..
పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కేంద్ర కో ఆపరేటివ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేసే.. ఎన్సీఈఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇందులో.. ఆ నౌక మన దేశం నుంచి ఆఫ్రికా దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు వచ్చినట్లు తెలిపిన కేంద్రం.. ఎగుమతుల్ని అడ్డుకోవద్దని సూచించింది. తీవ్ర ఆకలితో అలమటించే ఆఫ్రికా దేశాలకు బియ్యాన్ని సరఫరా చేసేందుకు భారత్ ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు వేలాది టన్నుల బియ్యం ఇక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు నిత్యం సరఫరా ‘చేసేందుకు ప్రభుత్వం టూ ప్రభుత్వం (జీ టూ జీ) ఒప్పందం అమల్లో ఉంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ.. తనిఖీల పేరుతో ఎగుమతులకు ఆటకం కలిగించవద్దని సూచించింది. ఈ విధానంతో దేశార్థికానికి ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది.
నౌకలో ఫోర్టిఫైడ్ రైస్ ఎగుమతి చేస్తున్నారన్న కారణంతో దాదాపు వారం రోజులుకు పైగానే నౌక తీరంలో ఆగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన బియ్యం ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవచ్చని తెలిపిన ఎన్సీఈఎల్.. మిగతా నూక బియ్యం ఎగుమతులకు అడ్డుతగలవద్దని సూచించింది. ఎగుమతుల్లో ఆలస్యం కారణంగా.. విదేశీ వ్యవహారాల శాఖ నుంచి నిత్యం ఫోన్లు, మెయిల్స్ వస్తున్నాయని తెలిపిన ఎన్సీఈఎస్.. దేశాల మధ్య సంబంధాల దెబ్బతినకుండా వ్యవహరించాలని కోరింది.
Also Read : ఖర్చుల్లో జగన్ రారాజు.. ఏది పట్టుకున్నా కోట్లలో
వాస్తవానికి కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు నూక బియ్యం ఎగుమతి చేసేందుకు అనుమతులున్నాయి. ప్రభుత్వాలు సైతం నూక బియ్యానికి ఎలాంటి అభ్యంతరాలు తెలపడం లేదు. కానీ.. నూక బియ్యం పేరు చెప్పి రేషన్ బియ్యాన్ని విచ్చల విడిగా ఎగుమతి చేస్తుండడంతోనే అసలు సమస్య వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలోని బడా నేతలే.. ఈ దందా చేస్తుండడంతో ప్రభుత్వాల లక్ష్యాలు పక్కదారి పడుతున్నాయి. పేదలకు దక్కాల్సిన బియ్యం కాస్తా.. పక్కదారిలో దేశాలు దాటిపోతూ, నేతలకు కోట్ల లాభాలు కురిపిస్తున్నాయి.