
Aditya-L1 Mission : దేశ తొలి సౌర పరిశీలన ఉపగ్రహం ఆదిత్య-ఎల్1ను నిర్దేశిత భూ కక్ష్యలోకి పెట్టిన ఇస్రో ఈ ప్రయోగంలో మరో దశను విజయవంతం చేసింది. ఆదివారం తొలి భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని సక్సెస్ చేశామని ఇస్రో ప్రకటించింది. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ నుంచి ఈ ప్రక్రియను చేపట్టామని వెల్లడించింది.
ఆదిత్య-ఎల్1 ఇప్పుడు 245× 22,459 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి ప్రవేశించిందని ఇస్రో పేర్కొంది. మిషన్ సజావుగా సాగుతోందని తెలిపింది. రెండో భూకక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్ 5న వేకువజామున 3 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించింది.
ఆదిత్య-ఎల్1 ఉపగ్రహంతో పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక శనివారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 63 నిమిషాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 1480 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది.
16 రోజులపాటు భూ కక్ష్యల్లోనే ఆదిత్య-ఎల్1 తిరుగుతుంది. ఆ తర్వాత భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్1 బిందువు దిశగా సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఆదిత్య ఎల్-1లో 7 పరిశోధన పరికరాలు ఉన్నాయి. ఆ పరికరాలు సూర్యుడి పొరలు ఫొటో స్పియర్, క్రోమో స్పియర్ సహా వెలుపల ఉండే కరోనానూ శోధన చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేస్తాయి.