
Thummala : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమేనని తెలుస్తోంది. తాజాగా తుమ్మలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై గంటపాటు ఇరువురు నేతలు చర్చించుకున్నారు. తన వద్దకు వచ్చిన భట్టి విక్రమార్కకు తుమ్మల శాలువా కప్పి సన్మానించారు.
తుమ్మలతో భేటీ తర్వాత భట్టి విక్రమార్క ఆయనతో జరిపిన చర్చలపై స్పందించారు. తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు మచ్చలేని వ్యక్తి అని ప్రశంసించారు. ప్రస్తుత రాజకీయాల్లో తుమ్మల అవసరం ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. అందుకే ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు. అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత తన అభిప్రాయం చెబుతానని తుమ్మల చెప్పారని భట్టి విక్రమార్క వెల్లడించారు.
తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. సెప్టెంబర్ 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తుమ్మల భేటీ అవుతారని తెలుస్తోంది. రాహుల్ సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. ఈ క్రమంలోనే తుమ్మలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ అంశాలపైనే ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది.