ఎలక్ట్రిక్ టూ వీలర్లకు భారత మార్కెట్లో భారీగానే డిమాండ్ ఉంది. అయితే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు, గేర్ లెస్ బైక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా… గేర్లతో కూడిన ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది… అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘మ్యాటర్’. ‘ఎరా’ పేరుతో నాలుగు మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకీ ఆ ‘ఎరా’ మ్యాటర్ ఏంటో చూద్దాం…
ఎరా 4000, ఎరా 5000, ఎరా 5000+, ఎరా 6000+ పేర్లతో నాలుగు మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది… మ్యాటర్ కంపెనీ. ఈ నాలుగు బైక్‌లను కూడా నాలుగు గేర్లతో రూపొందించారు. పెట్రోల్ బైక్‌లను ఎలా నడుపుతున్నారో… అచ్చంగా అలాగే వీటిని కూడా నడుపుకోవచ్చు. వీటి ధరల శ్రేణి రూ.1,43,999 నుంచి రూ.1.53,999 మధ్య ఉంది. ఎరా 4000 మోడల్లో 4 కిలోవాట్ల బ్యాటరీ అమర్చారు. ఎరా 5000, ఎరా 5000+ మోడళ్లలో 5 కిలోవాట్ల బ్యాటరీ, ఎరా 6000+ మోడల్లో 6 కిలోవాట్ల బ్యాటరీ అమర్చారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎరా 4000 మోడల్ 100 కిలోమీటర్లు… ఎరా 5000, ఎరా 5000+ మోడళ్లు 125 కిలోమీటర్లు, ఎరా 6000+ మోడల్ 150 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీలు, మోటార్ వేడెక్కకుండా యాక్టివ్ లిక్విడ్ కూల్ సాంకేతికత వాడామని… దీని వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశమే ఉండదని మ్యాటర్ కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
పూర్తి దేశీయ సాంకేతికతతో ఎరాను అభివృద్ధి చేశామని… గేర్లు, స్పోర్టీ లుక్‌తో దీన్ని రూపొందించామని మ్యాటర్ కంపెనీ తెలిపింది. ఈ బైక్ కోసం 100కు పైగా పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన ఉత్పత్తులను వాడామని… త్వరలోనే ప్రీ బుకింగ్‌లు ప్రారంభిస్తామని ప్రకటించింది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రియర్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్, ఫ్రంట్ పెటల్ డిస్క్ బ్రేక్, రియర్ కన్వెన్షనల్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, రియర్ ఎల్ఈడీ ఇండికేటర్స్, స్ప్లిట్ సీట్స్, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చడంతో పాటు… 4G, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆఫ్‌లైన్ నావిగేషన్, యాక్సిడెంట్ డిటెక్షన్ ఫీచర్స్ ఇచ్చారు. ఈ బైక్‌ను ఎక్కడైనా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. నాలుగు మోడళ్ల మీదా 3 ఏళ్ల వారంటీ ఇవ్వడంతో పాటు… వార్షిక నిర్వహణ ఛార్జీలు చెల్లిస్తే మూడేళ్ల రోడ్ సైడ్ అసిస్ట్టెన్స్, 3 ఏళ్లు ఉచిత లేబర్ సర్వీస్ అందిస్తామని హామీ ఇస్తోంది.