
Climate change : కోవిడ్ అనేది ఎన్నో రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను పూర్తిగా మార్చేసింది. అంతే కాకుండా మనుషులు ఆలోచించే విధానం కూడా కోవిడ్ తర్వాత చాలావరకు మారిపోయింది. ఈ వైరస్ కేవలం శారీరికంగా, సామాజికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ప్రజలకు తీవ్రమైన ప్రభావం చూపించిందని శాస్త్రవేత్తలు ఇప్పటికే బయటపెట్టారు. అయితే ఎక్కువగా యూత్‌పై కోవిడ్ మానసికంగా ఎక్కువ ప్రభావం చూపించిందని వారి తాజా పరిశోధనల్లో తేలింది.
కోవిడ్ 19తో పాటు ఈరోజుల్లో మనుషులకు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న మరొక అంశం వాతావరణ మార్పులు. వాతావరణం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు సైతం కష్టంగా మారింది. ఇది మనుషుల జీవితాలపై, ఆరోగ్యాలపై ఎంతగానో ప్రభావం చూపిస్తోంది. అందుకే దీనిని కంట్రోల్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతున్నారు. అయినా కూడా ఈ రెండు అంశాలు ఇండియన్స్‌లో, ముఖ్యంగా భారతదేశంలోని యువతపై మానసికంగా ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.
పిల్లల్లో, టీనేజర్లలో వాతావరణ మార్పు అనేది తీవ్రమైన మానసిక ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు అన్నారు. మానసికంగా లోపాలు ఉన్న చిన్నపిల్లలను వాతావరణ మార్పులు మరింత మానసికంగా దెబ్బతీస్తాయని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల మానసిక ప్రభావం ఎలా ఉందో.. కోవిడ్ వల్ల కూడా అలాంటి ప్రభావమే కనిపించిందని తెలిపారు. సోషల్ బాండ్స్ అనేవి హఠాత్తుగా తెగిపోవడం, ఇష్టమైన వారిని కోల్పోవడం లాంటి వాటి వల్ల చాలామంది డిప్రెషన్‌లోకి వెళ్లడంతో పాటు ఇన్‌సోమ్నియా వంటి సమస్యలు కూడా ఎక్కువయ్యాయని తేలిందని అన్నారు.
కోవిడ్ అనేది ఒక్కసారిగా అందరి జీవితాలను మార్చేస్తే.. వాతావరణ మార్పులు అనేవి కొంచెం కొంచెంగా ఎఫెక్ట్స్ చూపిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కోవిడ్ నుండి ఇంకా పలు ప్రదేశాలు కోలుకోలేదు. ఇప్పుడు అలాంటి ప్రాంతాలపై వాతావరణ మార్పులు కూడా ఎఫెక్ట్ చూపిస్తే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ స్టడీ కోసం 16 నుండి 24 వయసులోపు హర్యానా, హైదరాబాద్ ప్రాంతాల్లో ఉండే 600 యువతను ఎంపిక చేశారు.
యువతపై చేసిన పరిశోధనల్లో వారి మానసిక స్థితి కోవిడ్‌కు ఎలా స్పందిస్తుందో వాతావరణ మార్పులకు కూడా అలాగే స్పందిస్తుందని తేల్చారు. ఇలాంటి సమస్యల నుండి ప్రజలను బయటపడేయడానికి ప్రభుత్వం సైతం ముందుకు రావాలని పరిశోధకులు పిలుపునిచ్చారు. మహమ్మారి వల్ల, వాతావరణ మార్పుల వల్ల యువత మానసిక స్థితిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంటుందని సూచించారు.