
Balineni : మాజీ మంత్రి , వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, జనసేన మధ్య ఛాలెంజ్ వార్ నడుస్తోంది. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలో బాలినేని పెట్టుబడులు పెట్టారని విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇటీవల ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే బాలినేని, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ అక్రమ లావాదేవీల్లో బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు భాస్కరరెడ్డి, వైసీపీ నేత, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుపై విచారణ జరిపించాలని విశాఖలోని ఆదాయ పన్నులశాఖ నిఘా అమలు విభాగం కమిషనర్‌కు మూర్తి యాదవ్ శుక్రవారం ఫిర్యాదు చేశారు. విశాఖ పోర్టు స్టేడియం వెనుక ఉన్న కార్యాలయంలోనూ ఐటీ దాడులు జరిగాయని తెలిపారు. చలనచిత్ర నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీలపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాడులు చేసిందని చెప్పారు.
సినీరంగంలో పెట్టుబడులు పెట్టారని జనసేన నేత చేసిన ఆరోపణలపై బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఆ ఆరోపణలను ఖండించారు. తనతోపాటు తన వియ్యంకుడు భాస్కర్‌రెడ్డికి ఏ నిర్మాణ సంస్థలో రూపాయి కూడా పెట్టుబడి లేదని స్పష్టం చేశారు. ఆ ఆరోపణలను రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని సవాల్ చేశారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని చాలెంజ్ విసిరారు.
దుష్ప్రచారాలు మానుకోవాలని జనసేన నేతలకు బాలినేని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. తనకు పెట్టుబడులు ఉన్నాయో లేదో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరా తీసుకోవచ్చన్నారు. మరి బాలినేని సవాల్ ను జనసేన నేతలు స్వీకరిస్తారా? పెట్టుబడులు ఉన్నాయని నిరూపిస్తారా?