మేడారం పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనులపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గద్దెల వద్ద ఉన్న చెట్లను తొలగించవద్దని.. నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడవద్దన్నారు. గ్రాండ్ లుక్ వచ్చేలా గద్దెల చుట్టూ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై మరోసారి ఫైరయ్యారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైసీపీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కేసులకు భయపడేలే లేదని అన్నారు. వచ్చేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని… లెక్కకు లెక్క..దెబ్బ దెబ్బ పక్కాగా ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. గోదలాం నుంచి వీరభద్రపురం రహదారిని ఆయన ప్రారంభించారు. అనంతరం కొల్లిపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో NTR భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేశారు హోం మంత్రి అనిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అనంతరం రామలింగేశ్వరనగర్‌లో రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేశారు. దిత్వా తుపాన్‌ను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, కలెక్టర్లను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు తీసుకున్నామని మంత్రి అనిత తెలిపారు.
వరంగల్‌లో 29 అజెండా అంశాలతో గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. పార్టీల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో కౌన్సిల్ హాల్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ భద్రతపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు వెళ్లిపోవాలంటూ ఆయన సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తేనే అధికారం తిరిగి చేపట్టవచ్చని అన్నారు. నిఖార్సయిన కార్యకర్తలనే కమిటీలలో తీసుకోవాలని, రెండు పార్టీల వైపు చూసే వారు వద్దని స్పష్టం చేశారు. కష్ట కాలంలో పనిచేసిన వారికే భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని, పదవులు అనుభవించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని వారిని నిర్ధాక్షిణ్యంగా తొలగించాలని ఆదేశించారు.
పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో A 8 నిందితుడు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి శ్రీనివాస్ కళ్యాణ్ అతనికి 14 రోజులు రిమాండ్ విధించగా.. గుంటూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెడ్డిగాండ్ల కులస్తుల బీసీ-బీ సర్టిఫికెట్లపై వివాదం చెలరేగింది. కాళేశ్వరంలో 13 మంది రెడ్డిగాండ్లకు బీసీ సర్టిఫికెట్లు అక్రమంగా జారీ అయ్యాయని ఆరోపిస్తూ బీసీ సంఘాలు నిరసన తెలిపాయి. బీసీలు కాకున్నా అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నేతలను నిరోధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయికన్ గూడెం టోల్ ప్లాజా వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. కొత్తగూడెంలో రేపు జరిగే ప్రజాపాలన సంబరాల కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆరు వాహనాలను పంచాయితీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కట్టుదిట్టంగా చెక్ చేసిన తర్వాత పంపారు.
ఐ బొమ్మ రవి కరేబియన్ పౌరసత్వం తీసుకోవడం వల్ల అక్కడ ఆస్తుల కొనుగోలు తెలుసుకోవడం కష్టమన్నారు హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్. ఐబొమ్మ రవికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు, కంప్యూటర్లకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తున్నామని చెప్పారు అడిషనల్ సీపీ శ్రీనివాస్.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ నుంచి RTC కళాభవన్ వరకు అవగాహన ర్యాలీ జరిగింది. సరైన వైద్యంతో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సాధారణ జీవితం గడపవచ్చని, వివక్ష చూపితే చట్టపరంగా చర్యలు ఉంటాయని కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మూలనకు కృషి చేస్తున్నాయని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలోని ఈదుల చెరువు స్థలంలో తలపెట్టిన సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని కాలనీ వాసులు నిరసన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జనావాసాల మధ్య ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల హాని కలుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాలు స్వయం పాలనకు నోచుకోవడం లేదు. ఆ గ్రామాల్లో ఒక్కరు కూడా ఎస్టీలు లేకపోవడంతో సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ మాత్రం ఎస్టీ వర్గానికి రిజర్వు అయ్యింది. గ్రామంలో ఎస్టీలు లేకపోవడంతో గత పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి సైతం ఇదే పరిస్థితి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ మార్చాలని అధికారులను కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా వెన్నెలవలసలో పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు గ్రామస్థులు నిరసన తెలిపారు. గ్రామానికి సమీపంలో ప్రతిపాదిత థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణం మరియు జీవనోపాధిపై ప్రభావం పడుతుందని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే రవికుమార్ స్పందిస్తూ ప్లాంట్ నిర్మాణంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయం, ఆమోదం లేకుండా ఏ పనీ ప్రారంభించబోమని, సమగ్రంగా ప్రజలతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు.
గూడూరును జిల్లా కేంద్రం చేయాలని.. లేకపోతే నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో గూడూరు జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జోరు వర్షంలోనూ గూడూరు టవర్ క్లాస్ సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు వివిధ సంఘాల ప్రతినిధులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. గూడూరును తిరిగి నెల్లూరు జిల్లాలో కలుపుతామని.. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారు.
కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 2019లో మసాలా బాండ్‌ల జారీలో పెమా చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చారు. అలాగే సీఎం వ్యక్తిగత కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు కూడా ఈ నోటీసులు అందాయి.
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష వేసిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో జరిగిన రైఫిల్స్ తిరుగుబాటు వెనుక హసీనా ఉన్నట్లు దర్యాప్తు చేస్తున్న కమిషన్ తాజాగా ఆరోపించింది. ఈ తిరుగుబాటులో 74 మంది మరణించారు. హసీనా ఆదేశాల మేరకే ఇది జరిగిందని, అప్పటి ఆవామీ లీగ్ నేతలు కూడా పాల్గొన్నారని కమిషన్ పేర్కొంది. ఈ అల్లర్లలో భారత్ పాత్రపై కూడా కమిషన్ ఆరోపణలు చేసింది.
తన సహజీవన భాగస్వామి శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలు ఉన్నాయని, ఆమెను చిన్నప్పుడు దత్తత తీసుకున్నారని అన్నారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్కాస్ట్‌లో తన వ్యక్తిగత జీవితం గురించి ఎలాన్ మస్క్ మాట్లాడారు. భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం తన కుమారుడి పేరులో ‘శేఖర్’ పదం చేర్చినట్లు మస్క్ వెల్లడించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో ఇండియా 17 పరుగులతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో వన్డేకు ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో బీసీసీఐ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ బాటియా ఈసమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత తరం పిల్లలకు పెళ్లి గురించి సలహా ఇవ్వబోనని అన్నారు నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్. తన మనవరాలు నవ్య నవేలి నందా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని కోరారు. నేటితరం పిల్లలు చాలా తెలివైన వారని, పరిస్థితులు మారాయని తెలిపారు. నవ్య ప్రస్తుతం ‘ఆరా హెల్త్’ పోర్టల్ ద్వారా మహిళలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.