హైదరాబాద్‌లోని ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ వేదికగా జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ నిపుణులు హాజరుకానున్న నేపథ్యంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఆయన కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.
ఇండిగో ఫ్లైట్ల రద్దుతో రైళ్లకు, బస్సులకు డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే. హైదరాబాద్ నుంచి ముంబై, కోల్‌కతా, చెన్నైకి మూడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. నిన్న రాత్రి బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. ఉదయానికి 25% బుకింగ్స్ పూర్తి అయినట్లు రైల్వే సీపీఆర్ఓ తెలిపారు. సాధారణంగానే రైళ్లకు డిమాండ్ ఉంటుందని, ఫ్లైట్ల రద్దుతో మరింత పెరిగిందని చెబుతున్నారు సీపీఆర్వో.
బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో బీసీలకు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్ మోహన్‌రెడ్డి కీలక సూచన చేశారు. ‘ఆత్మహత్యలపై రాజకీయాలు చేసే కల్వకుంట్ల గద్దలు మళ్లీ వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని పక్కనపెట్టి, బీజేపీని కాపాడటానికి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విషం కక్కుతున్నారు. బీజేపీ-బీఆర్‌ఎప్ డ్రామాలను సాగనివ్వమని’ ట్వీట్ చేశారు.
భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 20 నుండి 30 వరకు.. ప్రధానోత్సవములు, వైకుంఠ ఏకాదశి, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనాల కోసం ఆన్‌లైన్ టికెట్ల విడుదలకు దేవస్థానం నిర్ణయం తీసుకుంది. రోజువారీగా సాయంత్రం 5:00 గంటల వరకు కౌంటర్‌లో టికెట్లు భౌతికంగా కూడా లభ్యమవుతాయని ఆలయ ఈవో దామోదరావు తెలిపారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కులో జరిగిన దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితుడు మెచ్చా రఘు, కుంజా భరత్ నిన్న ఫారెస్ట్ కార్యాలయంలో లొంగిపోయారు. ఫారెస్ట్ అధికారులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది విచారణ జరిపి, సత్తుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు అనంతరం నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి ఈనెల 10వ తేదీ వరకు రిమాండ్ విధించారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. మైపాడు కృష్ణ మందిరం పూజారి చింతకింద రామ్మూర్తి ఇంట్లో చోరీ జరిగింది. వృద్ధులు ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, సుమారు 5 సవర్ల బంగారాన్ని అపహరించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలో బాపులపాడు మండలం వీరవల్లి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. జంగారెడ్డిగూడెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మారుతి ఎర్టిగా కారులో బయలుదేరారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై కారును నిలిపి బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
అంబర్‌పేట చౌరస్తాలో డా.బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు సహా పలువురు నాయకులు పాల్గొని, అంబేద్కర్ చూపిన సమానత్వం, సామాజిక హక్కుల మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
పల్నాడు జిల్లా వినుకొండలోని APSRTC లాజిస్టిక్స్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 3 లక్షల రూపాయల విలువైన పురుగు మందులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బిల్లులు లేని ప్రముఖ కంపెనీల మందులను సీజ్ చేసినట్లు ఏడీఏ రవికుమార్ తెలిపారు. ఒరిజినలా.. నకిలీవా అని తెలుసుకోవడానికి శాంపిల్స్‌ను టెస్టులకు పంపినట్లు వివరించారు.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్యను కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, భార్య గీతతో కలిసి కలిశారు. నర్సయ్య జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ‘గుమ్మడి నర్సయ్య’ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని శివరాజ్ కుమార్ తెలిపారు. ఆయనను చూస్తే తన తండ్రి గుర్తుకొచ్చారని అన్నారు. దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం శివారులోని మైసమ్మ చెరువులో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న భూక్యా సాయి కిరణ్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. కేసముద్రంలోని పాలిటెక్నిక్ నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన 8 మంది విద్యార్థుల్లో ముగ్గురు స్నానం చేసేందుకు చెరువులోకి దిగగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన విద్యార్థి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీస్ సిబ్బంది చెరువులో గాలిస్తున్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ‘మోంథా, దిత్వా’ తుఫాన్ల విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముందస్తు చర్యలు, పరిహారం లేక పోవడం ప్రభుత్వ వైఫల్యమని, నష్టపోయిన రైతుల వంక కన్నెత్తి చూడలేదని ఆరోపించారు. ప్రస్తుతం యూరియా దొరకడం లేదనీ, దళారీలు, టీడీపీ నేతల ఇళ్లకు యూరియా చేరుతోందని ఆరోపించారు. ఇరిగేషన్ అవినీతిపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.
పొట్టేపాలెం బ్రిడ్జి కల సాకారమైందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. రూ.5 కోట్ల వ్యయంతో జనవరి 5వ తేదీన శంకుస్థాపన చేసి, 8 నెలల్లో పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ములుముడి కలుజు బ్రిడ్జికి కూడా నిధులు తీసుకువచ్చి, ఆ పనుల కోసం ప్రయత్నిస్తామని అన్నారు. అభివృద్ధి జాతర నెల్లూరులో భారీగా జరుగుతోంది, అని పేర్కొన్నారు. రూరల్ అభివృద్ధితో ప్రజల రుణం తీర్చుకుంటానని కోటంరెడ్డి తెలిపారు.
కృష్ణా జిల్లా పామర్రులో RMP క్లినిక్‌లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక దాడులు చేశారు. నిబంధనలు విరుద్ధంగా ఉన్న ఆరు క్లినిక్‌లు సీజ్ చేశారు అధికారులు. ఈ మేరకు నిర్వాహకులకు నోటీసులు అందించారు డీఎంహెచ్‌వో యుగంధర్. ఆర్ఎంపీ నిబంధనలపై ఆరో తేదీన మచిలీపట్నంలో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తిరుపతి జిల్లా గూడూరులో దిత్వా తుపాను వరదల్లో చిక్కుకున్న వ్యక్తిని రూరల్ పోలీసులు చాకచక్యంగా కాపాడారు. అనంతరం ఆ వ్యక్తిని సురక్షితంగా ఇంటికి చేర్చారు పోలీసులు. దీంతో పోలీసులపై స్థానికులు, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఏలూరు జిల్లా గుండుగొలనుకులో ఓ యాచకురాలు నిజాయితీ చాటుకుంది. రోజువారీ పనులకు వెళుతున్న యాచకురాలు తిరుమలశెట్టి కరుణకు ఆటోలో 36 వేల రూపాయలు దొరికాయి. దీంతో ఆ నగదును వెంటనే భీమడోలు పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. అనంతరం కరుణ ఆమె చేతుల మీదుగానే ఆ డబ్బులను వ్యాపారి జువ్వల సత్యనారాయణకు అందజేశారు పోలీసులు.
రొమేనియాలో అతి వేగంగా కారు నడిపిన బెంజ్ డ్రైవర్, నియంత్రణ కోల్పోయింది. రోడ్డుపై ఉన్న రెండు కార్ల మీద నుండి ఎగిరింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, దీనిని “మెర్సిడెస్ ఎయిర్‌లైన్స్” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
అగ్ర కథానాయకుడు ప్రభాస్ ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాలు కలిపి, బాహుబలి: ది ఎపిక్ పేరుతో డిసెంబర్ 12న జపాన్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులతో ప్రచారంలో పాల్గొంటుండగా, రాజమౌళి భావోద్వేగ లేఖ రాశారు. జపాన్‌లో అభిమానులకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు అర్థమై ఉంటుంది. వెళ్లిన ప్రతిసారీ వారు ప్రభాస్ ఎప్పుడు వస్తారు?’ అని అడిగేవారు. వారి కోరిక నేడు ఫలించింది,” అని రాజమౌళి పేర్కొన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందుకు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించకపోవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. అయితే, కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ అనూహ్యంగా ఈ విందుకు హాజరుకావడం పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసింది. పవన్ ఖేడా, జైరాం రమేశ్ వంటి సీనియర్లు ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ విమర్శలపై శశి థరూర్ స్పందిస్తూ, తాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చిందని తెలిపారు.
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 4,358 పరుగులు చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే.. యాషెస్ రెండో టెస్ట్‌లో ఆసీస్ బ్యాటర్ లబూషేన్.. స్మిత్ రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ మొదటి స్థానంలో ఉన్నాడు.