గ్రేటర్ హైదరాబాద్‌లో సర్కిల్స్ పెరగబోతున్నాయి. ఇప్పటివరకు ఉన్న 30 సర్కిల్స్ సంఖ్యను 60 వరకు పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే వార్డుల సంఖ్య డబుల్ అయింది. సర్కిల్స్ సంఖ్య కూడా డబల్ అయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు… మంత్రి పొన్నం ప్రభాకర్. ఇందులో భాగంగా ఏడాదిన్నర కిందటే ఈవీ వాహనాల పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామంటున్న మంత్రి పొన్నం
ఇండిగో విమానయాన సంస్థ కేంద్రాన్నిబ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు సీపీఐ నేత నారాయణ. ఇండిగోను జాతీయం చేసుకోవడానికి… కేంద్రానికి ఇంతకు మించిన మంచి సమయం దొరకదన్నారు. ఈ విషయం మోడీ సర్కార్ దృష్టి పెడితే బాగుంటుంది అన్నారు నారాయణ.
తెలంగాణలో ఫార్మా, రియాల్టీ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న MSN గ్రూప్… గ్లోబల్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఫార్మా రంగంలో విస్తరణలో భాగంగా తమ గ్రూప్ సంస్థ క్రామన్స్ రీసెర్చ్ పార్క్ తరపున 1500 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టడానికి ముందుకు వచ్చింది.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో కవిత డబ్బులకు మంత్రి పదవులు అమ్ముకుందని ఆరోపించారు. ఎవరెవరికి మంత్రి పదవులు అమ్ముకుందో తనకు తెలుసని ఆయన పేర్కొన్నారు.
హనుమకొండలో గంజాయి ముఠా పరారీ కేసు దర్యాప్తు స్పీడప్ అయ్యింది. దర్యాప్తు చేస్తున్న అధికారులకు హనుమకొండ పోలీసుల తీరుపై ఎన్నో అనుమానాలు కల్గుతున్నాయి. నిందితుల వద్ద కేవలం లక్షా 40వేల రుపాయలు దొరికాయని పోలీసులు చెబుతున్నారు. మరి పట్టుబడిన హాయి ఆయిల్ కూడా 23లక్షల 75వేల రూపాయలని పోలీసులే చెబుతుండ టం పలు అనుమానాలకు తావిస్తోంది.
మంచిర్యాల జిల్లా భీమారం మండలం నర్సింగాపూర్ బస్టాప్ సమీపంలో పెద్ద పులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బస్టాప్ వెనుక ఉన్న పొదల్లో పులి కలియతిరిగినట్లు వారు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది పులి పాదముద్రలను సేకరించారు. పులికి ఎలాంటి హాని చేయవద్దని అధికారులు గ్రామస్తులను కోరారు.
ఏపీ సచివాలయంలో రెవెన్యూ శాఖతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ సహా 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల అంశాలపై చర్చించారు.
నాచారం పారిశ్రామిక వాడలోని షాహి ఎక్స్‌పోర్ట్స్ గార్మెంట్ సంస్థలో జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ మహిళా కార్మికులు చేస్తున్న ధర్నా రెండో రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, హమాలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. యాజమాన్యం స్పందించకపోవడం, కార్మికులపై అసభ్యంగా ప్రవర్తించడం సరికాదన్నారు. మహిళలకు న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని BSNL కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున మంటలు చెలరేగి ఎలక్ట్రానిక్ పరికరాలు అన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో బుట్టాయిగూడెం మండలంలో BSNL సేవలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా మూడు లక్షల రూపాయిలు నష్టం వాటిల్లినట్లు అధికారులు వివరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు. సేవల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని, రెండు రోజులలో తిరిగి సేవలను కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గురుకుల పాఠశాల సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాఠశాలకు చెందిన ఇంటర్ విద్యార్థి అజయ్ (17) నిజాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన మంజీరా నదిలో గల్లంతై మృతి చెందిన సంఘటనపై విచారణ జరిగింది. నిర్లక్ష్యం వహించిన ఇంచార్జీ ప్రిన్సిపాల్ గణపతికి షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు నలుగురు ఉపాధ్యాయులు, వాచ్‌మన్‌ను సస్పెండ్ చేశారు.
ఉపాధ్యాయులు సస్పెండ్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ ఇంచార్జి తలారి రంగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నవంబర్ 20న ఆనంద్ అనే యువకుడి మృతి కేసులో, అది హత్య అని రంగయ్య ప్రెస్‌మీట్‌లో ఆరోపించడంపై పోలీసులు వివరణ కోరారు. ఆత్మహత్య అని పోలీసులు చెబుతున్నా, హత్య అనడానికి గల ఆధారాలను రెండు రోజుల్లో సమర్పించాలని రెండోసారి నోటీసులు జారీ చేశారు.
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో గ్యాప్-2 నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మంగళవారం గ్యాప్-2 ఎగువ ప్రాంతంలో రాళ్లు పరిచే పనులకు జలవనరుల శాఖ అధికారులు, ఎంఈఐఎల్ ప్రతినిధులు పూజలు చేసి శ్రీకారం చుట్టారు. దిగువ ప్రాంతంలో ఇప్పటికే ఈ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, గడువులోగా ప్రాజెక్టును పూర్తిచేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా నెన్నెల గ్రామ సర్పంచ్ అభ్యర్థి దుగ్యాల బాపు 15 హామీలతో కూడిన బాండ్ పేపర్‌తో వినూత్న ప్రచారం చేపట్టారు. గెలిస్తే ఆడపిల్లల పెళ్లికి 25 కేజీల బియ్యం, ఆపరేషన్‌కు రూ.10 వేలు, మరణిస్తే దహన సంస్కారాలకు రూ.5 వేలు, విద్యార్థులకు ఉచిత కిట్లు అందిస్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ బాపూజీ నగర్‌లో పవిత్రను దారుణంగా చంపిన ఉమాశంకర్‌ను చంపేయాలంటున్నారు మృతురాలి బంధువులు. పవిత్ర తల్లి లక్ష్మీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉమాశంకర్ ఇంటికొచ్చేటప్పుడు కత్తి తీసుకొనే వచ్చాడని.. ఇలా చేస్తాడని ఊహించలేదని లక్ష్మీ కన్నీంటి పర్యంతం అయ్యింది .
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనపై చైనా సానుకూలంగా స్పందించింది. పటిష్ఠమైన త్రైపాక్షిక సహకారానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. స్థానిక, ప్రపంచ శాంతి స్థిరత్వానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది. భారత్‌లో పుతిన్ మొదటి ఉన్నతస్థాయి పర్యటన, ప్రధాని మోదీతో చర్చల అంశంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియకున్ ఈ మేరకు స్పందించారు.
ఆక్రమిత తూర్పు జెరూసలేంలోని పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటుచేసిన యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేశాయి. ఈ క్రమంలో అక్కడి వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. కార్యాలయంపై ఉన్న ఐరాస జెండాను తీసేసి ఇజ్రాయెల్ జెండాను ఉంచాయి.
‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. లోక్‌సభలో సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించగా.. మంగళవారం రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కాలంతో సంబంధం లేకుండా ‘వందేమాతరం’ (Vande Mataram) దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందన్నారు. ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉందని.. భవిష్యత్తులోనూ ఉంటుందన్నారు.
ఐపీఎల్ 2026 ఆక్షన్‌కు ముందు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి రూ.2 కోట్ల ట్రేడ్ ద్వారా శార్దూల్ ఠాకూర్‌ను ముంబయి ఇండియన్స్ తీసుకుంది. ఈ నేపథ్యంలో, రోహిత్ శర్మ గురించి శార్దూల్ స్పందించాడు. నేను రోహిత్ శర్మతో చాలా కంఫర్ట్‌గా ఉంటాను. నా కెరీర్ ప్రారంభంలో అతను నాకు ఎంతో మద్దతుగా నిలిచాడు. నన్ను నేను ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి అతను అవకాశం ఇచ్చాడు. ముంబయి ఇండియన్స్ క్యాంపు నాకు ఎదగడానికి సాయపడింది అని శార్దూల్ వివరించాడు.
ప్రముఖ నటుడు రాజశేఖర్ గత నెలలో ఓ కొత్త సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. కాలికి తీవ్ర గాయం కారణంగా చీలమండకు పగుళ్లు ఏర్పడటంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సకు సిఫారసు చేశారని, ఇటీవలే మూడు గంటలపాటు శస్త్రచికిత్స జరిగిందని, నాలుగు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు చిత్రవర్గాలు తెలిపాయి.