గ్రామపంచాయతీల్లో సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. తొలి విడత ప్రచార ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో తొలి విడత పోలింగ్ రేపు జరగనుంది. ఇక రేపటి పోలింగ్ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. పోలింగ్ నిర్వహించే పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇచ్చారు. మండలాన్ని జోన్లు, రూట్లుగా విభజించారు. పోలింగ్ సామగ్రిని మండల కేంద్రంలోని ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. బందోబస్తు కోసం పోలీసులను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్, రికవరీ సెంటర్‌ను ఏర్పాటు చేశా రు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో భారీ డ్రోన్ షో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాలు వివరించే థీమ్‌లతో డ్రోన్ షో ఏర్పాటు చేశారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించేలా 3 వేల డ్రోన్‌లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్ వరల్డ్ రికార్డు సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి ధ్రువపత్రాన్ని అందజేశారు. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్ల ప్రదర్శనకు గిన్నిస్‌బుక్ రికార్డు వరించింది.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, ఏప్రిల్ 7న బయాలజీ, ఏప్రిల్ 13న సోషల్ స్టీడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పీరీక్ష, ఏప్రిల్ 16న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష జరగనుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును రీ-ఇన్వెస్టిగేషన్ చేయాలని ఆయన కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. మరింత లోతైన దర్యాప్తు కోరుతూ సునీత వేసిన పిటిషన్‌పై గత వారం వాదనలు పూర్తయ్యాయి. తన తండ్రి కేసులో సరిగా దర్యాప్తు జరగకపోతే అసలైన వ్యక్తులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత పేర్కొన్నారు. అంతేకాకుండా సప్లమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె తరపు న్యాయవాది కోర్టును కోరారు. లోతైన దర్యాప్తుతో సంచలన విషయాలు బయటకు వస్తాయని సునీత అభిప్రాయపడ్డారు. దీనిపై నేడు సీబీఐ కోర్టు తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో, కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
ఉస్మానియా యూనివర్శిటీకి వెయ్యి కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఓయూ సభలో ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించబోతున్నారు. ఈ నిధులతో అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీని అభివృద్ధి చేయనున్నారు. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఇవాళ ఓయూకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ఓయూ పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు.. ఓయూకు భారీగా నిధులు కేటాయించారు.
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులతో మూడు ప్రాంతాల అభివృద్ధికి సత్వరం ప్రతిపాదనలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ నిధులు సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యానపంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, దాని బారిన పడినవారికి అందుతోన్న వైద్య సాయంపై చర్చించారు సీఎం చంద్రబాబు. స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని సీఎంకు అధికారులు వివరించారు. అయితే ఈ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్థారణ కాలేదని చెప్పారు.
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై తీర్పును ఈ నెల 11వ తేదీన వెల్లడించనున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా, రవి కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కూడా ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది.
జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డుల వివరాలతో ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు GHMC కమిషనర్. వార్డుల డీ లిమిటేషన్‌పై ఇవాళ్టి నుండి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. జిహెచ్ఎంసిలో శివారు మున్సిపాలిటీల విలీనంతో ఏర్పడిన వార్డులకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. జనాభా ప్రాతిపదికన వార్డులను విభజించింది అధికారి యంత్రాంగం.
నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రవీందర్ నగర్ BC హాస్టల్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొత్తల మర్రిగూడెం గ్రామానికి చెందిన శృతిగా గుర్తించారు. ఇంట్లో పెళ్ళిచూపులు జరుగుతున్న నేపథ్యంలో, ఉన్నత చదువులు కొనసాగించాలని కోరుకున్న శృతికి పెద్దల నిర్ణయంతో మనస్థాపానికి గురయిందని స్థానికుల ఆరోపించారు. సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్సై సైదులు.. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు డిప్యూటీ ఎమ్మార్వో రవీందర్ నాయక్. కొంగరకలాన్ సివిల్ సప్లై శాఖలో డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న రవీందర్ నాయక్.. షాద్ నగర్‌లో బాధితుడి నుండి 50 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో పక్కా ప్రణాలికతో 20 వేలు లంచం తీసుకుంటుండగా అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
అనకాపల్లి జిల్లాలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. రాంబిల్లి బీసీటి పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న మధ్యాహ్నం నుండి విద్యార్థులు కనిపించకుండా పోయినట్లు తెలుస్తుంది. కనిపించకుండా పోయిన ఆరుగురు విద్యార్థుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. బీసీటీ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు.
తిరుమల పరకామణి కేసులో సీఐడీ సమర్పించిన అదనపు నివేదికను పరిశీలించి హైకోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేయనుంది. పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ ద్వారా కుదిరిన రాజీ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ నిన్న హైకోర్టుకు అదనపు నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది.
విమాన సర్వీసుల రద్దు సంక్షోభంపై ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌తో మరోసారి సమావేశమయ్యారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. రద్దయిన విమానాలకు 100 శాతం రీఫండ్‌లు పూర్తి చేశామని ధృవీకరించారు ఇండిగో సీఈఓ. కార్యకలాపాలను గాడిలో పెట్టి, విమానాల రద్దు తగ్గించేందుకు ఇండిగో తన మొత్తం సర్వీసులను తక్షణమే 10 శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల నియంత్రణతో సహా జారీ చేసిన ఆదేశాలకు ఎటువంటి మినహాయింపు లేకుండా ఇండిగో కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. 1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీ సిట్ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ, డెహ్రాడూన్‌తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్ గుర్తించింది.
గోవా నైట్ క్లబ్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. క్లబ్ ఓనర్ అజయ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు గోవా పోలీసులు. ఇదివరకే అజయ్ గుప్తా పేరు మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో 25 మంది మృతి చెందారు. మరో ఇద్దరు ఓనర్లు లూథ్రా బ్రదర్స్ థాయ్‌లాండ్‌కు పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేరళ అటవీ అధికారులు కీలక సూచన చేశారు. సన్నిధానానికి సమీపంలో ఉన్న ఉరళ్‌కుళి జలపాతాన్ని సందర్శించొద్దని సూచించారు. వన్యప్రాణుల నుంచి ముప్పు పొంచి ఉండటం, తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో అప్రమత్తమైన అటవీ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
కరీంనగర్ డంప్ యార్డ్ అగ్ని ప్రమాదంలో జరిగింది. నిన్న రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పుతున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత్ 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన టీమ్ ఇండియా పేసర్ బుమ్రా.. ఇంటర్నేషనల్ టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్‌కు ముందు 99 వికెట్లతో ఉన్న అతను బ్రెవిస్‌ను ఔట్ చేసి వంద వికెట్ల మైలురాయి అందుకున్నాడు. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలో 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
అఖండ 2 సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది. 11న ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 తొలుత డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది. తాజాగా సమస్యల పరిష్కారం అనంతరం చిత్ర బృందం న్యూ రిలీజ్ డేట్ ప్రకటించింది.