ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నాయకుడు శరద్ పవార్ నివాసంలో ఏర్పాటు చేసిన…ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి.ఇదే సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు ముఖ్యమంత్రి.
GHMCలో కొత్తగా ఏర్పడిన వార్డులపై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది. బౌండరీల మార్పుపై అభ్యంతరాలు లేవనెత్తారు MIM నేతలు. మొదటి ప్రాతిపదికన సరిహద్దులు.. రెండో ప్రాతిపదికన జనాభాను బేస్ చేసుకొని వార్డుల డిలీమిటేషన్ చేస్తున్నారు. దీంతో GHMC కమిషనర్ కర్ణన్‌ను కలిసి MIM నేతలు తమ అభ్యంతరాలు చెప్పారు.
మంత్రి నారా లోకేష్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం గతంలో చేసిన అప్పులను తీర్చి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించిందని తెలిపారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో అవినీతి జరిగిందని, అందుకే టీడీపీ నేతలు మాట్లాడటం లేదన్నారు.
హైదరాబాద్‌లో భువన తేజ రియల్ ఎస్టేట్స్ ఇన్ఫ్రా కంపెనీలో ఈడీ సోదాలు నిర్వహించింది.ప్రీ లాంచ్ పేరుతో ఈ కంపెనీ 70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ సీసీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అధికారులు కంపెనీ ఎండీ సుబ్రహ్మణ్యం, మార్కెటింగ్ డైరెక్టర్ బీబీ గుప్తా సహా నాలుగు చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు.
హయత్ నగర్ కల్వంచలోని చంద్రాయణగుట్ట మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట పేరెంట్స్ ఆందోళన చేపట్టారు. గత కొంతకాలంగా కల్వంచలో ఉన్న హాస్టల్‌ను అధికారులు బార్కస్ సమీపంలోకి మార్చాలని ప్రయత్నించడాన్ని వారు అడ్డుకున్నారు. హాస్టల్‌ను మారిస్తే పిల్లల చదువులకు ఇబ్బందులు తలెత్తుతాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పరిధిలో జునైద్ హత్య కేసును దక్షిణ మండల పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో 12 మంది పాత్ర ఉందని డీసీపీ కె.కిరణ్ ప్రభాకర్ తెలిపారు. వీరిలో ఆరుగురిని అరెస్టు చేయగా, మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. ముఖ్య నిందితులకు, మృతుడికి మధ్య పాత కక్షలు ఉన్నాయని పథకం ప్రకారమే కత్తులతో దాడి చేసి హతమార్చారని డీసీపీ వివరించారు.
కోదాడలో మత్స్యశాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చెరువులో చేప పిల్లలు వేయకుండానే, ఖాళీ వాహనం తీసుకొచ్చి వేసినట్లు విచిత్రమైన డ్రామాలు ఆడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చెరువు ఛైర్మన్‌కు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండానే చేపలు పోసినట్లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వివాదం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 100 మంది కార్యకర్తలతో బీజేపీ నేతను కలవడంపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నిరసిస్తూ, పెద్ద ఎత్తున గ్రామస్థులు ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
సిరిసిల్ల జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో జరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఇన్సూరెన్స్ బాండ్‌లను పంపిణీ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులకు, గీతన్నలకు, నేతన్నలకు భీమా ఇచ్చి కార్మిక పక్షపాతిగా నిలిచారని అన్నారు.
యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోదరుడు సతీష్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్‌లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రికార్డింగ్ డ్యాన్స్‌లపై నిషేధం ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఇవి జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలే ఇలా చేస్తూ సభ్య సమజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.
సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 40 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని.. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇది రాయలసీమకు గొప్ప అవకాశమని, పెండింగ్ ప్రాజెక్టులు, హార్టికల్చర్, రహదారుల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు.
కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్ర రవీందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తనపై జరిగిన దుష్ప్రచారంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిలమ్మ, విజయమ్మలపై పోస్టులు పెట్టిన వారికి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారని… తనపై పెట్టిన కేసులో స్థానిక పోలీసులు ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.
అమెరికా తీసుకువచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ భారత హెచ్-1బీ దరఖాస్తుదారుల్లో గందరగోళం సృష్టిస్తోంది. ఈ విధానం వల్ల భారీ సంఖ్యలో వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
ఇండిగో విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయాలతో ఇటీవల లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తమ ముందు హాజరుకావాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి పరిణామాలకు సంబంధించిన పూర్తి డేటాతో నేడు డీజీసీఏ కార్యాలయానికి రావాలని ఓ ప్రకటనలో తెలిపింది.
అభివృద్ధి చెందిన దేశాలు, పొరుగుదేశాలతో పోలిస్తే భారత్‌లోనే రైలు టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. వీటి ధరలు తక్కువగా ఉంచేందుకు గతేడాది 60వేల కోట్ల రూపాయల సబ్సిడీ అందించామన్నారు.
మొరాకోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పురాతనమైన ఫెజ్ సిటీలో రెండు భవనాలు కుప్ప కూలిపోయాయి. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు నాలుగు అంతస్తుల భవనాలు కూలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. ఘటనా సమయంలో ఓ బిల్డింగ్‌లో బర్త్ డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం. ఆ భవనంలో ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయని అధికారులు తెలిపారు.
యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డ్ కార్డు వీసాను ప్రారంభించారు. విదేశీయులు వన్ మిలియన్ డాలర్లు చెల్లించి దీన్ని పొందితే.. యూఎస్‌లో ఉండటానికి శాశ్వత హోదా పొందొచ్చని తెలిపారు. అదే కంపెనీలు విదేశీ ఉద్యోగులను ఉంచుకోవడానికి రెండు మిలియన్ డాలర్లు చెల్లించాలన్నారు. ఇది కొంత వరకు గ్రీన్ కార్డు లాంటిదేనని.. కానీ దాని కంటే ఎక్కువ ప్రయోజనాలున్నాయని ట్రంప్ చెప్పారు. అప్లై చేసే సమయంలో 15 వేల డాలర్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రధాని మోడీకి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై ప్రధాని మోడీ ఆరా తీశారు. గాజాలో శాంతి స్థాపనకు తమ సహకారం ఉంటుందని మోడీ తెలిపారు.
రజనీకాంత్ నటించిన నరసింహ చిత్రాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న ఫోర్‌కేలో రీరిలీజ్ చేయనున్నారు. నీలాంబరి టైటిల్‌తో చిత్రం రెండో భాగాన్ని రూపొందించడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కథ, పాత్రలు చక్కగా కుదిరితే కచ్చితంగా చిత్రం రూపొందుతుందని వెల్లడించారు.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. అలాగే మొదటి స్థానానికి అతి చేరువగా వచ్చాడు. ప్రస్తుతం ఆ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. అంతకు ముందు నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌ను వెనక్కి నెట్టి రెండు స్థానాలు ఎగబాకాడు.