హైదరాబాద్ దుండిగల్‌లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్ అట్టహాసంగా జరిగింది. త్రివిధ దళాల అధిపతి జనరల్ అనిల్ చౌహన్ రివ్యూ అధికారిగా హాజరయ్యారు. వాయుసేనలో వివిధ బ్రాంచ్‌లలో ప్రీ-కమిషనింగ్ శిక్షణను క్యాడెట్లు పూర్తి చేసుకున్నారు.
ట్రాన్స్‌జెండర్లు ప్రజలను ఇబ్బంది పెడుతూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతల సమస్యలకు కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారం పొడితో దాడి చేశారు. తన గెలుపు ఖాయమైనందునే ఈ దాడి జరిగిందని కొమురయ్య ఆరోపిస్తున్నారు. గ్రామస్థుల సహాయంతో ఆసుపత్రికి వెళ్లిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిర్మల్ జిల్లా కడెం మండలం గండి గోపాల్ పూర్ గ్రామంలో మంత్రాల నెపంతో దేశినేని భీమయ్యను హత్య చేసి.. కాల్చి బూడిద చేశారు. అదే గ్రామానికి చెందిన మూతి నరేష్, మూతి మల్లేష్ అనే ఇద్దరు వ్యక్తులు భీమయ్యను కట్టెతో కొట్టి చంపినట్లు విచారణలో తేలింది. ఖానాపూర్ సీఐ అజయ్, కడెం ఎస్సై సాయి కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంజీవరెడ్డికి గుండెపోటు వచ్చింది. రేపు జంగరాయిలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో అన్నతమ్ముళ్ల మధ్య జరిగిన గొడవ దారుణ హత్యకు దారితీసింది. ఓటు వేయడం కోసం జగిత్యాల నుంచి గ్రామానికి వచ్చిన గంగయ్య.. ఆవేశంతో ఆశయ్య అనే వ్యక్తిపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆశయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మాజీ ఎంపీపీ పస్కా నర్సయ్య కారుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున నర్సయ్య ఎంపీపీగా పనిచేశారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన కారుకు నిప్పు పెట్టడం చర్చాంశనీయంగా మారింది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి ఆత్మహత్యకు పాల్పడింది. కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో చందన జ్యోతికి మూడు నెలల క్రితమే వివాహమైంది. కొద్ది రోజుల నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండడంతో మనస్తాపానికి గురైంది చందన జ్యోతి. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల పేర్లు చెప్పి ప్రభుత్వ హాస్టల్లోనే అధికారులను నాయకులు అరుణ్ కుమార్, ఉపేంద్రలు వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. వారి వేధింపులు భరించలేక హాస్టల్ వెల్ఫేర్ అధికారులు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
విజయనగరం జిల్లా రాజాం మండలం విజయరాంపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా లింగాల పైడమ్మ అనే వృద్ధురాలి పూరిగుడిసెలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా.. గ్రామస్తులు ఆమెను రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. వృద్ధురాలు మృతి చెందింది
శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీలు కదం తొక్కారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలంటూ జిల్లా కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలంటూ డిమాండ్ చేశారు.
కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం అశేష భక్తజనంతో శోభించింది. ఉదయం మేలుకొలుపు, ఐశ్వర్య హోమం, నిత్య కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గొండ్యాల పుట్టుగ సమీపంలో ఆర్ఎస్ఎస్ భవనం వద్ద ప్లాస్టిక్ కవర్‌లో ఉన్న అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. ఒక కుక్క ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లడాన్ని గమనించిన స్థానికులు.. కవర్‌ను తెరిచి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కోనసీమ జిల్లా పిఠాపురంలో కత్తితో దాడులు మరోసారి కలకలం సృష్టించాయి. శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం వద్ద వాహనం పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. పెద్దాపురం భక్తులు.. మరో వాహన డ్రైవర్‌ల మధ్య ఘర్షణలో.. బచ్చుల శ్రీనివాస్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఘటనలో కాళ్ల లక్ష్మీనారాయణ గాయపడ్డారు.
ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు అత్యంత వైభోవోపేతంగా జరుగుతున్నాయి. మూడవ రోజు ఇంద్రకీలాద్రి పై భవానీల రద్దీ కొనసాగుతుంది. ఇవాళ శనివారం కావడంతో లక్షమందికి పైగా భవానీలు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత తీవ్రమవుతుంది. తాజాగా అగ్రరాజ్యంలోని 20 రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దావా వేశాయి. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని వాదించాయి.
పార్లమెంటు వెలుపల సిగరెట్ తాగడాన్ని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ సమర్థించుకున్నారు. దిల్లీలో కాలుష్యంపై దృష్టి పెట్టకుండా.. తన సిగరెట్ విషయంపై మోదీ ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. మరోవైపు.. లోక్‌సభలో ఈ-సిగరెట్ తాగారంటూ టీఎంసీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పీకర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల విచారణ.. లిస్టింగ్‌ల వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో ఏదో తప్పిదం జరుగుతోందని అభిప్రాయపడింది. ఆ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అందించిన నివేదికను పరిశీలించిన అనంతరం సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 లేటేస్ట్ పాయింట్స్ టేబుల్‌లో టీమిండియా ఆరో స్థానానికి పడిపోయింది. నిన్న వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించడంతో భారత జట్టు ఐదు నుంచి ఆరో స్థానానికి పడిపోయింది.
బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు మహేష్ బాబుతో వారణాసి చిత్రంతో తెలుగు తెరపై సందడి చేయనుంది. ఆమె పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను నడుపుతున్నట్లు అందరికీ తెలుసు. నటిగా, నిర్మాతగా రెండు టోపీలు ధరించడం కొంచెం భిన్నంగా, కష్టంగానూ ఉందని ప్రియాంక చోప్రా అన్నారు.