E-Paper
Advertisement

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

Top 20 News Today: దారుణం, వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

1. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి-పొన్నం ప్రభాకర్

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి చేరాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి అనేక పథకాలు అమలవుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి.. మూడో దశ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని కోరారు.

2. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్..

సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన కార్యాలయం నుంచి రామస్వామి గట్టు వరకు వాకింగ్ చేశారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్, మాజీ ఛైర్మన్ గెల్లి అర్చన రవి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తుందని.. ఇది BRS పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అని పేర్కొన్నారు.

3. దారుణం.. హజార్డు వేస్ట్ వేసి నది కలుషితం..

శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, మట్టపల్లి వద్ద కృష్ణానది గుర్తు తెలియని హజార్డు వేస్ట్ కలపడం వలన కలుషితమైంది. దీంతో మఠంపల్లి నుంచి చింత్రియాల వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేశారు. నది పరిసరాలు దుర్వాసనతో భక్తులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే అధికారులు దృష్టి సారించి కెమికల్‌ను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

4. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఒకరు మృతి

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువకుడు సాయి ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సైనిక్ పురిలో బ్యాటరీ షాప్ నడుపుతున్న సాయి ప్రసాద్ ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

5. మహబూబ్ నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం

మహబూబ్ నగర్ జిల్లాలో అధికార పార్టీకి షాక్ తగిలింది. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యే వర్గానికి షాక్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పావని కృష్ణయ్య శెట్టి 110 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

6. యశస్వినికి రెబల్స్‌ షాక్‌

ఝాన్సీ రెడ్డి సొంతూరులో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిల మద్దతుదారుడు.. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కిరణ్‌పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మహేందర్ 80 ఓట్ల తేడాతో గెలుపొందారు. రెబల్ అభ్యర్థి విజయం తరువాత గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

7. వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేయించిన భార్య

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో భర్త రత్నయ్యను భార్య కవిత, ప్రియుడు దాసరి రామకృష్ణ కలిసి ట్రాక్టర్‌తో గుద్ది హత్య చేయించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి.. ఒకే రోజులో కేసును ఛేదించారు. నేరం అంగీకరించిన కవిత, రామకృష్ణలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

8. రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ అగ్ని ప్రమాదం..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని షాబాద్ మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు తలుపులు బద్దలు కొట్టి మంటలు ఆర్పడంతో చిన్న వస్తువులు మాత్రమే కాలిపోయాయి. ఫైళ్లకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, కారోబార్ తెలిపారు.

9. పగతో బైకులను తగులబెట్టిన వ్యక్తి

తిరుపతిలోని చంద్రగిరి మండలం తొండవాడలో.. ప్రొవిజన్ దుకాణం నడుపుతున్న సంధ్య ఇంటి వద్ద ఉన్న రెండు బైకులకు గౌతమ్ కుమార్ నిప్పుపెట్టాడు. తనతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతన్ని సంధ్య, ఆమె భర్త పోలీసులకు అప్పగించడంతో కక్షకట్టిన గౌతమ్ ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ దాడితో సంధ్య కుటుంబం ప్రాణభయంతో పరుగులు తీసింది.

10. మట్టిని తరలిస్తున్న నాలుగు లారీలను అడ్డుకున్న గ్రామస్తులు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడంలో ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్న నాలుగు లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. గతంలో చెరువులను త్రవ్వి డంప్ చేసిన మట్టిని తిరిగి తరలించడంతో ఈ చర్యకు పాల్పడ్డారు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఆ నాలుగు లారీలను మైలవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

11. బస్సు, లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం..

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని గండ్లపల్లి సమీపంలో బెంగుళూరు-తిరుపతి జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసమైనా, ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు క్రేన్ సాయంతో వాహనాలను తొలగించి దర్యాప్తు చేస్తున్నారు.

12. అయ్యయ్యో.. 72.68 లక్షలు కొట్టేసిన కేటుగాడు

కడప జిల్లా బద్వేల్‌కు చెందిన ఓ సీనియర్ న్యాయవాది సైబర్ నేరగాళ్ల వలలో పడి, ఫోన్ ద్వారా తన అకౌంట్ నుండి 72.68 లక్షలు రూపాయలు కోల్పోయాడు. బాధితుడు బద్వేల్ అర్బన్ పోలీసులను ఆశ్రయించగా.. వారు విచారణ చేపట్టారు. చిన్న పట్టణాలను సైతం సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకోవడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.

13. పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అంటూ ఓ యువకుడు వీడియో పోస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని దేవిరెడ్డిపల్లిలో పాకిస్థాన్‌కు అనుకూలంగా ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర దుమారం రేపింది. దీంతో ధనుంజయపై కొంతమంది యువకులు నల్లచెరువు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టిన ధనంజయపై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పాకిస్థాన్‌కు అనుకూలంగా..

14. అమ్మవారి సన్నిధిలో హోం మంత్రి అనిత

ఏలూరు జాతర సందర్భంగా హోం మంత్రి అనిత అమ్మవారిని దర్శించుకున్నారు. ఏలూరు ఎమ్మెల్యే చంటి దంపతులు, ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మేయర్ నూర్జహాన్ పెదబాబు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కూడా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

15. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి

కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారనే అక్కసుతో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు హాకీ స్టిక్‌లతో దాడి చేశారు. కంభంపాటి శ్రీధర్, రామ్మోహనరావులకు తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వంశీ పిన్నమనేని ఆసుపత్రిలో పరామర్శించారు.

16. ప్రుడెన్షియల్‌ రద్దు

హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసా దరఖాస్తుదారులపై అమెరికా ప్రభుత్వం వెట్టింగ్‌ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, ముందుజాగ్రత్త చర్యగా పెద్ద సంఖ్యలో ఈ వీసాలను ప్రుడెన్షియల్‌ రద్దు చేసింది. అయితే, ఈ రద్దు తాత్కాలికమేనని, శాశ్వత తిరస్కరణ కాదని ఇమిగ్రేషన్‌ అటార్నీ తెలిపారు. ఇది నివాస హక్కును ప్రభావితం చేయకపోయినా, తదుపరి అపాయింట్‌మెంట్‌లో దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

17. విమానాలకు అంతరాయం

తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటన ఆలస్యమైంది. దట్టమైన పొగమంచు దృశ్యగోచరతను తగ్గించడంతో పలు విమానాలు రద్దు కాగా, మరికొన్ని ఆలస్యమయ్యాయి. విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలను జారీ చేశాయి.

18. సీఎం రేఖా గుప్తా కీలక నిర్ణయం

ఆసియాలోనే అతిపెద్దదైన ఢిల్లీలోని తీహార్ జైలును ఢిల్లీ శివార్లకు తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ తరలింపు వార్త చర్చనీయాంశంగా మారింది.

19. సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్‌ గిల్ పేలవ ప్రదర్శన

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లోనూ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్‌ గిల్ పేలవ ప్రదర్శన కొనసాగింది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న వీరిపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, అభిషేక్ శర్మ వారికి మద్దతుగా నిలిచాడు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో సూర్య, గిల్ ఇద్దరూ భారత్‌కు మ్యాచ్‌లు గెలిపిస్తారనే ధీమాను అభిషేక్ వ్యక్తం చేశాడు.

20. రుక్మిణీ వసంత్ బాలీవుడ్‌ ఎంట్రీ

కాంతార 2తో సినీప్రియులను ఆకట్టుకున్న రుక్మిణీ వసంత్ ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. హిందీ సినిమాలపై ఆసక్తి ఉందని, ఈ భాషలో భావోద్వేగాలను వ్యక్తపరిచే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది. దీని గురించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే హిందీ చిత్రం ప్రారంభిస్తానని ఆమె చెప్పడంతో, అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×