ఢిల్లీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీని షిప్పింగ్ రంగంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ఢిల్లీ పర్యటనలో కీలక అడుగులు వేశారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు.
తెలంగాణ డీజీపీ ముందు 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 24 ఆయుధాలను వీరు సరెండర్ చేశారు. లొంగిపోయిన వారిలో ఇద్దరు తెలంగాణ, 39 మంది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారున్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టులు లొంగిపోయినట్టు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే తెలంగాణకు కొత్త దిశను చూపి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సూచించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేక గబ్బిలాల్లా వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో జరిగిన మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రి హరిదీప్‌సింగ్ పురితో ఢిల్లీలో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసే BPCL గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానించారు సీఎం చంద్రబాబు.
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పలువురు ప్రముఖుల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. వీరిలో క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప.. నటులు సోనూసూద్, నేహాశర్మ, ఊర్వశి రౌతేలా.. టీఎంసీ మాజీ ఎంపీ మిమీ చక్రవర్తి, బెంగాల్ నటుడు అంకుశ్ హజ్రా ఉన్నారు. మొత్తం 7కోట్ల 93లక్షల విలువైన ఆస్తులు అటాచ్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును.. మరో వారం రోజుల కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతించింది. ఇందులో భాగంగా విచారించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి స్పెషల్ సిట్‌ను ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిళ్లుండలో గుర్తుతెలియని వ్యక్తులు వరి పంటకు నిప్పు పెట్టారు. ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 20 ఎకరాల్లో చేతికందిన వరి పంట అగ్నికి ఆహుతైంది. ముఖ్యంగా కొల్లి కృష్ణారావు అనే రైతుకు చెందిన 10 ధాన్యపు బస్తాలు పూర్తిగా బూడిదయ్యాయి. పొలాల్లోకి ఫైర్ ఇంజన్ వెళ్లే దారి లేక రైతులు బిందెలు, బకెట్లతో మంటలను ఆర్పేందుకు శ్రమించారు.
ఎన్టీఆర్ జిల్లా దుందిరాలపాడు ప్రజాదర్బార్ కార్యక్రమంలో MLA కొలికపూడి శ్రీనివాస్ కన్నెర్ర చేశారు. మానుకొండ రామకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో ఎస్సీ అధికారికి క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే విషయం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు.
మిర్యాలగూడ ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో కలిసి నేడు డంపింగ్ యార్డ్‌ను సందర్శించారు. చెత్తను రీసైక్లింగ్ చేసి అక్కడి నుంచి పూర్తిగా తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
అనకాపల్లి జిల్లా చోడవరం గర్ల్స్ హైస్కూల్‌లో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. డీఈవో అప్పారావు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో మొత్తం 216 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు తెలిపారు.
విజయవాడలోని హనుమాన్ జంక్షన్ వద్ద జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. బాపులపాడు పంచాయతీలో పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలన్నారు. మల్లవల్లి ఏపీఐఐసీకి భూములిచ్చిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. ఖానాపూర్ మున్సిపాలిటీతో సమానంగా తమకు కూడా జీవో ప్రకారం వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ కార్మికులతో చర్చలు జరిపి సముదాయించినప్పటికీ, సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని వారు తెలిపారు.
అమెరికా తెలుగు అసోసియేషన్ బృందం యాదగిరిగుట్టలోని శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంది. ఈ సందర్భంగా బృందం సభ్యులు లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు, ఆర్చనలు నిర్వహించారు. దర్శనం అనంతరం యాదగిరిపల్లి గ్రామ పరిధిలోని ZPHS స్కూల్లో TTA బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.
జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. ఇందులో భాగంగా ఎండీ కాకర్ల శ్రీనివాస్‌ను ఈడీ అధికారులు కోర్టుకు తరలించారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ప్రీలాండ్ పేరుతో ఎండీ కాకర్ల శ్రీనివాస్ ఏకంగా 300కోట్ల రుపాయలు మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు.
సుప్రీంకోర్టులో ఇవాళ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రాలేదు. రేపటి నుంచి సుప్రీంకోర్టుకు వింటర్ వెకేషన్ హాలిడేస్ ఉన్నాయి. శీతాకాల సెలవుల అనంతరమే సుప్రీంకోర్టు కేసు విచారించనున్నది. జనవరి 5 తరువాత కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
దట్టమైన పొగమంచు, కాలుష్యంతో దేశ రాజధాని డిల్లీ అల్లాడుతోంది. విమానాల రద్దు, ట్రాఫిక్ అంతరాయంతో జనజీవనం స్తంభించింది. AQI 373కు చేరడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పీయూసీ లేని వాహనాలకు ఇంధనం నిలిపివేసి, సరిహద్దుల్లో తనిఖీలు పెంచింది.
అక్రమ వలసలు, 8 యుద్ధాలను నిలువరించడంలో తాను విజయం సాధించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టారిఫ్స్ వలనే ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని, గత ప్రభుత్వం సృష్టించిన అస్తవ్యస్త స్థితిని 11 నెలల్లో చక్కదిద్దానని తెలిపారు. వలసదారులను వెనక్కి పంపడం, ఉపాధి కల్పన, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం వంటి అంశాలను తన విజయాల జాబితాలో చేర్చారు.
2026 టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా తనను తాను సన్నద్ధం చేసుకుంటున్నట్లు టీమ్ ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. సరైన లెన్త్, నిలకడైన ఆత్మవిశ్వాసమే తన సక్సెస్ సీక్రెట్ అని అన్నాడు. గత మూడు నెలలుగా తన ప్రణాళికలు బాగా వర్కౌట్ అవుతున్నాయని, ప్రత్యర్థులను అర్థం చేసుకుంటూ నిరంతరం మెరుగుపడుతున్నట్లు వివరించాడు.
హీరో రవితేజ హీరోగా దర్శకుడు కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి. ప్రమోషన్స్‌లో భాగంగా టీజర్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. వినోదభరితంగా ఓ సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్లు టీజర్ తెలియజేస్తోంది. ఈ సినిమా 2026 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.